కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ అధ్యాయం

యేసుక్రీస్తు ఎవరు?

యేసుక్రీస్తు ఎవరు?

1, 2. (ఎ) పేరుప్రఖ్యాతలు ఉన్న ఒకతని పేరు తెలిసినంత మాత్రాన అతని గురించి నిజంగా మీకు తెలుసా? వివరించండి. (బి) ప్రజలు యేసు గురించి ఏమని నమ్ముతారు?

ప్రపంచంలో గొప్ప పేరున్నవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లలో ఒకరి పేరు మీకు తెలిసి ఉండవచ్చు. కానీ మీకు వాళ్ల పేరు తెలిసినంత మాత్రాన వాళ్లు బాగా తెలుసని చెప్పలేం. వాళ్ల జీవితంలో ప్రతి విషయం మీకు తెలియదు, అంతేకాదు వాళ్లు ఎలాంటి వాళ్లో కూడా మీకు తెలియదు.

2 యేసు భూమ్మీద జీవించి దాదాపు 2,000 సంవత్సరాలు అయిపోయినా, మీరు యేసుక్రీస్తు గురించి విని ఉండవచ్చు. కానీ చాలామందికి యేసు ఎలాంటివాడో సరిగ్గా తెలీదు. కొంతమంది ఆయన ఒక మంచి మనిషని అంటారు, కొంతమంది ఆయన ఒక ప్రవక్తని అంటారు, ఇంకొంతమంది ఆయన దేవుడని నమ్ముతారు. మీరేమని అనుకుంటున్నారు?—అదనపు సమాచారంలో 12వ పాయింట్‌ చూడండి.

3. యెహోవా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?

3 మీరు యేసు గురించిన నిజాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు? బైబిలు ఇలా చెప్తుంది: “ఒకేఒక్క సత్య దేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.” (యోహాను 17:3) అవును యెహోవా, యేసు గురించిన నిజాన్ని తెలుసుకుంటే మీరు పరదైసు భూమ్మీద శాశ్వత జీవితాన్ని ఆనందిస్తారు. (యోహాను 14:6) మనం ఎలా జీవించాలి? ఇతరులను ఎలా చూడాలి? అనే విషయంలో యేసు చాలా మంచి ఆదర్శం, కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడం ద్వారా మీరు కూడా అలాంటి విషయాలను నేర్చుకోవచ్చు. (యోహాను 13:34, 35) 1వ అధ్యాయంలో దేవుని గురించిన సత్యాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు యేసు గురించి బైబిలు ఏమి నేర్పిస్తుందో తెలుసుకుందాం.

మేము మెస్సీయ ఎవరో తెలుసుకున్నాం!

4. “మెస్సీయ,” “క్రీస్తు” అనే పదాల అర్థం ఏమిటి?

4 యేసు పుట్టడానికి చాలా సంవత్సరాల ముందే యెహోవా దేవుడు బైబిల్లో మెస్సీయ లేదా క్రీస్తును పంపిస్తానని వాగ్దానం చేశాడు. “మెస్సీయ” అనే పదం హీబ్రూ భాష నుండి వచ్చింది, “క్రీస్తు” అనే పదం గ్రీకు భాష నుండి వచ్చింది. వాగ్దానం చేసిన మెస్సీయను దేవుడు ఎన్నుకుని, ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఇస్తాడని ఈ రెండు పదాలకు అర్థం. మెస్సీయ దేవుని వాగ్దానాలన్నిటిని నెరవేరుస్తాడు. యేసు భూమి మీద ఉన్నప్పుడు చేసిన పనుల నుండి మనం ఇప్పుడు కూడా ప్రయోజనం పొందవచ్చు. కానీ యేసు పుట్టకముందు, ‘ఎవరు మెస్సీయ అవుతారు?’ అని చాలామంది అనుకునేవాళ్లు.

5. యేసే మెస్సీయ అని ఆయన శిష్యులు నమ్మారా?

