కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ అధ్యాయం

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు

1-3. మనందరం దేనికి ఖైదీలుగా ఉన్నాం, యెహోవా మనల్ని ఎలా విడిపిస్తాడు?

మీరు చేయని నేరానికి మీకు జీవిత ఖైదు విధించారు అనుకోండి. మీరు విడుదల అయ్యే అవకాశమే లేదు. మీ భవిష్యత్తు విషయంలో ఇంక ఏ ఆశ లేదు, మీరు చేయగలిగేది కూడా ఏమి లేదు. కానీ మీరు అన్నీ ఆశలు వదులుకున్నప్పుడు, మిమ్మల్ని విడుదల చేసే శక్తి ఒకరికి ఉందని మీకు తెలిసింది. అంతేకాదు ఆయన మిమ్మల్ని విడిపిస్తానని మాట ఇచ్చాడు. మీకు ఎలా అనిపిస్తుంది?

2 మనమంతా మరణానికి ఖైదీలం. మనం ఏమి చేసినా తప్పించుకోలేం. కానీ యెహోవాకు మనల్ని మరణం నుంచి విడిపించే శక్తి ఉంది. ఆయన “చివరి శత్రువు” మరణాన్ని కూడా తీసేస్తానని మాట ఇచ్చాడు.—1 కొరింథీయులు 15:26.

3 చనిపోతామని భయపడాల్సిన అవసరం లేదంటే మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించండి. యెహోవా మరణాన్ని తీసివేయడమే కాదు ఇప్పటికే చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికిస్తాడు. దానివల్ల మీకు ఏమి జరుగుతుందో ఆలోచించండి. “మృతుల్ని సజీవుల్ని” చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. (యెషయా 26:19) దీనినే బైబిలు పునరుత్థానం అని పిలుస్తుంది.

ఇష్టమైనవాళ్లు చనిపోతే

4. (ఎ) మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు చనిపోయినప్పుడు మనకు ఏది ఓదార్పును ఇస్తుంది? (బి) యేసు దగ్గరి స్నేహితులు కొంతమంది ఎవరు?

4 కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు చనిపోయినప్పుడు కలిగే బాధ, నొప్పి చాలా భయంకరం. మనకు నిస్సహాయంగా అనిపిస్తుంది. వాళ్లను తిరిగి బ్రతికించడానికి మనం చేయగలిగింది ఏమి లేదు. కానీ బైబిలు మనకు నిజమైన ఓదార్పును ఇస్తుంది. (2 కొరింథీయులు 1:3, 4 చదవండి.) చనిపోయిన మనవాళ్లను తిరిగి బ్రతికించాలని యెహోవా, యేసు ఎంతగా కోరుకుంటున్నారో ఒక ఉదాహరణ చూసి తెలుసుకుందాం. యేసు భూమి మీద ఉన్నప్పుడు లాజరు, అతని ఇద్దరు అక్కలు మార్త, మరియ దగ్గరకు తరచుగా వెళ్తుండేవాడు. వాళ్లు ముగ్గురు యేసుకు మంచి స్నేహితులు. “యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించాడు” అని బైబిలు చెప్తుంది. అయితే ఒక రోజు లాజరు చనిపోయాడు.—యోహాను 11:3-5.

5, 6. (ఎ) లాజరు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏడవడం చూసి యేసు ఏమి చేశాడు? (బి) మరణం గురించి యేసు ఎలా భావించాడో తెలుసుకోవడం ఎందుకు ఓదార్పుగా ఉంటుంది?

5 యేసు మార్తను, మరియను ఓదార్చడానికి వెళ్లాడు. యేసు వస్తున్నాడని విని మార్త ఆయనను కలవడానికి ఊరి బయట వరకు వెళ్లింది. ఆమె యేసును చూసి సంతోషించింది కానీ ఆయనతో ఇలా అంది: “నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు.” యేసు చాలా ఆలస్యం చేశాడని మార్త అనుకుంది. తర్వాత ఆమె సహోదరి మరియ ఏడవడం యేసు చూశాడు. వాళ్ల దుఃఖాన్ని చూసి యేసు కూడా బాధతో ఏడ్చేశాడు. (యోహాను 11:21, 33, 35) మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే తీవ్రమైన దుఃఖాన్ని ఆయన అనుభవించాడు.

