కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

127వ అధ్యాయం

యేసును పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు

యేసును పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు

మత్తయి 27:1-11 మార్కు 15:1 లూకా 22:66–23:3 యోహాను 18:28-35

  • ఉదయం మహాసభ యేసును విచారించింది

  • ఇస్కరియోతు యూదా ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు

  • యేసుకు శిక్ష విధించడానికి పిలాతు దగ్గరికి పంపించారు

యేసు ఎవరో తెలీదని పేతురు మూడోసారి అన్నాడు. అప్పుడే తెల్లవారుతోంది. ఆ రాత్రి మహాసభ సభ్యులు యేసు మీద చట్టవిరుద్ధమైన విచారణ జరిపి వెళ్లిపోయారు. అయితే వాళ్లు శుక్రవారం ఉదయం మళ్లీ సమావేశమయ్యారు. బహుశా చట్టబద్ధంగా విచారణ చేస్తున్నట్లు చూపించుకోవడానికి అలా సమావేశమై ఉంటారు. యేసును మళ్లీ మహాసభ ముందుకు తీసుకొచ్చారు.

“నువ్వు క్రీస్తువైతే మాతో చెప్పు” అని వాళ్లు మళ్లీ అడిగారు. అప్పుడు యేసు, “నేను మీతో చెప్పినా మీరు అస్సలు నమ్మరు. అంతేకాదు, ఒకవేళ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు జవాబు చెప్పరు” అన్నాడు. అయితే, దానియేలు 7:13 లో ప్రవచించబడిన వ్యక్తి తానే అని ధైర్యంగా చెప్తూ యేసు ఇలా అన్నాడు: “ఇప్పటినుండి మానవ కుమారుడు దేవుని శక్తివంతమైన కుడిచెయ్యి దగ్గర కూర్చొని ఉంటాడు.”—లూకా 22:67-69; మత్తయి 26:63.

వాళ్లు, “అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అని అంటూ ఉన్నారు. దానికి ఆయన, “నేను దేవుని కుమారుణ్ణని మీరే అంటున్నారు కదా” అన్నాడు. దైవదూషణ చేశాడనే నేరం మీద యేసును చంపించడానికి ఈ మాట సరిపోతుంది అనుకుని, “మనకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా?” అని వాళ్లు అన్నారు. (లూకా 22:70, 71; మార్కు 14:64) దాంతో, ఆయన్ని బంధించి రోమా అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు.

యేసును పిలాతు దగ్గరికి తీసుకెళ్లడం ఇస్కరియోతు యూదా చూసివుంటాడు. యేసును శిక్షించబోతున్నారని తెలియగానే యూదాకు ఒకలాంటి బాధ, మనస్తాపం కలిగాయి. కానీ అతను నిజమైన పశ్చాత్తాపం చూపించి దేవునివైపు తిరగలేదు. అతను 30 వెండి నాణేలు తిరిగివ్వడానికి ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్లి, “నేను ఒక నిర్దోషిని అప్పగించి పాపం చేశాను” అన్నాడు. అప్పుడు వాళ్లు నిర్దాక్షిణ్యంగా, “అయితే మాకేంటి? అది నీ సమస్య!” అన్నారు.—మత్తయి 27:4.

యూదా ఆ 30 వెండి నాణేల్ని ఆలయంలో విసిరేసి, చేసిన తప్పులు చాలవన్నట్లు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అతను ఉరి వేసుకోవడానికి ఒక చెట్టు కొమ్మకు తాడు కట్టాడు. బహుశా ఆ కొమ్మ విరిగిపోవడం వల్ల, అతని శరీరం కిందున్న రాళ్ల మీద పడి చీలిపోయింది.—అపొస్తలుల కార్యాలు 1:17, 18.

యేసును తెల్లవారుజామునే పొంతి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు ఒక అన్యుడు కాబట్టి అతని భవనంలోకి వెళ్తే అపవిత్రం అవుతామని, యూదులు లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. ఎందుకంటే అపవిత్రం అయినవాళ్లు, పులవని రొట్టెల పండుగలోని మొదటి రోజున అంటే నీసాను 15న ప్రత్యేకమైన భోజనం తినే అర్హత కోల్పోతారు. ఆ పండుగను కూడా పస్కా కాలంలో భాగంగానే చూసేవాళ్లు.

