కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

128వ అధ్యాయం

పిలాతుకు, హేరోదుకు యేసులో ఏ తప్పూ కనిపించలేదు

పిలాతుకు, హేరోదుకు యేసులో ఏ తప్పూ కనిపించలేదు

మత్తయి 27:12-14, 18, 19 మార్కు 15:2-5 లూకా 23:4-16 యోహాను 18:36-38

  • పిలాతు, హేరోదు యేసును విచారించారు

యేసు తాను రాజుననే విషయాన్ని పిలాతు దగ్గర దాచడానికి ప్రయత్నించలేదు. అయితే తన రాజ్యం వల్ల రోమా సామ్రాజ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని సూచిస్తూ, యేసు ఇలా అన్నాడు: “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినదైతే, నేను యూదులకు అప్పగించబడకుండా నా సేవకులు పోరాడి ఉండేవాళ్లు. కానీ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.” (యోహాను 18:36) యేసుకు ఒక రాజ్యం ఉంది, కానీ అది ఈ లోకానికి సంబంధించినది కాదు.

పిలాతు అంతటితో వదిలేయకుండా, “అయితే నువ్వు రాజువా?” అని మళ్లీ అడిగాడు. పిలాతు సరిగ్గానే అర్థం చేసుకున్నాడని చెప్తూ, యేసు ఇలా అన్నాడు: “నేను రాజునని నువ్వే స్వయంగా అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను, అందుకే ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి లోబడే ప్రతీ ఒక్కరు నేను చెప్పేది వింటారు.”—యోహాను 18:37.

అంతకుముందు యేసు తోమాతో, “నేనే మార్గం, సత్యం, జీవం” అన్నాడు. అయితే ఇప్పుడు పిలాతుతో, తాను “సత్యం” గురించి, ముఖ్యంగా తన రాజ్యానికి సంబంధించిన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే భూమ్మీదికి పంపించబడ్డానని యేసు అన్నాడు. ప్రాణం పోయినాసరే ఆ సత్యానికే నమ్మకంగా కట్టుబడి ఉండాలని యేసు నిశ్చయించుకున్నాడు. పిలాతు ఆయన్ని, “సత్యం అంటే ఏమిటి?” అని అడిగాడు. కానీ యేసు జవాబు చెప్పేవరకు అతను ఆగలేదు. ఇప్పటివరకు విన్నవాటిని బట్టి యేసు నిర్దోషని అతనికి అర్థమైంది.—యోహాను 14:6; 18:38.

పిలాతు తన భవనం బయట వేచివున్న వాళ్ల దగ్గరికి తిరిగొచ్చాడు. బహుశా తన పక్కనే ఉన్న యేసును చూపిస్తూ, “ఇతనిలో నాకు ఏ తప్పూ కనిపించట్లేదు” అని ముఖ్య యాజకులతో, అక్కడున్న వాళ్లతో అన్నాడు. ఆ నిర్ణయం విని వాళ్లకు కోపం వచ్చింది. వాళ్లు పట్టువిడవకుండా ఇలా అన్నారు: “ఇతను గలిలయ దగ్గర మొదలుపెట్టి ఇక్కడి వరకు, యూదయ అంతటా ప్రజలకు బోధిస్తూ వాళ్లను రెచ్చగొడుతున్నాడు.”—లూకా 23:4, 5.

యూదులు వెర్రి ఆవేశంతో చేస్తున్న ఆరోపణలు విని పిలాతు ఆశ్చర్యపోయి ఉంటాడు. ముఖ్య యాజకులు, పెద్దలు అరుస్తూనే ఉండడంతో, “నీ మీద వాళ్లు ఎన్నెన్ని నిందలు వేస్తున్నారో నీకు వినబడట్లేదా?” అని పిలాతు యేసును అడిగాడు. (మత్తయి 27:13) కానీ యేసు ఏమీ జవాబు చెప్పలేదు. వాళ్లు దారుణమైన నిందలు వేస్తున్నా యేసు ప్రశాంతంగా ఉండడం చూసి, పిలాతు ఇంకా ఆశ్చర్యపోయాడు.