6 మరణం గురించి మనకు ఎలా అనిపిస్తుందో యేసుకు కూడా అలానే అనిపిస్తుందని తెలుసుకోవడం ఓదార్పుగా ఉంటుంది. అంతేకాదు యేసు తన తండ్రి లాంటివాడు. (యోహాను 14:9) మరణాన్ని లేకుండా చేసే శక్తి యెహోవాకు ఉంది, ఎంతో త్వరలో ఆయన దాన్ని చేస్తాడు.

“లాజరూ, బయటికి రా!”

7, 8. లాజరు సమాధికున్న రాయిని తీయడానికి మార్త ఎందుకు ఒప్పుకోలేదు, కానీ యేసు ఏమి చేశాడు?

7 లాజరును పెట్టిన సమాధి దగ్గరకు యేసు వచ్చాడు. ఆ సమాధిని పెద్ద రాయితో మూసేశారు. యేసు “ఆ రాయిని తీసేయండి” అని అన్నాడు. కానీ మార్త వాళ్లను వద్దని అంటుంది. ఎందుకంటే లాజరును సమాధిలో పెట్టి అప్పటికే నాలుగు రోజులు అయింది. (యోహాను 11:39) తన సహోదరుడికి యేసు సహాయం చేయబోతున్నాడని ఆమెకు తెలీలేదు.

లాజరు పునరుత్థానం అయినప్పుడు అతని కుటుంబ సభ్యుల, స్నేహితుల సంతోషాన్ని ఊహించండి.—యోహాను 11:38-44

8 యేసు లాజరుతో “బయటికి రా!” అని పిలిచాడు. తర్వాత జరిగినదాన్ని చూసి మార్త, మరియ ఆశ్చర్యంలో మునిగిపోయారు. “చనిపోయిన వ్యక్తి బయటికి వచ్చాడు. అతని కాళ్లకు, చేతులకు వస్త్రాలు చుట్టివున్నాయి.” (యోహాను 11:43, 44) లాజరు మళ్లీ బ్రతికాడు. తన కుటుంబాన్ని, స్నేహితుల్ని తిరిగి కలుసుకున్నాడు. వాళ్లు ఆయనను కౌగిలించుకున్నారు, ముట్టుకున్నారు, ఆయనతో మాట్లాడారు. ఎంత అద్భుతం. యేసు లాజరును పునరుత్థానం చేశాడు.

“పాపా, నీతో చెప్తున్నాను, లే!”

9, 10. (ఎ) చనిపోయినవాళ్లను బ్రతికించే శక్తిని యేసుకు ఎవరు ఇచ్చారు? (బి) పునరుత్థానం గురించి బైబిల్లో ఉన్న ఉదాహరణలు మనకు ఎందుకు విలువైనవి?

9 చనిపోయినవాళ్లను యేసు తన సొంత శక్తితో బ్రతికించాడా? లేదు. లాజరును పునరుత్థానం చేయబోయే ముందు యేసు యెహోవాకు ప్రార్థన చేశాడు, యెహోవా ఆయనకు లాజరును పునరుత్థానం చేసే శక్తిని ఇచ్చాడు. (యోహాను 11:41, 42 చదవండి.) చనిపోయి బ్రతికింది ఒక్క లాజరే కాదు. చాలా అనారోగ్యంగా ఉన్న ఒక 12 ఏళ్ల పాప గురించి కూడా బైబిలు చెప్తుంది. ఆమె తండ్రి యాయీరు చాలా బాధలో ఉన్నాడు, ఆ పాపను బాగుచేయమని ఆయన యేసును వేడుకున్నాడు. ఆమె అతనికి ఒక్కగానొక్క కూతురు. ఆయన యేసుతో మాట్లాడుతుండగా కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి “మీ అమ్మాయి చనిపోయింది! ఇక బోధకుణ్ణి ఇబ్బందిపెట్టడం ఎందుకు?” అన్నారు. కానీ యేసు యాయీరుతో ఇలా అన్నాడు, “భయపడకు, విశ్వాసం ఉంచు చాలు, ఆమె రక్షించబడుతుంది.” తర్వాత ఆయన యాయీరుతో అతని ఇంటికి వెళ్లాడు. వాళ్లు ఇంటి దగ్గరికి రాగానే అందరూ ఏడవడం యేసు చూశాడు, విన్నాడు. యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఏడ్వకండి, ఆమె చనిపోలేదు, నిద్రపోతోంది అంతే.” ఆయన ఎందుకు అలా అంటున్నాడో అని బహుశా ఆ పాప అమ్మానాన్న అనుకుని ఉంటారు. అక్కడున్న వాళ్లందరినీ వెళ్లిపోమని చెప్పి యేసు ఆ పాప అమ్మానాన్నను ఆమెను పడుకో పెట్టిన గదిలోకి తీసుకుని వెళ్లాడు. యేసు నెమ్మదిగా ఆ పాప చేయి పట్టుకొని, “పాపా, నీతో చెప్తున్నాను, లే!” అని అన్నాడు. ఆమె వెంటనే లేచి నిలబడి నడవడం చూసి ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషమేసి ఉంటుందో ఊహించండి. వాళ్ల కూతురును యేసు పునరుత్థానం చేశాడు. (మార్కు 5:22-24, 35-42; లూకా 8:49-56) వాళ్లు ఆ రోజు నుండి, వాళ్ల పాపను చూసినప్పుడల్లా యెహోవా యేసు ద్వారా వాళ్ల కోసం చేసిన దానిని గుర్తు చేసుకుంటారు. *