5 వాగ్దానం చేయబడిన మెస్సీయ యేసే అని ఆయన శిష్యులకు ఖచ్చితంగా తెలుసు. (యోహాను 1:41) ఉదాహరణకు, సీమోను పేతురు యేసుతో ఇలా అన్నాడు: “నువ్వు క్రీస్తువి.” (మత్తయి 16:16) యేసే మెస్సీయ అని మనం ఖచ్చితంగా ఎలా నమ్మవచ్చు?

6. మెస్సీయను తెలుసుకోవడానికి యెహోవా నిజాయితీగా ఆలోచించే వాళ్లకు ఎలా సహాయం చేశాడు?

6 యేసు పుట్టడానికి చాలాకాలం ముందే, మెస్సీయ ఎవరో తెలుసుకోవడానికి దేవుని ప్రవక్తలు బైబిల్లో ఎన్నో వివరాలు రాశారు. అవి మనకు ఎలా సహాయం చేస్తాయి? ఉదాహరణకు ఇంతకుముందు ఎప్పుడూ కలవని ఒకతన్ని తీసుకురావడానికి బాగా బిజీగా ఉన్న బస్‌స్టాండ్‌కు వెళ్లమని మిమ్మల్ని అడిగారనుకోండి. అతను ఎలా ఉంటాడనే వివరాలన్నీ ఎవరైనా మీకు చక్కగా చెప్తే మీరు అతన్ని గుర్తు పట్టగలుగుతారు. అదేవిధంగా యెహోవా కూడా తన ప్రవక్తల ద్వారా మెస్సీయ ఏమి చేస్తాడు? ఆయనకు ఏమి అవుతుంది? అనే వివరాలు చెప్పాడు. ఆ ప్రవచనాలన్నిటి నెరవేర్పు నిజాయితీగా ఆలోచించేవాళ్లకు యేసే మెస్సీయ అని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి.

7. యేసే మెస్సీయ అని తెలిపే రెండు ప్రవచనాలు చెప్పండి?

7 అలాంటి రెండు ప్రవచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటిది, యేసు పుట్టడానికి 700 సంవత్సరాల ముందే ఆయన బేత్లెహేము అనే చిన్న ఊరిలో పుడతాడని మీకా అనే ప్రవక్త ప్రవచించాడు. (మీకా 5:2) యేసు అక్కడే పుట్టాడు! (మత్తయి 2:1, 3-9) రెండవది, మెస్సీయ క్రీ.శ. 29 లో వస్తాడని దానియేలు ప్రవచించాడు. (దానియేలు 9:25) యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని స్పష్టంగా తెలిపే ఎన్నో ప్రవచనాల్లో ఇవి రెండు మాత్రమే.—అదనపు సమాచారంలో 13వ పాయింట్‌ చూడండి.

బాప్తిస్మ సమయంలో యేసు మెస్సీయ, లేదా క్రీస్తు అయ్యాడు

8, 9. యేసే మెస్సీయ అని రుజువు చేసేలా ఆయన బాప్తిస్మ సమయంలో ఏమి జరిగింది?

8 యేసే మెస్సీయ అని యెహోవా స్పష్టం చేశాడు. మెస్సీయ ఎవరో తెలుసుకోవడానికి ఒక గుర్తును ఇస్తానని దేవుడు బాప్తిస్మం ఇచ్చే యోహానుకు మాటిచ్చాడు. క్రీ.శ. 29 లో యేసు యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను దగ్గరకు వెళ్లినప్పుడు యోహాను ఆ మాట నెరవేరడం చూశాడు. అప్పుడు ఏమి జరిగిందో బైబిలు ఇలా చెప్తుంది: “యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీళ్లలో నుండి బయటికి వచ్చాడు; అప్పుడు ఇదిగో! ఆకాశం తెరుచుకుంది. దేవుని పవిత్రశక్తి పావురం రూపంలో ఆయన మీదకు దిగిరావడం యోహాను చూశాడు. అంతేకాదు, ఇదిగో! ఆకాశం నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: ‘ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.’” (మత్తయి 3:16, 17) యోహాను ఆ గుర్తును చూసి, ఆ స్వరం విన్నప్పుడు యేసే మెస్సీయ అని తెలుసుకున్నాడు. (యోహాను 1:32-34) ఆ రోజు, యెహోవా తన పవిత్రశక్తిని యేసు మీద కుమ్మరించాడు, అప్పుడు యేసు మెస్సీయ అయ్యాడు. ఆయన్నే దేవుడు నాయకుడిగా, రాజుగా ఎన్నుకున్నాడు.—యెషయా 55:4.

