కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

136వ అధ్యాయం

గలిలయ సముద్రం ఒడ్డున శిష్యులకు కనిపించాడు

గలిలయ సముద్రం ఒడ్డున శిష్యులకు కనిపించాడు

యోహాను 21:1-25

  • గలిలయ సముద్రం దగ్గర యేసు కనిపించాడు

  • పేతురు, మరితరులు గొర్రెల్ని మేపాలి

యేసు తన అపొస్తలులతో గడిపిన చివరి రాత్రి ఇలా అన్నాడు: “నేను బ్రతికించబడిన తర్వాత, మీకన్నా ముందు గలిలయకు వెళ్తాను.” (మత్తయి 26:32; 28:7, 10) అందుకే యేసు అనుచరుల్లో చాలామంది గలిలయకు బయల్దేరారు. కానీ వాళ్లు అక్కడికి వెళ్లి ఏం చేయాలి?

గలిలయకు వెళ్లాక, ఒక సమయంలో పేతురు ఆరుగురు అపొస్తలులతో ఇలా అన్నాడు: “నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను.” అప్పుడు వాళ్లందరూ, “మేము కూడా నీతో వస్తాం” అన్నారు. (యోహాను 21:3) రాత్రంతా కష్టపడినా చేపలు పడలేదు. తెల్లవారుతుండగా, యేసు సముద్రం ఒడ్డున నిలబడ్డాడు. కానీ వాళ్లు ఆయన్ని గుర్తుపట్టలేదు. యేసు వాళ్లతో, “పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా?” అని అడిగాడు. వాళ్లు, “లేదు” అన్నారు. అందుకు ఆయన, “పడవ కుడిపక్క వల వేయండి, మీకు కొన్ని చేపలు దొరుకుతాయి” అని చెప్పాడు. (యోహాను 21:5, 6) అప్పుడు చాలా చేపలు పడ్డాయి, దాంతో వాళ్లు ఆ వలను లాగలేకపోయారు.

అది చూసి యోహాను పేతురుతో, “ఆయన ప్రభువే!” అన్నాడు. (యోహాను 21:7) వెంటనే, పేతురు తాను చేపలు పడుతున్నప్పుడు తీసేసిన పైవస్త్రాన్ని వేసుకుని, సముద్రంలోకి దూకి దాదాపు 90 మీటర్లు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. పడవలో ఉన్న మిగతావాళ్లు చేపలతో నిండివున్న వలను నెమ్మదిగా లాగుతూ ఒడ్డుకు వస్తున్నారు.

వాళ్లు ఒడ్డుకు వస్తుండగా, “కాలుతున్న బొగ్గుల మీద ఉన్న చేపల్ని, రొట్టెను చూశారు.” యేసు వాళ్లతో, “మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండి” అన్నాడు. పేతురు వెళ్లి ఆ వలను ఒడ్డుకు లాగాడు. అందులో 153 పెద్ద చేపలు ఉన్నాయి! యేసు, “వచ్చి భోంచేయండి” అని వాళ్లతో అన్నాడు. ఒక్కరు కూడా ఆయన్ని “నువ్వు ఎవరు?” అని అడిగే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆయన యేసని వాళ్లకు అర్థమైంది. (యోహాను 21:9-12) శిష్యులు గుంపుగా ఉన్నప్పుడు యేసు కనిపించడం ఇది మూడోసారి.

యేసు వాళ్లందరికీ రొట్టెను, చేపల్ని ఇచ్చాడు. తర్వాత ఆయన, బహుశా వాళ్లు పట్టుకొచ్చిన చేపలవైపు చూస్తూ, “యోహాను కుమారుడివైన సీమోనూ, నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. పేతురు తన చేపల వ్యాపారానికి ప్రాముఖ్యత ఇస్తాడా, లేక యేసు అప్పగించే పనికి ప్రాముఖ్యత ఇస్తాడా? పేతురు ఇలా జవాబిచ్చాడు: “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు.” అప్పుడు యేసు అతనితో, “నా గొర్రెపిల్లల్ని మేపు” అన్నాడు.—యోహాను 21:15.

యేసు మళ్లీ, “యోహాను కుమారుడివైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. యేసు మళ్లీ ఎందుకలా అడుగుతున్నాడో పేతురుకు అర్థంకాకపోయి ఉండవచ్చు. అయినా, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని పేతురు మనస్ఫూర్తిగా చెప్పాడు. అప్పుడు యేసు మళ్లీ ఇలా అన్నాడు: “నా చిన్న గొర్రెల్ని కాయి.”—యోహాను 21:16.

“యోహాను కుమారుడివైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని యేసు మూడోసారి అడిగాడు. బహుశా యేసు తన విశ్వసనీయతను సందేహిస్తున్నట్టు అనిపించినా పేతురు స్థిరంగా ఇలా అన్నాడు: “ప్రభువా, నీకు అన్నీ తెలుసు; నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు.” పేతురు చేయాల్సిన పనిని నొక్కిచెప్తూ యేసు మళ్లీ ఇలా అన్నాడు: “నా చిన్న గొర్రెల్ని మేపు.” (యోహాను 21:17) అవును, నాయకత్వం వహించేవాళ్లు దేవుని మందలో చేరిన గొర్రెలకు సేవచేయాలి.

దేవుడు అప్పగించిన పని చేసినందుకే యేసును బంధించి, చంపారు. పేతురుకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని చెప్తూ యేసు ఇలా అన్నాడు: “నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే బట్టలు వేసుకుని నీకు నచ్చిన చోటికి వెళ్లేవాడివి. కానీ నువ్వు ముసలివాడివి అయినప్పుడు నువ్వు చేతులు చాపుతావు, ఇంకెవరో నీకు బట్టలు వేసి నీకు నచ్చని చోటికి నిన్ను తీసుకెళ్తారు.” అయినప్పటికీ, “నన్ను అనుసరిస్తూ ఉండు” అని యేసు పేతురును ప్రోత్సహించాడు.—యోహాను 21:18, 19.

పేతురు అపొస్తలుడైన యోహానును చూసి, “ప్రభువా, మరి ఇతని సంగతేంటి?” అని అడిగాడు. అవును, యేసుకు ఎంతో ఇష్టమైన యోహాను సంగతేంటి? యేసు ఇలా అన్నాడు: “నేను వచ్చేంతవరకు అతను ఉండడం నాకిష్టమైతే నీకేంటి?” (యోహాను 21:21-23) వేరేవాళ్లు ఏం చేస్తారనేది ఆలోచించకుండా పేతురు యేసును అనుసరిస్తూ ఉండాలి. యోహాను మిగతా అపొస్తలుల కంటే ఎక్కువకాలం బ్రతుకుతాడనీ, యేసు రాజ్యాధికారంతో రావడం అతను ఒక దర్శనంలో చూస్తాడనీ యేసు చెప్తున్నాడు.

యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ రాయాలంటే ఎన్ని గ్రంథపు చుట్టలైనా సరిపోవు.