కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ అధ్యాయం

దేవుని గొప్ప బహుమానం​—⁠విమోచన క్రయధనం

దేవుని గొప్ప బహుమానం​—⁠విమోచన క్రయధనం

1, 2. (ఎ) ఒక బహుమానాన్ని మీరు ఎప్పుడు విలువైనదిగా చూస్తారు? (బి) విమోచన క్రయధనం దేవుడిచ్చిన అతి గొప్ప బహుమానం అని ఎందుకు చెప్పవచ్చు?

మీకు వచ్చిన బహుమానాల్లో అన్నిటికన్నా విలువైనది ఏది? విలువైన బహుమానం అంటే అది ఖరీదైనదై ఉండాల్సిన అవసరం లేదు. ఒక బహుమానం మీకు సంతోషాన్ని కలిగిస్తే లేదా మీకు నిజంగా అవసరమైనదైతే, దాన్ని పొందినందుకు మీరు ఎంతో కృతజ్ఞులై ఉంటారు.

2 దేవుడు ఇచ్చిన బహుమానాలన్నిటిలో ఒకటి మనకు చాలా అవసరం. అది దేవుడు మనుషులకు ఇచ్చిన అతి గొప్ప బహుమానం. ఈ అధ్యాయంలో మనం శాశ్వతంగా బ్రతికి ఉండడానికి యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడని నేర్చుకుంటాం. (మత్తయి 20:28 చదవండి.) యేసును విమోచన క్రయధనంగా భూమి మీదకు పంపించడం ద్వారా యెహోవా మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని రుజువు చేశాడు.

విమోచన క్రయధనం అంటే ఏంటి?

3. మనుషులు ఎందుకు చనిపోతున్నారు?

3 మనుషుల్ని పాపమరణాల నుండి విడిపించడానికి యెహోవా ఏర్పాటు చేసిన మార్గమే విమోచన క్రయధనం. (ఎఫెసీయులు 1:7) మనకు విమోచన క్రయధనం ఎందుకు అవసరమైందో తెలుసుకోవడానికి మనం వేల సంవత్సరాల క్రితం ఏదెను తోటలో ఏమి జరిగిందో తెలుసుకోవాలి. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము, హవ్వ దేవుని మాట వినకుండా పాపం చేశారు, అందుకే వాళ్లు చనిపోయారు. ఆదాము, హవ్వ నుండి ఆ పాపం మనకు కూడా వారసత్వంగా వచ్చింది కాబట్టే మనమూ చనిపోతున్నాం.—అదనపు సమాచారంలో 9వ పాయింట్‌ చూడండి.

4. ఆదాము ఎవరు? ఆయనకు ఏమి ఉన్నాయి?

4 యెహోవా మొదటి మనిషి అయిన ఆదామును చేసినప్పుడు ఆయనకు ఒక విలువైన వరాన్ని ఇచ్చాడు. దేవుడు ఆదాముకు పరిపూర్ణమైన జీవితాన్ని ఇచ్చాడు. ఏ లోపంలేని పరిపూర్ణ మనసును, శరీరాన్ని ఇచ్చాడు. ఆదాముకు ఎప్పుడూ జబ్బులు రావు, ఎప్పుడూ ముసలివాడు కాడు, ఎప్పుడూ చనిపోడు. యెహోవా ఆదామును సృష్టించాడు కాబట్టి ఆయన ఆదాముకు తండ్రిలా ఉన్నాడు. (లూకా 3:38) యెహోవా ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు ఆదాము నుండి ఏమి కోరుకుంటున్నాడో స్పష్టంగా ఆయనకు చెప్పాడు. సంతోషంగా చేసుకోవడానికి ఆదాముకు మంచి పనిని ఇచ్చాడు.—ఆదికాండం 1:28-30; 2:16, 17.

5. ఆదాము “దేవుని స్వరూపంలో” చేయబడ్డాడు అని బైబిల్లో ఉన్న మాటల అర్థం ఏంటి?