9 బైబిలు ప్రవచనాలు, యెహోవా స్వయంగా చెప్పిన మాటలు, యేసు బాప్తిస్మ సమయంలో యెహోవా ఇచ్చిన గుర్తు యేసే మెస్సీయ అని రుజువు చేస్తాయి. కానీ యేసు ఎక్కడి నుండి వచ్చాడు? ఆయన ఎలాంటివాడు? ఈ విషయాల గురించి బైబిలు ఏమి చెప్తుందో చూద్దాం.

యేసు ఎక్కడ నుండి వచ్చాడు?

10. భూమ్మీదకు రాకముందు యేసు జీవితం గురించి బైబిలు ఏమి నేర్పిస్తుంది?

10 యేసు భూమ్మీదకు రాకముందు చాలాకాలం పరలోకంలో ఉన్నాడని బైబిలు నేర్పిస్తుంది. మెస్సీయ “ప్రాచీనకాలాల నుండి” ఉన్నాడని మీకా చెప్పాడు. (మీకా 5:2) ఆయన మనిషిగా పుట్టకముందు పరలోకంలో ఉండేవాడినని యేసే చాలాసార్లు చెప్పాడు. (యోహాను 3:13; 6:38, 62; 17:4, 5 చదవండి.) భూమ్మీదకు రాకముందు కూడా, యేసుకు యెహోవాతో ఒక ప్రత్యేక బంధం ఉంది.

11. యేసు యెహోవాకు ఎందుకు చాలా విలువైనవాడు?

11 యేసు యెహోవాకు ఎంతో విలువైనవాడు. ఎందుకు? ఎందుకంటే అన్నిటిని సృష్టించకముందు, ఎవరినీ పుట్టించకముందు దేవుడు ఆయనను చేశాడు. అందుకే యేసు “మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు” అని పిలవబడ్డాడు. * (కొలొస్సయులు 1:15) అంతేకాకుండా యెహోవాయే స్వయంగా యేసును సృష్టించాడు కాబట్టి యేసు యెహోవాకు ఎంతో విలువైనవాడు. అందుకే ఆయన ఒక్కగానొక్క కుమారుడు అని పిలవబడ్డాడు. (యోహాను 3:16) అన్నిటిని సృష్టించడానికి యెహోవా యేసును మాత్రమే ఉపయోగించుకున్నాడు. (కొలొస్సయులు 1:16) యేసు మాత్రమే “వాక్యం” అని పిలువబడ్డాడు, ఎందుకంటే మనుషులకు, దేవదూతలకు సందేశాలు ఇవ్వడానికి యెహోవా ఆయనను ఉపయోగించుకున్నాడు.—యోహాను 1:14.

12. యేసు, దేవుడు ఒక్కరు కాదని మనకు ఎలా తెలుసు?

12 కొంతమంది యేసు, దేవుడు ఒక్కరే అని నమ్ముతారు. కానీ బైబిలు చెప్పేది అది కాదు. యేసు సృష్టించబడ్డాడని బైబిలు చెప్తుంది, అంటే యేసుకు ఒక ఆరంభం ఉంది. కానీ యెహోవాయే అన్నిటిని సృష్టించాడు, ఆయనకు ఆరంభం లేదు. (కీర్తన 90:2) దేవుని కుమారుడైన యేసు, దేవునిగా అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. కుమారుడి కన్నా తండ్రి గొప్పవాడని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (యోహాను 14:28 చదవండి; 1 కొరింథీయులు 11:3) యెహోవా మాత్రమే సర్వశక్తిగల దేవుడు. (ఆదికాండం 17:1) విశ్వం అంతటిలో ఆయనే గొప్పవాడు, శక్తిమంతుడు.—అదనపు సమాచారంలో 14వ పాయింట్‌ చూడండి.

