కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

121వ అధ్యాయం

“ధైర్యం తెచ్చుకోండి! నేను లోకాన్ని జయించాను”

“ధైర్యం తెచ్చుకోండి! నేను లోకాన్ని జయించాను”

యోహాను 16:1-33

  • కొంతకాలం తర్వాత అపొస్తలులు ఇక యేసును చూడరు

  • అపొస్తలుల దుఃఖం సంతోషంగా మారుతుంది

యేసు, ఆయన అపొస్తలులు పస్కా భోజనాన్ని ముగించుకుని మేడగది నుండి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు యేసు వాళ్లకు చాలా విషయాలు చెప్పాడు. “మీరు తడబడకూడదని ఈ విషయాలు మీకు చెప్పాను” అని అంటూ, యేసు వాళ్లను ఇలా హెచ్చరించాడు: “ప్రజలు మిమ్మల్ని సమాజమందిరం నుండి వెలివేస్తారు. నిజానికి, మిమ్మల్ని చంపే ప్రతీ ఒక్కరు తాను దేవునికి పవిత్రసేవ చేస్తున్నానని అనుకునే సమయం రాబోతుంది.”—యోహాను 16:1, 2.

ఆ హెచ్చరిక విని అపొస్తలులు కంగారుపడి ఉంటారు. వాళ్లు ద్వేషించబడతారని యేసు ఇంతకుముందు కూడా చెప్పాడు, కానీ వాళ్లు చంపబడతారని సూటిగా చెప్పడం ఇదే మొదటిసారి. ఆయన ఈ విషయాన్ని వాళ్లకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆయన ఇలా అన్నాడు: “మొదట్లో నేను ఈ విషయాలు మీకు చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు నేను మీతో ఉన్నాను.” (యోహాను 16:4) ఇప్పుడు ఆయన వెళ్లిపోబోతున్నాడు కాబట్టి వాళ్లను సిద్ధం చేస్తున్నాడు. దానివల్ల వాళ్లు రాబోయే రోజుల్లో తడబడకుండా స్థిరంగా ఉండగలుగుతారు.

తర్వాత యేసు ఇలా అన్నాడు: “నన్ను పంపించిన ఆయన దగ్గరికి వెళ్తున్నాను; అయినాసరే మీలో ఎవ్వరూ, ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని నన్ను అడగట్లేదు.” అపొస్తలులు కాసేపటి క్రితం వరకు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పమని అడిగారు. (యోహాను 13:36; 14:5; 16:5) కానీ ఇప్పుడు, వాళ్లు హింసించబడతారని యేసు చెప్పగానే వాళ్లు కంగారుపడి దుఃఖంలో మునిగిపోయారు. ఆయన పొందబోయే మహిమ గురించి గానీ, నిజమైన ఆరాధకులకు ఏం జరుగుతుందని గానీ వాళ్లు అడగలేదు. యేసు అది గమనించి, “నేను ఈ విషయాలు మీకు చెప్పడం వల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి” అన్నాడు.—యోహాను 16:6.

తర్వాత యేసు ఇలా వివరించాడు: “నేను వెళ్లేది మీ మంచి కోసమే. ఎందుకంటే నేను వెళ్లకపోతే ఆ సహాయకుడు మీ దగ్గరికి రాడు; కానీ నేను వెళ్తే, ఆ సహాయకుణ్ణి మీ దగ్గరికి పంపిస్తాను.” (యోహాను 16:7) యేసు చనిపోయి పరలోకానికి వెళ్తేనే, ఆయన శిష్యులు పవిత్రశక్తిని పొందగలరు. తన ప్రజలు భూమ్మీద ఎక్కడున్నా, యేసు ఆ సహాయకుణ్ణి పంపించగలడు.

పవిత్రశక్తి “పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి” లోకానికి ఒప్పింపజేసే రుజువుల్ని ఇస్తుంది. (యోహాను 16:8) అవును, లోకం దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచడంలో విఫలమై “పాపం” చేసిందని పవిత్రశక్తి రుజువు చేస్తుంది. యేసు పరలోకానికి వెళ్లడం ద్వారా ఆయన “నీతి” రుజువౌతుంది, అలాగే ‘ఈ లోక పరిపాలకుడైన’ సాతాను కఠినమైన “తీర్పు” పొందడం ఎందుకు సరైనదో నిరూపించబడుతుంది.—యోహాను 16:11.