5 ఆదాము “దేవుని స్వరూపంలో” సృష్టించబడ్డాడు. (ఆదికాండం 1:27) యెహోవా తనకున్న ప్రేమ, జ్ఞానం, న్యాయం, శక్తి లాంటి లక్షణాలను ఆదాముకు ఇచ్చాడు. ఆయన ఆదాముకు స్వేచ్ఛగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకునే హక్కును ఇచ్చాడు. ఆదాము ఒక రోబో కాదు. మంచి చేయాలా లేక చెడు చేయాలా అన్నది ఎంచుకునే స్వేచ్ఛను దేవుడు ఆయనకు ఇచ్చాడు. ఒకవేళ ఆదాము దేవునికి లోబడాలని నిర్ణయించుకుని ఉంటే, ఆయన అందమైన తోటలో ఇప్పటి వరకు జీవించి ఉండేవాడు.

6. ఆదాము దేవునికి అవిధేయత చూపించినప్పుడు ఏమి పోగొట్టుకున్నాడు? ఇది మనపై ఎలాంటి ప్రభావం చూపించింది?

6 దేవునికి అవిధేయత చూపించి మరణశిక్ష పొందినప్పుడు ఆదాము ఎన్నో పోగొట్టుకోవాల్సి వచ్చింది. దేవునితో అతనికున్న ప్రత్యేకమైన స్నేహాన్ని, పరిపూర్ణ జీవితాన్ని, తను నివసించే అందమైన తోటను ఆదాము పోగొట్టుకున్నాడు. (ఆదికాండం 3:17-19) ఆదాముహవ్వ దేవుని మాట వినకూడదని నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్లకు ఇంక నిరంతరం బ్రతికి ఉండే అవకాశం లేదు. ఆదాము చేసిన దాన్నిబట్టి “పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదే విధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.” (రోమీయులు 5:12) ఆదాము పాపం చేసినప్పుడు తనతోపాటు మనల్ని కూడా పాపమరణాలకు బానిసగా అమ్మేశాడు. (రోమీయులు 7:14) మరి మనం దాని నుండి బయటపడే అవకాశం ఏమైనా ఉందా? అవును ఉంది.

7, 8. విమోచన క్రయధనం అంటే ఏంటి?

7 విమోచన క్రయధనం అంటే ఏంటి? విమోచన క్రయధనంలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఎవరినైనా విడిపించడానికి, దేనినైనా తిరిగి కొనడానికి ఇచ్చే మూల్యమే విమోచన క్రయధనం. రెండు, విమోచన క్రయధనం ఆ విడిపించాల్సిన వస్తువు ఖరీదుకు సమానంగా ఉండాలి.

8 ఆదాము పాపం చేసి మనకు మరణాన్ని తీసుకురావడం ద్వారా చాలా నష్టం కలిగించాడు. ఏ మనిషి కూడా మనల్ని ఆ నష్టం నుండి విడిపించలేడు. కానీ యెహోవా మనల్ని పాపం, మరణం నుండి విడిపించే మార్గాన్ని తెరిచాడు. కాబట్టి విమోచన క్రయధనం ఎలా పనిచేస్తుందో, దానివల్ల మనం ఎలా ప్రయోజనం పొందవచ్చో ఇప్పుడు నేర్చుకుందాం.

విమోచన క్రయధనాన్ని యెహోవా ఎలా ఏర్పాటు చేశాడు?

9. విమోచన క్రయధనాన్ని ఎలా చెల్లించాలి?

9 మనలో ఎవ్వరం కూడా ఆదాము పోగొట్టిన పరిపూర్ణ ప్రాణానికి సమానమైన విమోచన క్రయధనం చెల్లించలేం. ఎందుకు? ఎందుకంటే మనలో ఎవ్వరం పరిపూర్ణులం కాదు. (కీర్తన 49:7, 8) విమోచన క్రయధనంగా చెల్లించాల్సింది మరో పరిపూర్ణ ప్రాణమే కాని అపరిపూర్ణ ప్రాణం కాదు. అందుకే విమోచన క్రయధనాన్ని “సరిసమానమైన విమోచన క్రయధనంగా” పిలిచారు. (1 తిమోతి 2:6) ఆదాము పోగొట్టుకున్న ప్రాణానికి సమానమైన విలువే విమోచన క్రయధనానికి ఉండాలి.