యేసు ప్రజలకు బోధించడం ‘గలిలయ దగ్గర మొదలుపెట్టాడని’ యూదులు చెప్పిన మాటల్నిబట్టి, యేసు గలిలయ వాడని పిలాతుకు అర్థమైంది. దాంతో, యేసుకు తీర్పు తీర్చకుండా తప్పించుకోవడానికి పిలాతుకు ఒక ఆలోచన తట్టింది. అది పస్కా పండుగ సమయం కావడంతో, గలిలయ పరిపాలకుడైన హేరోదు అంతిప (హేరోద్‌ ద గ్రేట్‌ కుమారుడు) యెరూషలేములోనే ఉన్నాడు. కాబట్టి పిలాతు యేసును హేరోదు దగ్గరికి పంపించాడు. బాప్తిస్మమిచ్చే యోహాను తల నరికించింది ఈ హేరోదే. తర్వాత, యేసు అద్భుతాలు చేస్తున్నాడని విన్నప్పుడు యోహానే మళ్లీ బ్రతికొచ్చాడేమోనని హేరోదు భయపడ్డాడు.—లూకా 9:7-9.

ఇప్పుడు యేసును కలిసే అవకాశం వచ్చినందుకు హేరోదు సంతోషించాడు. అయితే అతను యేసును కలవాలనుకున్నది ఆయనకు సహాయం చేయడానికో, ఆయన మీద వేసిన ఆరోపణలు పరిశీలించడానికో కాదు. కేవలం కుతూహలంతో “యేసు ఏదైనా అద్భుతం చేస్తే చూడాలని” అతను కోరుకున్నాడు. (లూకా 23:8) కానీ యేసు ఏ అద్భుతమూ చేయలేదు. నిజానికి, హేరోదు ప్రశ్నించినప్పుడు ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నిరాశపడిన హేరోదు, అతని సైనికులు యేసును ‘అవమానించారు.’ (లూకా 23:11) ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి, ఎగతాళి చేశారు. తర్వాత హేరోదు ఆయన్ని మళ్లీ పిలాతు దగ్గరికి పంపించాడు. ఒకప్పుడు శత్రువులైన హేరోదు, పిలాతు ఇప్పుడు మంచి మిత్రులయ్యారు.

యేసు తిరిగొచ్చిన తర్వాత, పిలాతు ముఖ్య యాజకుల్ని, యూదా నాయకుల్ని, ప్రజల్ని పిలిపించి ఇలా అన్నాడు: “నేను ఇతన్ని మీ ముందే విచారణ చేశాను. ఇతని మీద మీరు మోపుతున్న నేరాల విషయంలో నాకు ఏ ఆధారం కనిపించలేదు. నిజానికి హేరోదుకు కూడా ఏ ఆధారం కనిపించలేదు, అందుకే ఇతన్ని మళ్లీ మా దగ్గరికి పంపించాడు. మరణశిక్ష వేసేంత తప్పేదీ ఇతను చేయలేదు. కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేస్తాను.”—లూకా 23:14-16.

కేవలం ఈర్ష్యతోనే యాజకులు యేసును అప్పగించారని పిలాతు గ్రహించి, ఆయన్ని విడుదల చేయాలనుకున్నాడు. దానికితోడు పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, అతని భార్య “ఆ నీతిమంతుని విషయంలో జోక్యం చేసుకోకు. ఆయన వల్ల ఇవాళ కలలో [దేవుడు కలగజేసిన కలలో] నేను చాలా ఆందోళనపడ్డాను” అని కబురు పంపించింది.—మత్తయి 27:19.

యేసు నిర్దోషి కాబట్టి ఆయన్ని విడుదల చేయాలని పిలాతుకు తెలుసు. మరి ఇప్పుడు అతను ఏం చేస్తాడు?