తర్వాత యేసు ఇలా అన్నాడు: “నేను మీకు చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు.” పవిత్రశక్తి కుమ్మరించబడినప్పుడు, అది ఇచ్చే నడిపింపుతో వాళ్లు “సత్యాన్ని పూర్తిగా” అర్థం చేసుకోగలుగుతారు, ఆ సత్యానికి అనుగుణంగా జీవించగలుగుతారు.—యోహాను 16:12, 13.

యేసు ఇంకా ఇలా అన్నాడు: “కొంతకాలం తర్వాత మీరు ఇక నన్ను చూడరు, అయితే ఇంకొంతకాలం తర్వాత మీరు నన్ను చూస్తారు.” అపొస్తలులు ఆ మాటలకు ఆశ్చర్యపోయి, దాని అర్థం ఏమిటా అని వాళ్లలోవాళ్లు మాట్లాడుకున్నారు. వాళ్లు దాని గురించి అడగాలనుకుంటున్నారని యేసు గ్రహించి ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను: మీరు ఏడుస్తారు, దుఃఖపడతారు కానీ లోకం మాత్రం సంతోషిస్తుంది; మీరు దుఃఖపడతారు కానీ మీ దుఃఖం సంతోషంగా మారుతుంది.” (యోహాను 16:16, 20) ఇంకొన్ని గంటల తర్వాత మధ్యాహ్నం సమయంలో యేసు చంపబడినప్పుడు మతనాయకులు సంతోషిస్తారు, శిష్యులు దుఃఖిస్తారు. కానీ యేసు పునరుత్థానమైనప్పుడు, వాళ్ల దుఃఖం సంతోషంగా మారుతుంది! ఆయన వాళ్లమీద పవిత్రశక్తిని కుమ్మరించినప్పుడు ఆ సంతోషం రెట్టింపు అవుతుంది.

అపొస్తలుల పరిస్థితిని యేసు ఇలా వర్ణించాడు: “బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు స్త్రీ వేదన పడుతుంది. అయితే బిడ్డను కన్న తర్వాత, ఆ బిడ్డను చూసిన ఆనందంలో ఇక ఆ బాధను గుర్తుచేసుకోదు.” తర్వాత ఆయన వాళ్లను ఇలా ప్రోత్సహించాడు: “అలాగే మీరు కూడా ఇప్పుడు దుఃఖపడుతున్నారు; కానీ నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను, అప్పుడు మీ హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతాయి, మీ ఆనందాన్ని ఎవ్వరూ తీసేయలేరు.”—యోహాను 16:21, 22.

అపొస్తలులు ఇంతకుముందెప్పుడూ యేసు పేరున ప్రార్థించలేదు. అయితే యేసు ఇప్పుడు ఇలా చెప్తున్నాడు: “ఆ రోజు మీరు తండ్రిని నా పేరున వేడుకుంటారు.” ఎందుకు? తండ్రి వాళ్ల ప్రార్థన వినడనా? కాదు. నిజానికి యేసు ఇలా చెప్పాడు: ‘స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు; ఎందుకంటే దేవుని ప్రతినిధిగా వచ్చిన నన్ను మీరు ప్రేమించారు.’—యోహాను 16:26, 27.

యేసు చెప్పిన ప్రోత్సాహకరమైన మాటలు వాళ్లలో ధైర్యాన్ని నింపి ఉంటాయి. అందుకే వాళ్లు దృఢంగా ఇలా అన్నారు: “నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చావని దీన్నిబట్టి మేము నమ్ముతున్నాం.” కానీ వాళ్ల దృఢ నిశ్చయత త్వరలోనే పరీక్షించబడుతుంది. కాసేపట్లో జరగబోయే దాని గురించి యేసు ఇలా వివరించాడు: “ఇదిగో! మీలో ప్రతీ ఒక్కరు తమతమ ఇళ్లకు పారిపోయి, నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతుంది. నిజానికి అది ఇప్పటికే వచ్చేసింది.” అయితే ఆయన వాళ్లకు ఇలా భరోసా ఇచ్చాడు: “నా వల్ల మీరు శాంతి పొందాలని మీకు ఈ విషయాలు చెప్పాను. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయితే ధైర్యం తెచ్చుకోండి! నేను లోకాన్ని జయించాను.” (యోహాను 16:30-33) యేసు వాళ్లను విడిచిపెట్టడు కాబట్టి వాళ్లు లోకాన్ని జయించగలరు. వాళ్ల యథార్థతను పాడుచేయాలని సాతాను, అతని లోకం ఎంత ప్రయత్నించినా, తనలాగే వాళ్లు కూడా నమ్మకంగా దేవుని ఇష్టం చేయడం ద్వారా లోకాన్ని జయిస్తారని ఆయన నమ్మాడు.