కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

70వ అధ్యాయం

పుట్టుకతోనే గుడ్డివాడైన వ్యక్తికి యేసు చూపు తెప్పించాడు

పుట్టుకతోనే గుడ్డివాడైన వ్యక్తికి యేసు చూపు తెప్పించాడు

యోహాను 9:1-18

  • పుట్టు గుడ్డివాడైన భిక్షగాడికి చూపు తెప్పించాడు

యేసు ఇంకా యెరూషలేములోనే ఉన్నాడు, అది విశ్రాంతి రోజు. యేసు, ఆయన శిష్యులు నగరంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, పుట్టుకతోనే గుడ్డివాడైన ఒక భిక్షగాడిని చూశారు. శిష్యులు యేసును ఇలా అడిగారు: “రబ్బీ, ఎవరు పాపం చేయడం వల్ల ఇతను గుడ్డివాడిగా పుట్టాడు? ఇతనా, ఇతని తల్లిదండ్రులా?”—యోహాను 9:2.

ఒక వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపం చేస్తాడా అని శిష్యులు ఆలోచిస్తుండవచ్చు. యేసు ఇలా జవాబిచ్చాడు: “ఇతను పాపం చేయడం వల్లో, ఇతని తల్లిదండ్రులు పాపం చేయడం వల్లో ఇతను గుడ్డివాడిగా పుట్టలేదు. కానీ ఇతని ద్వారా ప్రజలు దేవుని పనులు చూడగలిగేలా ఇది అవకాశం కల్పించింది.” (యోహాను 9:3) కాబట్టి, అతను లేదా అతని తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల అతను గుడ్డివాడిగా పుట్టలేదు. బదులుగా, ఆదాము చేసిన పాపం వల్ల మనుషులంతా అపరిపూర్ణతతో, గుడ్డితనం వంటి లోపాలతో పుడుతున్నారు. అయితే ఆ వ్యక్తి గుడ్డితనం, దేవుని పనుల్ని వెల్లడిచేసే అవకాశాన్ని యేసుకు ఇచ్చింది. ఆయన వేరే సందర్భాల్లో కూడా రోగుల్ని బాగు చేసినప్పుడు దేవుని పనుల్ని వెల్లడిచేశాడు.

తాను ఈ పనులు చేయడం అత్యవసరమని నొక్కిచెప్తూ యేసు ఇలా అన్నాడు: “మనం పగటిపూట నన్ను పంపించిన తండ్రి పనులు చేయాలి. రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవ్వరూ పనిచేయలేరు. నేను లోకంలో ఉన్నంతకాలం నేనే లోకానికి వెలుగును.” (యోహాను 9:4, 5) అవును, యేసు త్వరలోనే చనిపోయి సమాధి చీకట్లోకి వెళ్తాడు, అక్కడ ఆయన ఏమీ చేయలేడు. అప్పటివరకు ఆయన ఈ లోకానికి వెలుగు ఇస్తాడు.

ఇంతకీ యేసు ఆ గుడ్డివాడిని బాగుచేస్తాడా? ఒకవేళ చేస్తే, ఎలా బాగుచేస్తాడు? యేసు నేలమీద ఉమ్మివేసి దానితో బురద చేశాడు. దాన్ని అతని కళ్ల మీద పూసి, “వెళ్లి, సిలోయము కోనేరులో కడుక్కో” అని చెప్పాడు. (యోహాను 9:7) అతను యేసు చెప్పినట్టే చేశాడు. అప్పుడు అతనికి చూపు వచ్చింది! జీవితంలో మొట్టమొదటిసారి చూడగలుగుతున్నందుకు అతను ఎంత సంతోషించి ఉంటాడో ఊహించండి!

అతను గుడ్డివాడని తెలిసిన ఇరుగుపొరుగువాళ్లు, ఇతరులు అతను బాగవ్వడం చూసి చాలా ఆశ్చర్యపోయారు. “ఇతను అడుక్కునేవాడు కదా?” అని వాళ్లు అన్నారు. కొంతమంది “అవును, అతనే” అన్నారు. ఇంకొంతమంది దాన్ని నమ్మలేక “అతను కాదు, అతనిలా ఉన్నాడంతే” అన్నారు. కానీ ఆ భిక్షగాడు, “నేనే అతన్ని” అని జవాబిచ్చాడు.—యోహాను 9:8, 9.

అప్పుడు వాళ్లు, “మరి నీకు చూపు ఎలా వచ్చింది?” అని అడిగారు. అందుకతను ఇలా జవాబిచ్చాడు: “యేసు అనే ఒకాయన బురద చేసి, దాన్ని నా కళ్ల మీద పూసి, ‘సిలోయము దగ్గరికి వెళ్లి కడుక్కో’ అని చెప్పాడు. నేను వెళ్లి కడుక్కున్నప్పుడు నాకు చూపు వచ్చింది.” వాళ్లు, “ఆయన ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. దానికి ఆ భిక్షగాడు, “నాకు తెలీదు” అన్నాడు.—యోహాను 9:10-12.

ప్రజలు ఆ భిక్షగాడిని పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్లారు. అతనికి చూపు ఎలా వచ్చిందో వాళ్లు కూడా తెలుసుకోవాలనుకున్నారు. అతను వాళ్లకు ఇలా చెప్పాడు: “ఆయన నా కళ్లమీద బురద పూశాడు. నేను కడుక్కున్నాను, చూడగలుగుతున్నాను.” పరిసయ్యులు ఆ భిక్షగాడితో కలిసి ఆనందించలేదు. బదులుగా, వాళ్లలో కొంతమంది యేసును దూషిస్తూ ఇలా అన్నారు: “ఈయన దేవుని దగ్గర నుండి వచ్చినవాడు కాదు, ఎందుకంటే ఈయన విశ్రాంతి రోజును పాటించట్లేదు.” అయితే ఇంకొంతమంది, “ఒక పాపి ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలడు?” అన్నారు. (యోహాను 9:15, 16) అలా ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు.

కాబట్టి వాళ్లు, “ఆయన చూపు తెప్పించింది నీకే కదా, ఇంతకీ ఆయన గురించి నువ్వు ఏమంటావు?” అని చూపువచ్చిన ఆ భిక్షగాడినే అడిగారు. అతను ఏమాత్రం సందేహించకుండా, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.—యోహాను 9:17.

పరిసయ్యులు అందుకు ఒప్పుకోలేదు. అతను, యేసు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని వాళ్లు అనుకొని ఉండవచ్చు. కాబట్టి వాళ్లు ఆ భిక్షగాడి తల్లిదండ్రుల్ని పిలిపించి, అతను నిజంగా గుడ్డివాడో కాదో తెలుసుకోవాలనుకున్నారు.