13. “కనిపించని దేవుని ప్రతిబింబం” అని బైబిలు యేసు గురించి ఎందుకు అంటుంది?

13 యెహోవా, ఆయన కుమారుడైన యేసు ఆకాశాన్ని, భూమిని సృష్టించక ముందు కోటానుకోట్ల సంవత్సరాలు ఎంతో దగ్గరగా పనిచేశారు. వాళ్లిద్దరికి ఒకరిమీద ఒకరికి చాలా ప్రేమ ఉండి ఉంటుంది. (యోహాను 3:35; 14:31) యేసు తన తండ్రి లక్షణాలను ఎంత బాగా అనుకరించాడంటే బైబిలు ఆయనను “కనిపించని దేవుని ప్రతిబింబం” అని పిలుస్తుంది.—కొలొస్సయులు 1:15.

14. యెహోవాకు ఎంతో అమూల్యమైన కుమారుడు మనిషిగా ఎలా పుట్టాడు?

14 యెహోవా ఎంతో ఇష్టపడే ఆయన కుమారుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమ్మీద మనిషిగా పుట్టడానికి ఇష్టంగా ముందుకు వచ్చాడు. అది ఎలా జరిగింది? యెహోవా అద్భుతంగా తన కుమారుని ప్రాణాన్ని కన్య అయిన మరియ గర్భంలోకి పంపించాడు. కాబట్టి యేసుకు మానవ తండ్రి అవసరం లేదు. ఆ విధంగా మరియ ఒక పరిపూర్ణ కుమారునికి జన్మనిచ్చింది, అతను యేసు అని పిలువబడ్డాడు.—లూకా 1:30-35.

యేసు ఎలా ఉండేవాడు?

15. యెహోవా గురించి మీరు ఇంకా బాగా ఎలా తెలుసుకోవచ్చు?

15 బైబిలు పుస్తకాలైన మత్తయి, మార్కు, లూకా, యోహాను చదివినప్పుడు మీరు యేసు గురించి, ఆయన జీవితం గురించి, ఆయన లక్షణాల గురించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆ పుస్తకాలను సువార్తలు అని అంటారు. యేసు అచ్చం తన తండ్రిలానే ఉంటాడు కాబట్టి యేసు గురించి మీరు చదివే విషయాలు యెహోవాను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తాయి. అందుకే యేసు “నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు” అని అనగలిగాడు.—యోహాను 14:9.

16. యేసు ఏమి బోధించాడు? యేసు నేర్పించిన విషయాలు ఎక్కడ నుండి వచ్చాయి?

16 చాలామంది యేసును “బోధకుడా” అని పిలిచారు. (యోహాను 1:38; 13:13) ఆయన బోధించిన విషయాల్లో ముఖ్యమైనది “రాజ్యం గురించిన మంచివార్త.” రాజ్యం అంటే ఏమిటి? రాజ్యం అంటే పరలోకం నుండి ఈ భూమి మొత్తాన్ని పరిపాలిస్తూ, దేవునికి లోబడే ప్రజలకు ఆశీర్వాదాలను తీసుకువచ్చే దేవుని ప్రభుత్వం. (మత్తయి 4:23) యేసు బోధించిన ప్రతీ విషయం యెహోవా నుండి వచ్చింది. యేసు ఇలా చెప్పాడు: “నేను బోధించే బోధ నాది కాదు, నన్ను పంపిన వ్యక్తిదే.” (యోహాను 7:16) దేవుని రాజ్యం ఈ భూమిని పరిపాలిస్తుందనే మంచివార్తను ప్రజలు వినాలని యెహోవా కోరుకుంటున్నాడని యేసుకు తెలుసు.

17. యేసు ఎక్కడ బోధించాడు? ఇతరులకు బోధించడానికి ఆయన ఎందుకు అంత కష్టపడ్డాడు?