10. యెహోవా విమోచన క్రయధనాన్ని ఎలా ఏర్పాటు చేశాడు?

10 యెహోవా విమోచన క్రయధనాన్ని ఎలా ఏర్పాటు చేశాడు? యెహోవా తన అమూల్యమైన కుమారున్ని భూమి మీదకు పంపించాడు. ఆ కుమారుడైన యేసు యెహోవా చేసిన మొట్టమొదటి సృష్టి. (1 యోహాను 4:9, 10) యేసు తన తండ్రిని, తాను ఉంటున్న పరలోకాన్ని వదిలిపెట్టి రావడానికి సిద్ధం అయ్యాడు. (ఫిలిప్పీయులు 2:7) యెహోవా యేసును పరలోకం నుండి భూమి మీదకు పంపించాడు. యేసు పరిపూర్ణ మనిషిగా ఏ పాపం లేకుండా పుట్టాడు.—లూకా 1:35.

యెహోవా తన అమూల్యమైన కుమారున్ని మనకోసం విమోచన క్రయధనంగా ఇచ్చాడు

11. ఒక్క మనిషి మనుషులందరికీ ఎలా విమోచన క్రయధనం అవ్వగలడు?

11 మొదటి మనిషి అయిన ఆదాము దేవునికి లోబడకపోవడం వల్ల మనుషులందరి పరిపూర్ణ ప్రాణాన్ని పోగొట్టాడు. మరో మనిషి, ఆదాము పిల్లలందరికీ మరణాన్ని తీసివేయగలడా? తీసివేయగలడు. (రోమీయులు 5:19 చదవండి.) ఎన్నడూ తప్పు చేయని యేసు, తన పరిపూర్ణ ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇచ్చాడు. (1 కొరింథీయులు 15:45) ఏ లోపం లేని యేసు పరిపూర్ణ ప్రాణం ఆదాము పిల్లల మరణాన్ని తీసివేయడానికి ఉపయోగపడింది.—1 కొరింథీయులు 15:21, 22.

12. యేసు ఎందుకు అన్ని శ్రమలు అనుభవించాల్సి వచ్చింది?

12 యేసు చనిపోయే ముందు ఎన్ని శ్రమల్ని అనుభవించాడో బైబిలు వివరిస్తుంది. ఆయనను కొరడాలతో కొట్టారు, మేకులు కొట్టి కొయ్యకు వేలాడదీశారు, ఆయన వెంటనే కాకుండా బాధను ఓర్చుకుంటూ చనిపోవాల్సి వచ్చింది. (యోహాను 19:1, 16-18, 30) యేసు ఎందుకు అంత శ్రమపడ్డాడు? ఎందుకంటే తీవ్రమైన పరీక్షలు వస్తే మనుషులు దేవునికి నమ్మకంగా ఉండరని సాతాను నింద వేశాడు. కానీ పరిపూర్ణ మనిషి ఎన్ని శ్రమలు అనుభవించినా దేవునికి నమ్మకంగా ఉండవచ్చు అని యేసు నిరూపించాడు. యేసును చూసి యెహోవా ఎంత గర్వపడి ఉంటాడో ఊహించండి!—సామెతలు 27:11; అదనపు సమాచారంలో 15వ పాయింట్‌ చూడండి.

13. విమోచన క్రయధనం ఎలా చెల్లించబడింది?

13 విమోచన క్రయధనం ఎలా చెల్లించబడింది? యేసు తన ప్రాణం విలువను తన తండ్రికి ఇచ్చాడు. 33వ సంవత్సరం, యూదుల క్యాలెండర్‌లో నీసాను నెల 14న, యేసు శత్రువులు ఆయనను చంపేలా యెహోవా అనుమతించాడు. (హెబ్రీయులు 10:10) మూడు రోజుల తర్వాత యెహోవా యేసుని మనిషిగా కాదు గానీ ఆత్మ ప్రాణిగా బ్రతికించాడు. యేసు తిరిగి పరలోకంలో ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్లాక, తన పరిపూర్ణ మానవ ప్రాణానికి ఉన్న విలువను విమోచన క్రయధనంగా యెహోవాకు అర్పించాడు. (హెబ్రీయులు 9:24) అలా విమోచన క్రయధనం చెల్లించబడింది కాబట్టి మనకు పాపమరణాల నుండి విడుదల అయ్యే అవకాశం దొరికింది.—రోమీయులు 3:23, 24 చదవండి.