10 యేసు బ్రతికించిన వాళ్లు తర్వాత మళ్లీ చనిపోయారు. కానీ వాళ్ల గురించి మనం చదివే విషయాలు నిజంగా విలువైనవి, ఎందుకంటే అవి మనకు నిజమైన నిరీక్షణను ఇస్తాయి. యెహోవా చనిపోయినవాళ్లను బ్రతికించాలని అనుకుంటున్నాడు, బ్రతికిస్తాడు కూడా.

పునరుత్థానం గురించిన ఉదాహరణల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు

అపొస్తలుడైన పేతురు క్రైస్తవురాలైన దొర్కాను పునరుత్థానం చేశాడు.—అపొస్తలుల కార్యాలు 9:36-42

ఏలీయా ఒక విధవరాలి కొడుకుని పునరుత్థానం చేశాడు.—1 రాజులు 17:17-24

11. ప్రసంగి 9:5 లాజరు గురించి మనకు ఏమి నేర్పిస్తుంది?

11 “చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు” అని బైబిలు స్పష్టంగా చెప్తుంది. లాజరు విషయంలో అలానే జరిగింది. (ప్రసంగి 9:5) యేసు అన్నట్లే, లాజరు నిద్రపోతున్నట్లు ఉంది. (యోహాను 11:11) సమాధిలో ఉన్నప్పుడు లాజరుకు “ఏమీ తెలీదు.”

12. లాజరు పునరుత్థానం నిజంగా జరిగిందని మనకు ఎలా తెలుసు?

12 యేసు లాజరును బ్రతికించినప్పుడు చాలామంది చూశారు. యేసు శత్రువులకు కూడా ఆయన ఈ అద్భుతాన్ని చేశాడని తెలుసు. లాజరు బ్రతికి ఉన్నాడు, అంటే, పునరుత్థానం నిజంగా జరిగిందని రుజువు ఉంది. (యోహాను 11:47) అంతేకాదు చాలామంది లాజరును చూడడానికి వెళ్లారు, దానివల్ల వాళ్లు యేసును దేవుడు పంపించాడని నమ్మడం మొదలుపెట్టారు. యేసు శత్రువులకు అది నచ్చలేదు, అందుకే వాళ్లు యేసుతో పాటు లాజరును కూడా చంపాలని అనుకున్నారు.—యోహాను 11:53; 12:9-11.

13. యెహోవా చనిపోయినవాళ్లను పునరుత్థానం చేస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

13 “సమాధుల్లో ఉన్న వాళ్లందరూ” పునరుత్థానం అవుతారని యేసు చెప్పాడు. (యోహాను 5:28) అంటే యెహోవా గుర్తు పెట్టుకున్న వాళ్లందరూ మళ్లీ బ్రతుకుతారు అని అర్థం. కానీ ఎవరినైనా పునరుత్థానం చేయడానికి యెహోవాకు వాళ్ల గురించి అన్ని విషయాలు గుర్తుండాలి కదా. మరి ఆయన వాటన్నిటినీ గుర్తుపెట్టుకోగలడా? ఆకాశంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. యెహోవాకు ప్రతీ నక్షత్రం పేరు తెలుసని బైబిలు చెప్తుంది. (యెషయా 40:26 చదవండి.) ఆయన ప్రతి నక్షత్రం పేరును గుర్తు పెట్టుకోగలిగినప్పుడు ఖచ్చితంగా ఆయన బ్రతికించాలని అనుకున్న వాళ్ల గురించి ప్రతిదీ తేలికగా గుర్తుపెట్టుకుంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవాయే అన్నిటినీ సృష్టించాడు, కాబట్టి ఆయనకు మనుషుల్ని మళ్లీ బ్రతికించే శక్తి ఉంది.