17 యేసు ఎక్కడ బోధించాడు? ప్రజలు కనిపించిన ప్రతీచోట ఆయన బోధించాడు. ఊరి బయట, పట్టణాల్లో, పల్లెటూళ్లలో, మార్కెట్లలో, ఆరాధన కోసం కలుసుకునే స్థలాల్లో, ఇళ్లల్లో ఆయన బోధించేవాడు. ప్రజలు తన దగ్గరకు రావాలని ఆయన అనుకునేవాడు కాదు. ఆయనే ఎక్కువగా వాళ్ల దగ్గరకు వెళ్లేవాడు. (మార్కు 6:56; లూకా 19:5, 6) ప్రజలకు నేర్పించడానికి సమయాన్ని, శక్తిని ఉపయోగిస్తూ యేసు చాలా కష్టపడి పనిచేశాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన అలా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడని యేసుకు తెలుసు, అంతేకాదు ఆయన ఎప్పుడూ తన తండ్రికి లోబడేవాడు. (యోహాను 8:28, 29) ప్రజలపై జాలితో కూడా ఆయన వాళ్లకు ప్రకటించాడు. (మత్తయి 9:35, 36 చదవండి.) మత నాయకులు దేవుని గురించిన, ఆయన రాజ్యం గురించిన నిజాన్ని నేర్పించేవాళ్లు కాదని యేసు గమనించాడు. అందుకే సాధ్యమైనంత ఎక్కువమంది మంచివార్తను వినేలా సహాయం చేయాలని యేసు అనుకున్నాడు.

18. యేసుకున్న ఏ లక్షణాలు మీకు బాగా నచ్చాయి?

18 యేసు ప్రజలను ఎంతో ప్రేమించాడు, వాళ్ల మీద శ్రద్ధ చూపించాడు. ఆయన దయగలవాడు, ప్రజలు ఆయనతో చక్కగా మాట్లాడేవాళ్లు. పిల్లలు కూడా ఆయన దగ్గరకు రావడానికి ఇష్టపడేవాళ్లు. (మార్కు 10:13-16) యేసు ఎప్పుడూ న్యాయంగా ఉన్నాడు. ఆయన అవినీతిని, అన్యాయాన్ని అసహ్యించుకున్నాడు. (మత్తయి 21:12, 13) స్త్రీలకు ఎక్కువ హక్కులు లేని కాలంలో, వాళ్లను గౌరవించని కాలంలో యేసు జీవించినా ఆయన ఎప్పుడూ స్త్రీలను గౌరవంతో, మర్యాదతో చూశాడు. (యోహాను 4:9, 27) యేసు నిజంగా వినయస్థుడు. ఉదాహరణకు, ఒక రోజు రాత్రి యేసు తన శిష్యుల పాదాలు కడిగాడు, సాధారణంగా ఇలాంటి పనులు పనివాళ్లు చేస్తారు.—యోహాను 13:2-5, 12-17.

ప్రజలు ఎక్కడ కనిపించినా యేసు వాళ్లకు ప్రకటించాడు

19. ప్రజలకు నిజంగా ఏమి అవసరమో యేసుకు తెలుసని, ఆయన వాళ్లకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడని ఏ ఉదాహరణ చూపిస్తుంది?

19 ప్రజలకు నిజంగా ఏమి అవసరమో యేసుకు తెలుసు, ఆయన వాళ్లకు సహాయం చేయాలని అనుకున్నాడు. ప్రజలను బాగుచేయడానికి దేవుని శక్తిని ఉపయోగించినప్పుడు ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమౌతుంది. (మత్తయి 14:14) ఉదాహరణకు, ఒక కుష్ఠురోగి యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: “నీకు ఇష్టమైతే, నన్ను శుద్ధుడిగా చేయగలవు.” అతనికి ఎంత బాధ, నొప్పి ఉన్నాయో యేసు అర్థం చేసుకున్నాడు. అతనిమీద కనికరపడ్డాడు, సహాయం చేయాలని అనుకున్నాడు. కాబట్టి యేసు తన చెయ్యి చాపి, అతనిని ముట్టుకుని, “నాకు ఇష్టమే! శుద్ధుడివి అవ్వు” అన్నాడు. అప్పుడు ఆ కుష్ఠురోగి బాగయ్యాడు. (మార్కు 1:40-42) అతనికి ఎలా అనిపించి ఉంటుందో మీరు ఊహించుకోగలరా?

