కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

134వ అధ్యాయం

యేసు బ్రతికాడు!

యేసు బ్రతికాడు!

మత్తయి 28:3-15 మార్కు 16:5-8 లూకా 24:4-12 యోహాను 20:2-18

  • యేసు పునరుత్థానం అయ్యాడు

  • సమాధి దగ్గర జరిగిన సంఘటనలు

  • యేసు కొంతమంది స్త్రీలకు కనిపించాడు

సమాధి ఖాళీగా ఉండడం చూసి ఆ స్త్రీలు అవాక్కయ్యారు! మగ్దలేనే మరియ పరుగెత్తుకుంటూ “సీమోను పేతురు దగ్గరికి, యేసు ప్రేమించిన ఇంకో శిష్యుడి దగ్గరికి,” అంటే అపొస్తలుడైన యోహాను దగ్గరికి వెళ్లింది. (యోహాను 20:2) అయితే, సమాధి దగ్గరే ఉన్న మిగతా స్త్రీలు ఒక దేవదూతను చూశారు. సమాధి లోపల “తెల్ల బట్టలు వేసుకున్న” మరో దేవదూత ఉన్నాడు.—మార్కు 16:5.

ఆ ఇద్దరిలో ఒక దూత వాళ్లతో ఇలా అన్నాడు: “భయపడకండి, కొయ్యపై మరణశిక్ష వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన బ్రతికించబడ్డాడు. వచ్చి, ఆయన్ని ఉంచిన చోటును చూడండి. త్వరగా వెళ్లి, ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని ఆయన శిష్యులకు చెప్పండి. అలాగే వాళ్లతో, ‘ఇదిగో! ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్తున్నాడు . . . ’ అని చెప్పండి.” (మత్తయి 28:5-7) అప్పుడు వాళ్లు “భయంతో వణికిపోతూ ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరౌతూ” ఆ విషయాన్ని శిష్యులకు చెప్పాలని పరుగెత్తుకుంటూ వెళ్లారు.—మార్కు 16:8.

అప్పటికే మగ్దలేనే మరియ పేతురు యోహానుల దగ్గరికి వెళ్లింది. ఆమె ఆయాసపడుతూ, “వాళ్లు ప్రభువును సమాధిలో నుండి తీసుకెళ్లిపోయారు, ఆయన్ని ఎక్కడ ఉంచారో మాకు తెలీదు” అని చెప్పింది. (యోహాను 20:2) దాంతో పేతురు యోహానులు సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లారు. యోహాను పేతురు కన్నా వేగంగా పరుగెత్తి, అక్కడికి ముందుగా చేరుకున్నాడు. అతను సమాధిలోకి తొంగి చూసినప్పుడు, అక్కడ నారబట్టలు పడివున్నాయి. అతను లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయాడు.

పేతురు పరుగెత్తుకుంటూ నేరుగా సమాధిలోకి వెళ్లాడు. అక్కడున్న నారబట్టల్ని, యేసు తలకు చుట్టిన వస్త్రాన్ని చూశాడు. తర్వాత యోహాను లోపలికి వచ్చి చూసి, మరియ చెప్పింది నిజమేనని నమ్మాడు. అయితే, తాను తిరిగి లేస్తానని యేసు అంతకుముందు చెప్పిన విషయాన్ని వాళ్లు గ్రహించలేదు. (మత్తయి 16:21) ఏం చేయాలో తెలీక వాళ్లు ఇంటికి వెళ్లిపోయారు. కానీ సమాధి దగ్గరికి తిరిగొచ్చిన మరియ మాత్రం అక్కడే ఉండిపోయింది.

ఈలోపు, మిగతా స్త్రీలు యేసు పునరుత్థానం అయ్యాడనే విషయం శిష్యులకు చెప్పాలని బయల్దేరారు. వాళ్లు పరుగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు, దారిలో యేసు వాళ్లను కలిసి పలకరించాడు. అప్పుడు వాళ్లు ఆయన పాదాల మీద పడి, “వంగి నమస్కారం చేశారు.” యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “భయపడకండి! మీరు వెళ్లి నా సహోదరుల్ని గలిలయకు రమ్మని చెప్పండి, అక్కడ వాళ్లు నన్ను చూస్తారు.”—మత్తయి 28:9, 10.