14, 15. పునరుత్థానం గురించి యోబు మాటలు మనకు ఏమి నేర్పిస్తాయి?

14 నమ్మకస్థుడైన యోబు పునరుత్థానాన్ని నమ్మాడు. ఆయన “మనిషి చనిపోతే మళ్లీ బ్రతకగలడా?” అని అడిగాడు. తర్వాత యెహోవాతో ఇలా చెప్పాడు: “నువ్వు పిలుస్తావు, నేను నీకు జవాబిస్తాను. నీ చేతుల పనిని చూడాలని నువ్వు ఎంతో కోరుకుంటావు.” అవును, చనిపోయినవాళ్లను బ్రతికించే సమయం కోసం యెహోవా ఎదురు చూస్తున్నాడని యోబుకు తెలుసు.—యోబు 14:13-15.

15 పునరుత్థాన నిరీక్షణ మీకు ఎలా అనిపిస్తుంది? ‘చనిపోయిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మళ్లీ పునరుత్థానం అవుతారా?’ అని మీరు ఆలోచిస్తుండవచ్చు. యెహోవా చనిపోయిన వాళ్లని బ్రతికించాలని అనుకుంటున్నాడనే విషయం మనకు చాలా ఓదార్పుని ఇస్తుంది. చనిపోయి బ్రతికినవాళ్లు ఎక్కడ ఉంటారు, ఎవరు పునరుత్థానం అవుతారు అనే విషయాల గురించి బైబిలు ఏమి చెప్తుందో చూద్దాం.

“వాళ్లందరూ ఆయన స్వరం విని బయటికి వస్తారు”

16. భూమి మీద పునరుత్థానం అయినవాళ్లు ఎలాంటి జీవితాన్ని ఆనందిస్తారు?

16 ఇంతకుముందు పునరుత్థానం అయినవాళ్లు భూమి మీదున్న, వాళ్ల కుటుంబాలను, స్నేహితులను తిరిగి కలుసుకున్నారు. భవిష్యత్తులో కూడా అలానే జరుగుతుంది, కానీ ఆ పునరుత్థానం ఇంకా బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటే చనిపోయి మళ్లీ భూమి మీద జీవించడానికి బ్రతికింపబడినవాళ్లు ఎప్పుడూ జీవిస్తూనే ఉంటారు, మళ్లీ చనిపోరు. అంతేకాదు, ఇప్పుడు మనం జీవిస్తున్న లాంటి లోకంలో కాకుండా పూర్తి వేరుగా ఉన్న మంచి లోకంలో వాళ్లు జీవిస్తారు. యుద్ధాలు, నేరాలు, జబ్బులు ఇంక ఉండవు.

17. చనిపోయిన వాళ్లల్లో ఎవరు మళ్లీ బ్రతుకుతారు?

17 చనిపోయిన వాళ్లలో ఎవరు మళ్లీ బ్రతుకుతారు? “సమాధుల్లో ఉన్న వాళ్లందరూ ఆయన స్వరం విని బయటికి వస్తారు” అని యేసు చెప్పాడు. (యోహాను 5:28, 29) ప్రకటన 20:13 లో “సముద్రం దానిలో ఉన్న మృతుల్ని అప్పగించింది. మరణం, సమాధి వాటిలో ఉన్న మృతుల్ని అప్పగించాయి” అని ఉంది. అవును చనిపోయిన కోట్ల మంది మళ్లీ బ్రతుకుతారు. “నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు తిరిగి బ్రతికిస్తాడని” అపొస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. (అపొస్తలుల కార్యాలు 24:15 చదవండి.) అంటే ఏంటి?

చనిపోయినవాళ్లు పరదైసులో బ్రతుకుతారు, వాళ్ల ప్రియమైన వాళ్లను తిరిగి కలుసుకుంటారు

18. పునరుత్థానం అయ్యే నీతిమంతులు ఎవరు?