తన తండ్రికి ఎప్పుడూ నమ్మకంగా ఉన్నాడు

20, 21. దేవునికి లోబడే విషయంలో యేసు గొప్ప ఆదర్శం అని ఎలా చెప్పవచ్చు?

20 దేవునికి లోబడే విషయంలో యేసు గొప్ప ఆదర్శం. ఆయనకు ఏమి జరిగినా, శత్రువులు ఆయన్ని ఏమి చేసినా, యేసు తన తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. ఉదాహరణకు, యేసు తప్పు చేసేలా సాతాను శోధించినా ఆయన పాపం చేయలేదు. (మత్తయి 4:1-11) యేసు సొంత కుటుంబ సభ్యుల్లోనే కొంతమంది ఆయనే మెస్సీయ అని నమ్మలేదు, ఆయనకు “పిచ్చి పట్టింది” అని అన్నారు, కానీ యేసు దేవుని పని చేస్తూనే ఉన్నాడు. (మార్కు 3:21) యేసు శత్రువులు ఆయనను హింసిస్తున్నప్పటికీ ఆయన దేవునికి నమ్మకంగా ఉన్నాడు, వాళ్లకు హాని చేయాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు.—1 పేతురు 2:21-23.

21 యేసును క్రూరంగా చంపేశారు. ఎంతో బాధతో చనిపోవాల్సి వచ్చినా ఆయన యెహోవాకే నమ్మకంగా ఉన్నాడు. (ఫిలిప్పీయులు 2:8 చదవండి.) ఆయన చనిపోయే రోజు ఎంత ఓర్చుకోవాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. ఆయనను బంధించారు, దేవున్ని దూషించాడని అబద్ధ సాక్ష్యం చెప్పారు, అవినీతిపరులైన న్యాయాధికారులు ఆయనకు అన్యాయంగా శిక్ష వేశారు, అందరూ ఆయనను చూసి నవ్వారు, సైనికులు చిత్ర హింసలు పెట్టారు, మేకులు కొట్టి మ్రానుపై వ్రేలాడతీశారు. ఆయన చనిపోతున్నప్పుడు ఇలా అరిచాడు: “అంతా పూర్తయింది!” (యోహాను 19:30) యేసు చనిపోయిన మూడు రోజులకు, యెహోవా ఆయనను మళ్లీ బ్రతికించి ఆత్మ శరీరాన్ని ఇచ్చాడు. (1 పేతురు 3:18) కొన్ని వారాల తర్వాత యేసు పరలోకానికి తిరిగి వెళ్లిపోయి “దేవుని కుడిపక్కన కూర్చున్నాడు,” దేవుడు ఆయనను రాజుగా చేసేవరకు ఎదురు చూశాడు.—హెబ్రీయులు 10:12, 13.

22. యేసు తన తండ్రికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు ఏ అవకాశం ఉంది?

22 యేసు తన తండ్రికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు మనమందరం యెహోవా ఉద్దేశించినట్లు పరదైసు భూమ్మీద నిరంతరం జీవించే అవకాశాన్ని పొందాం. తర్వాత అధ్యాయంలో, మనం శాశ్వతంగా జీవించడానికి యేసు మరణం ఎలా సాధ్యం చేస్తుందో చూద్దాం.

^ పేరా 11 యెహోవాను తండ్రి అని పిలిచారు ఎందుకంటే ఆయనే సృష్టికర్త. (యెషయా 64:8) యేసును దేవుని కుమారుడు అని పిలిచారు ఎందుకంటే ఆయనను యెహోవాయే సృష్టించాడు. దేవదూతలు, ఆదాము కూడా దేవుని కుమారులు అని పిలవబడ్డారు.—యోబు 1:6; లూకా 3:38.