ఆ రోజు తెల్లవారకముందు ఒక భూకంపం వచ్చింది, దేవదూతలు ప్రత్యక్షమయ్యారు, సమాధికి కాపలా కాస్తున్న సైనికులు ‘వణికిపోయి, చచ్చినవాళ్లలా అయ్యారు.’ వాళ్లు తేరుకున్నాక నగరంలోకి వెళ్లి, “జరిగిన వాటన్నిటి గురించి ముఖ్య యాజకులకు చెప్పారు.” అప్పుడు యాజకులు, యూదుల పెద్దలు కలిసి మాట్లాడుకుని, జరిగిన విషయాన్ని దాచిపెట్టమని ఆ సైనికులకు డబ్బులు ఇచ్చారు. “రాత్రిపూట ఆయన శిష్యులు వచ్చి మేము నిద్రపోతున్నప్పుడు ఆయన్ని ఎత్తుకెళ్లిపోయారు” అని చెప్పమన్నారు.—మత్తయి 28:4, 11, 13.

కాపలా కాస్తున్న సమయంలో ఎవరైనా రోమా సైనికులు నిద్రపోతే, వాళ్లకు మరణశిక్ష విధించేవాళ్లు. కాబట్టి యాజకులు ఆ సైనికులకు ఇలా హామీ ఇచ్చారు: “ఇది [నిద్రపోయామని వాళ్లు చెప్పే అబద్ధం] అధిపతి చెవిలో పడితే అతన్ని ఒప్పించే పూచీ మాది, మీరు కంగారుపడాల్సిన అవసరం ఉండదు.” (మత్తయి 28:14) సైనికులు డబ్బు తీసుకుని, యాజకులు చెప్పినట్టే చేశారు. అలా, యేసు శిష్యులే ఆయన శరీరాన్ని ఎత్తుకెళ్లారనే కట్టుకథ యూదుల్లో వ్యాపించింది.

మగ్దలేనే మరియ ఇంకా సమాధి దగ్గర ఏడుస్తూనే ఉంది. ఆమె సమాధిలోకి తొంగి చూసినప్పుడు, తెల్ల బట్టలు వేసుకున్న ఇద్దరు దేవదూతలు కనిపించారు! యేసు శరీరాన్ని ఉంచిన చోట, తల దగ్గర ఒక దేవదూత, కాళ్ల దగ్గర ఒక దేవదూత కూర్చుని ఉన్నారు. వాళ్లు మరియను, “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు. అప్పుడామె, “ఎవరో నా ప్రభువును తీసుకెళ్లిపోయారు, ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలీదు” అంది. ఆమె వెనక్కి తిరిగినప్పుడు ఇంకో వ్యక్తి కనిపించాడు. అతను కూడా వాళ్లు అడిగిన ప్రశ్నే అడిగి, తర్వాత ఇలా అన్నాడు: “ఎవరి కోసం వెదుకుతున్నావు?” అతను తోటమాలి అనుకుని ఆమె ఇలా అంది: “అయ్యా, నువ్వు ఆయన్ని తీసుకెళ్లివుంటే ఆయన్ని ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ని తీసుకెళ్తాను.”—యోహాను 20:13-15.

నిజానికి మరియ మాట్లాడుతున్నది పునరుత్థానమైన యేసుతోనే. కానీ, ఆమె ఆయన్ని గుర్తుపట్టలేదు. ఆయన “మరియా!” అని పిలవగానే, తనను అలా పిలిచేది యేసేనని గుర్తుపట్టి, ఆమె సంతోషంతో “రబ్బోనీ!” (అంటే, “బోధకుడా!”) అని పిలిచింది. యేసు పరలోకానికి వెళ్లిపోతాడేమో అన్న కంగారులో, ఆమె ఆయన్ని పట్టుకునే ఉంది. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నేనింకా తండ్రి దగ్గరికి వెళ్లలేదు కాబట్టి నన్ను అలాగే పట్టుకుని ఉండవద్దు. అయితే, నా సహోదరుల దగ్గరికి వెళ్లి, ‘నా తండ్రీ మీ తండ్రీ, నా దేవుడూ మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను’ అని చెప్పు.”—యోహాను 20:16, 17.

అపొస్తలులు, ఇతర శిష్యులు ఉన్న చోటికి మరియ పరుగెత్తుకుంటూ వెళ్లి, “నేను ప్రభువును చూశాను!” అని చెప్పింది. అప్పటికే, ఇతర స్త్రీలు కూడా ఆ విషయాన్ని వాళ్లకు చెప్పారు. (యోహాను 20:18) అయినప్పటికీ, “వాళ్లకు అవి అర్థంపర్థంలేని మాటల్లా అనిపించాయి.”—లూకా 24:11.