పిలాతు బయటికి వచ్చి, “ఇతని మీద మీరు మోపుతున్న నేరమేమిటి?” అని వాళ్లను అడిగాడు. అప్పుడు వాళ్లు, “ఇతను తప్పు చేయకపోయుంటే ఇతన్ని నీకు అప్పగించేవాళ్లం కాదు” అన్నారు. వాళ్లు తనమీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని బహుశా పిలాతు గ్రహించి, ఇలా అన్నాడు: “ఇతన్ని తీసుకెళ్లి మీరే మీ చట్టప్రకారం తీర్పు తీర్చుకోండి.” అందుకు వాళ్లు, “చట్టప్రకారం ఎవరికీ మరణశిక్ష వేసే అధికారం మాకు లేదు” అన్నారు. ఆ విధంగా, యేసును చంపాలనే తమ ఉద్దేశాన్ని యూదులు బయటపెట్టారు.—యోహాను 18:29-31.

పస్కా పండుగ సమయంలో యేసును చంపితే, బహుశా ప్రజల్లో అలజడి రేగుతుందని యూదులు భయపడ్డారు. అలా కాకుండా, రోమా ప్రభుత్వానికి ఎదురుతిరిగాడని యేసుమీద నేరం మోపగలిగితే, రోమన్లే ఆయనకు మరణశిక్ష వేస్తారు. అలా తమ చేతికి మట్టి అంటకుండా రోమన్ల చేతే యేసును చంపించవచ్చని యూదులు అనుకున్నారు.

దైవదూషణ చేశాడనే నేరం మీద యేసును తీసుకొచ్చిన సంగతిని మతనాయకులు పిలాతుకు చెప్పలేదు. బదులుగా వాళ్లు ఆయన మీద వేరే ఆరోపణలు చేశారు: “ఇతను [1] మా దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు, [2] కైసరుకు పన్ను చెల్లించకూడదని చెప్తున్నాడు, [3] తనే క్రీస్తు అనే ఒక రాజునని చెప్పుకుంటున్నాడు.”—లూకా 23:2.

తాను రాజునని యేసు చెప్పుకుంటున్నాడని యూదులు చేసిన ఆరోపణను, ఒక రోమా ప్రతినిధిగా పిలాతు పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అతను తన భవనంలోకి తిరిగెళ్లి యేసును పిలిపించి, “నువ్వు యూదుల రాజువా?” అని అడిగాడు. మరో మాటలో చెప్పాలంటే, ‘కైసరుకు వ్యతిరేకంగా నీకు నువ్వే రాజుగా ప్రకటించుకుంటూ, ఈ దేశ చట్టాన్ని మీరావా?’ అని పిలాతు అడుగుతున్నాడు. బహుశా, పిలాతు అప్పటికే తన గురించి ఏమేం విన్నాడో తెలుసుకోవడానికి, యేసు ఇలా అన్నాడు: “నీ అంతట నువ్వే ఇలా అడుగుతున్నావా? లేక వేరేవాళ్లు నా గురించి చెప్పారా?”—యోహాను 18:33, 34.

యేసు గురించిన వాస్తవాలు తనకు తెలీదనీ, వాటిని తెలుసుకోవాలని కోరుకుంటున్నాననీ చూపిస్తూ పిలాతు ఇలా అన్నాడు: “నేనేమైనా యూదుడినా? నీ సొంత ప్రజలూ ముఖ్య యాజకులే నిన్ను నాకు అప్పగించారు. ఇంతకీ నువ్వు ఏంచేశావు?”—యోహాను 18:35.

యేసు ముఖ్యమైన విషయం గురించి అంటే తన రాజ్యం గురించి చెప్పకుండా దాటేయడానికి ప్రయత్నించలేదు. ఆయన ఇచ్చిన జవాబు విని అధిపతి అయిన పిలాతు చాలా ఆశ్చర్యపోయి ఉంటాడు.