విమోచన క్రయధనం వల్ల మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు

14, 15. మన పాపాలకు క్షమాపణ దొరకాలంటే మనం ఏమి చేయాలి?

14 మనం ఇప్పటికే దేవుడిచ్చిన ఈ గొప్ప బహుమానం నుండి ప్రయోజనం పొందుతున్నాం. కానీ ఇప్పుడు, భవిష్యత్తులో ఎలా ప్రయోజనం పొందవచ్చో చూద్దాం.

15 మన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. ఎప్పుడూ తప్పు చేయకుండా ఉండడం కష్టమే. మనం తప్పులు చేస్తాం, కొన్నిసార్లు తప్పుగా మాట్లాడతాం, తప్పుగా ప్రవర్తిస్తాం. (కొలొస్సయులు 1:13, 14) మనకు క్షమాపణ ఎలా దొరుకుతుంది? మనం చేసిన తప్పు గురించి నిజంగా బాధపడి వినయంతో యెహోవాను క్షమించమని అడగాలి. అప్పుడు మన పాపాలకు క్షమాపణ దొరుకుతుందనే నమ్మకంతో ఉండవచ్చు.—1 యోహాను 1:8, 9.

16. మంచి మనస్సాక్షి ఉండాలంటే మనం ఏమి చేయాలి?

16 మనకు మంచి మనస్సాక్షి ఉంటుంది. ఏదైనా తప్పు చేశామని మన మనస్సాక్షికి అనిపిస్తే, తప్పు చేశామనే ఆవేదన కలుగుతుంది, ఇక మన విషయంలో చేయగలిగింది ఏమీ లేదని, మనం ఎందుకూ పనికిరాని వాళ్లమని అనిపిస్తుంది. కానీ మనం నిరాశ పడాల్సిన అవసరం లేదు. క్షమాపణ కోసం మనం యెహోవాను అడిగితే ఆయన ఖచ్చితంగా వింటాడు, మనల్ని క్షమిస్తాడు. (హెబ్రీయులు 9:13, 14) మనకున్న ఏ సమస్యల గురించి అయినా, ఏ బలహీనతల గురించి అయినా తనతో మాట్లాడాలని యెహోవా కోరుకుంటున్నాడు. (హెబ్రీయులు 4:14-16) అలా మనం దేవునితో సమాధానపడవచ్చు.

17. యేసు మనకోసం చనిపోయాడు కాబట్టి మనకు ఏ ఆశీర్వాదాలు వచ్చాయి?

17 శాశ్వతంగా బ్రతికి ఉండే అవకాశం ఉంది. “పాపంవల్ల వచ్చే జీతం మరణం, కానీ దేవుడు ఇచ్చే బహుమతి మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా శాశ్వత జీవితం.” (రోమీయులు 6:23) యేసు మనకోసం చనిపోయాడు కాబట్టి మనం ఎప్పటికీ బ్రతికి ఉంటూ ఆరోగ్యంగా జీవితాన్ని ఆనందించవచ్చు. (ప్రకటన 21:3, 4) కానీ మనం ఆ ఆశీర్వాదాలను పొందాలంటే ఏమి చేయాలి?

మీరు విమోచన క్రయధనాన్ని అంగీకరిస్తారా?

18. యెహోవాకు మనమంటే చాలా ప్రేమ అని మనకు ఎలా తెలుసు?

18 మీకు ఎవరైనా విలువైన బహుమానం ఇచ్చినప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బహుమానాలన్నిటిలో విమోచన క్రయధనం ఎంతో అమూల్యమైనది. ఆ బహుమానానికి మనం యెహోవాకు ఎంతో కృతజ్ఞులై ఉండాలి. యోహాను 3:16 ఇలా చెప్తుంది: “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు.” అవును, యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టే తన అమూల్యమైన కుమారున్ని అంటే యేసుని మనకోసం ఇచ్చాడు. యేసు కూడా మనకోసం చనిపోవడానికి సిద్ధం అయ్యాడు కాబట్టి ఆయనకి మనమంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. (యోహాను 15:13) విమోచన క్రయధనం అనే బహుమానం యెహోవా, యేసు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారనే నమ్మకాన్ని కలిగించాలి.—గలతీయులు 2:20.

