కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

132వ అధ్యాయం

“ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు”

“ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు”

మత్తయి 27:45-56 మార్కు 15:33-41 లూకా 23:44-49 యోహాను 19:25-30

  • యేసు కొయ్య మీద చనిపోయాడు

  • యేసు చనిపోయినప్పుడు జరిగిన అసాధారణ సంఘటనలు

ఇప్పుడు మధ్యాహ్నం అయింది. “దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుండి దాదాపు మధ్యాహ్నం మూడింటి వరకు ఆ దేశమంతా” అంతుచిక్కని చీకటి కమ్ముకుంది. (మార్కు 15:33) ఆ చీకటి సూర్యగ్రహణం వల్ల కలిగింది కాదు. ఎందుకంటే, సూర్యగ్రహణం అమావాస్య సమయంలో వస్తుంది కానీ, చంద్రుడు నిండుగా ఉండే పస్కా కాలంలో రాదు. పైగా, సూర్యగ్రహణం కొన్ని నిమిషాలపాటు మాత్రమే ఉంటుంది, కానీ ఈ చీకటి కొన్ని గంటలపాటు ఉంది. కాబట్టి ఈ చీకటి ఖచ్చితంగా దేవుడు కలిగించిందే. యేసును ఎగతాళి చేసినవాళ్లకు అప్పుడు ఎలా అనిపించివుంటుందో ఊహించండి!

ఆ చీకట్లో నలుగురు స్త్రీలు అంటే యేసు తల్లి, సలోమే, మగ్దలేనే మరియ, చిన్న యాకోబు వాళ్ల అమ్మ మరియ హింసాకొయ్య దగ్గరికి వచ్చారు.

అపొస్తలుడైన యోహాను, “హింసాకొయ్య దగ్గర” ఏడుస్తున్న మరియ పక్కన నిలబడి ఉన్నాడు. కని, పెంచిన కుమారుడు కళ్లముందే అలా కొయ్యపై వేదనతో తల్లడిల్లుతుంటే, ఆమె గుండె తరుక్కుపోతోంది. “ఒక పొడవాటి ఖడ్గం” తనలో నుండి దూసుకుపోయినంతగా ఆమె బాధపడుతోంది. (యోహాను 19:25; లూకా 2:35) యేసు తీవ్రమైన నొప్పిలో కూడా తన తల్లి బాగోగుల గురించి ఆలోచించాడు. ఆయన కష్టంగా యోహాను వైపు తల తిప్పి, తన తల్లితో ఇలా అన్నాడు: “అమ్మా, ఇదిగో! నీ కుమారుడు!” తర్వాత తన తల్లి వైపు తల తిప్పి, యోహానుతో ఇలా అన్నాడు: “ఇదిగో! మీ అమ్మ!”—యోహాను 19:26, 27.

అప్పటికే మరియ విధవరాలు. అందుకే యేసు ఆమె బాధ్యతను, తనకు ఎంతో ఇష్టమైన అపొస్తలునికి అప్పగిస్తున్నాడు. యేసు తమ్ముళ్లు, అంటే మరియకు పుట్టిన మిగతా కుమారులు అప్పటికి ఇంకా ఆయనపై విశ్వాసం ఉంచలేదు. కాబట్టి తన తల్లి భౌతిక, ఆధ్యాత్మిక బాగోగులు చూసుకోమని యేసు యోహానుకు చెప్పాడు. ఎంత చక్కని ఆదర్శం!

దాదాపు మధ్యాహ్నం మూడు గంటలకు, యేసు “నాకు దాహంగా ఉంది” అన్నాడు. అలా లేఖనాల్లో ఉన్న ప్రవచనం నెరవేరింది. (యోహాను 19:28; కీర్తన 22:15) తన కుమారుని యథార్థత పూర్తిగా పరీక్షించబడేలా యెహోవా తన కాపుదలను తీసేసినట్లు యేసుకు అర్థమైంది. అందుకే ఆయన “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని బిగ్గరగా అన్నాడు. ఆయన అరామిక్‌ భాషలో గలిలయ యాసలో మాట్లాడివుండవచ్చు. ఆ మాటలకు, “నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?” అని అర్థం. అక్కడ నిలబడివున్న కొంతమంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుని, “చూడండి! ఇతను ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. ఒకతను పరుగెత్తుకుంటూ వెళ్లి స్పాంజీని పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, ఒక కర్రకు తగిలించి, తాగమని యేసుకు ఇచ్చాడు. కానీ మిగతావాళ్లు మాత్రం, “ఉండండి! ఇతన్ని కిందికి దించడానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం” అన్నారు.—మార్కు 15:34-36.

తర్వాత యేసు “అంతా పూర్తయింది!” అని బిగ్గరగా అన్నాడు. (యోహాను 19:30) అవును, ఏ పని కోసమైతే తండ్రి తనను భూమ్మీదికి పంపించాడో ఆ పనంతా యేసు పూర్తిచేశాడు. చివరిగా ఆయన ఇలా అన్నాడు: “తండ్రీ, నా ప్రాణాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను.” (లూకా 23:46) తండ్రి తనను పునరుత్థానం చేస్తాడన్న పూర్తి నమ్మకంతో యేసు ఆ మాట అని, తల వంచి, తుదిశ్వాస విడిచాడు.

అప్పుడు, పెద్ద భూకంపం వచ్చి బండలు బద్దలైపోయాయి. ఆ భూకంపం ధాటికి యెరూషలేము బయట ఉన్న సమాధులు తెరుచుకుని, శవాలు బయటపడ్డాయి. అటుగా వెళ్తున్నవాళ్లు ఆ శవాల్ని చూసి “పవిత్ర నగరంలోకి” వెళ్లి, జరిగినదాని గురించి చెప్పారు.—మత్తయి 12:11; 27:51-53.

యేసు చనిపోయినప్పుడు ఆలయంలో పవిత్ర స్థలానికి, అతి పవిత్ర స్థలానికి మధ్య ఉన్న బరువైన, పొడవాటి తెర పైనుండి కిందికి రెండుగా చిరిగిపోయింది. తన కుమారుణ్ణి చంపిన వాళ్లమీద దేవుని ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటుందో అది చూపించింది. అతి పవిత్ర స్థలానికి, అంటే పరలోకానికి వెళ్లేందుకు మార్గం తెరవబడిందని కూడా అది సూచించింది.—హెబ్రీయులు 9:2, 3; 10:19, 20.

అప్పుడు ప్రజలు చాలా భయపడ్డారు. అక్కడున్న సైనికాధికారి, “ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు” అన్నాడు. (మార్కు 15:39) పిలాతు యేసును విచారిస్తూ ఆయన దేవుని కుమారుడా కాదా అనే విషయాన్ని చర్చించినప్పుడు, బహుశా ఆ సైనికాధికారి కూడా ఉండివుండవచ్చు. అయితే యేసు నీతిమంతుడని, నిజానికి దేవుని కుమారుడని ఇప్పుడు అతనికి నమ్మకం కుదిరింది.

ఇతరులు ఈ అసాధారణ సంఘటనలు చూసి దుఃఖంతో, సిగ్గుతో “గుండెలు బాదుకుంటూ” తమ ఇళ్లకు తిరిగెళ్లారు. (లూకా 23:48) యేసుతో కలిసి ప్రయాణించిన చాలామంది స్త్రీలు కాస్త దూరంలో నిలబడి అదంతా చూస్తున్నారు. వాళ్లు కూడా ఈ అసాధారణ సంఘటనలన్నీ చూసి ఎంతో చలించిపోయారు.