మనం యెహోవా గురించి నేర్చుకుంటుండగా ఆయనకు స్నేహితులు అవుతాం, మనకు ఆయన మీద ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతుంది

19, 20. (ఎ) మీరు ఎలా యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు? (బి) యేసు విమోచన క్రయధనాన్ని అంగీకరిస్తున్నారని మీరు ఎలా చూపించవచ్చు?

19 మీరు దేవుని గొప్ప ప్రేమ గురించి తెలుసుకున్నారు కాబట్టి మీరు ఆయనకు ఎలా స్నేహితులు అవ్వవచ్చు? మీకు తెలియని వాళ్లని ప్రేమించడం అంత ఈజీ కాదు. యోహాను 17:3 ప్రకారం మనం యెహోవా గురించి తెలుసుకోవచ్చు. అలా తెలుసుకుంటుండగా ఆయన మీద మీకున్న ప్రేమ పెరుగుతుంది, ఆయనకేది ఇష్టమో అది చేయాలని మీకు అనిపిస్తుంది, మీరు ఆయనకు స్నేహితులు అవుతారు. కాబట్టి బైబిల్ని చదవడం ద్వారా యెహోవా గురించి నేర్చుకుంటూనే ఉండండి.—1 యోహాను 5:3.

20 యేసు విమోచన క్రయధనాన్ని అంగీకరించండి. “కుమారుడి మీద విశ్వాసం చూపించే వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు” అని బైబిలు చెప్తుంది. (యోహాను 3:36) విశ్వాసం చూపించడం అంటే ఏంటి? విశ్వాసం చూపించడం అంటే యేసు చేయమని చెప్పిన వాటిని చేయడం. (యోహాను 13:15) మనం యేసును నమ్ముతున్నామని చెప్తే సరిపోదు. విమోచన క్రయధనాన్ని అంగీకరించాలంటే, మనం మన విశ్వాసం విషయంలో ఏదో ఒకటి చేయాలి. యాకోబు 2:26 లో “చేతలు లేని విశ్వాసం . . . నిర్జీవమైనది” అని ఉంది.

21, 22. (ఎ) మనం ప్రతీ సంవత్సరం యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు ఎందుకు వెళ్లాలి? (బి) మనం 6, 7 అధ్యాయాల్లో ఏ విషయాలను చూస్తాం?

21 యేసు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరు అవ్వండి. యేసు చనిపోవడానికి ముందు సాయంత్రం తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనకు నేర్పించాడు. మనం ప్రతి సంవత్సరం ఆ ఆచరణను చేస్తాం, ఆ జ్ఞాపకార్థ ఆచరణను మనం “ప్రభువు రాత్రి భోజనం” అని పిలుస్తాం. (1 కొరింథీయులు 11:20; మత్తయి 26:26-28) యేసు ఏ లోపం లేని తన పరిపూర్ణ జీవితాన్ని మనకు విమోచన క్రయధనంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి” అని ఆయన చెప్పాడు. (లూకా 22:19 చదవండి.) జ్ఞాపకార్థ ఆచరణకు హాజరు అవ్వడం ద్వారా మీరు విమోచన క్రయధనాన్ని, యెహోవాకు, యేసుకు మనమీదున్న గొప్ప ప్రేమని జ్ఞాపకం చేసుకుంటున్నారని చూపిస్తారు.—అదనపు సమాచారంలో 16వ పాయింట్‌ చూడండి.

22 విమోచన క్రయధనం కన్నా గొప్ప బహుమానాన్ని మనం ఎప్పటికీ పొందలేం. (2 కొరింథీయులు 9:14, 15) ఆ అమూల్యమైన బహుమానం ఇప్పటికే చనిపోయిన ఎన్నో కోట్ల మందికి కూడా ప్రయోజనాలు తెస్తుంది. అదెలా సాధ్యమో మనం 6, 7 అధ్యాయాల్లో చూస్తాం.