18 నీతిమంతులు అంటే యేసు భూమి మీదకు రాకముందు జీవించిన నమ్మకమైన యెహోవా సేవకులు. నోవహు, అబ్రాహాము, శారా, మోషే, రూతు, ఎస్తేరు లాంటివాళ్లు భూమి మీద పునరుత్థానం అయ్యే వాళ్లలో ఉంటారు. వాళ్లలో కొంతమంది గురించి మీరు హెబ్రీయులు 11వ అధ్యాయంలో చదవవచ్చు. మరి మన కాలంలో చనిపోయిన యెహోవా నమ్మకమైన సేవకుల పరిస్థితి ఏంటి? వాళ్లు కూడా నీతిమంతులే కాబట్టి వాళ్లూ పునరుత్థానం అవుతారు.

19. ‘అనీతిమంతులు’ అంటే ఎవరు? యెహోవా వాళ్లకు ఏ అవకాశాన్ని ఇస్తాడు?

19 అనీతిమంతులు అంటే యెహోవా గురించి తెలుసుకునే అవకాశం దొరకని కోట్లమంది ప్రజలు. వాళ్లు చనిపోయినా యెహోవా వాళ్లను మర్చిపోలేదు. ఆయన వాళ్లను పునరుత్థానం చేస్తాడు, అప్పుడు వాళ్లకు ఆయన గురించి నేర్చుకుని, ఆయనను సేవించే అవకాశం దొరుకుతుంది.

20. అందరూ ఎందుకు పునరుత్థానం అవ్వరు?

20 అంటే చనిపోయిన వాళ్లందరూ పునరుత్థానం అవుతారని దీని అర్థమా? కాదు. కొంతమందికి అసలు పునరుత్థానమే ఉండదని యేసు చెప్పాడు. (లూకా 12:5) ఒక వ్యక్తి పునరుత్థానం అవుతాడో లేదో ఎవరు నిర్ణయిస్తారు? యెహోవాయే అత్యున్నత న్యాయాధిపతి, కానీ “బ్రతికివున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పు తీర్చడానికి దేవుడు న్యాయమూర్తిగా” యేసుకు కూడా అధికారాన్ని ఇచ్చాడు. (అపొస్తలుల కార్యాలు 10:42) దుష్టులుగా తీర్పు పొందినవాళ్లు, మారడానికి ఇష్టపడనివాళ్లు పునరుత్థానం అవ్వరు.—అదనపు సమాచారంలో 19వ పాయింట్‌ చూడండి.

పరలోక పునరుత్థానం

21, 22. (ఎ) పరలోకానికి పునరుత్థానం అవ్వడం అంటే ఏంటి? (బి) పరలోకానికి పునరుత్థానమైన వాళ్లలో మొదటి వ్యక్తి ఎవరు?

21 కొంతమంది పరలోకంలో నివసిస్తారని కూడా బైబిలు చెప్తుంది. ఎవరైనా పరలోకానికి పునరుత్థానం అయితే వాళ్లు మళ్లీ మనిషిగా, మనిషి శరీరంతో బ్రతకరు. ఆత్మ ప్రాణిగా పరలోకంలో జీవించడానికి పునరుత్థానం అవుతారు.

22 ఇలాంటి పునరుత్థానం పొందిన వాళ్లలో యేసు మొదటివాడు. (యోహాను 3:13) యేసు చంపబడిన మూడు రోజుల తర్వాత, యెహోవా ఆయనను పునరుత్థానం చేశాడు. (కీర్తన 16:10; అపొస్తలుల కార్యాలు 13:34, 35) యేసు మనిషి శరీరంతో పునరుత్థానం కాలేదు. యేసు “మానవ శరీరంతో చనిపోయాడు, కానీ పరలోక సంబంధమైన శరీరంతో బ్రతికించబడ్డాడు” అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (1 పేతురు 3:18) శక్తివంతమైన ఆత్మ ప్రాణిగా యేసు బ్రతికించబడ్డాడు. (1 కొరింథీయులు 15:3-6) కానీ అలా బ్రతికేది ఆయనొక్కడే కాదు అని బైబిలు చెప్తుంది.

23, 24. యేసు చెప్పిన చిన్నమంద ఎవరు?వాళ్లలో ఎంతమంది ఉంటారు?

23 చనిపోయే కాస్త ముందు యేసు తన నమ్మకమైన శిష్యులకు ఇలా చెప్పాడు: “నేను మీ కోసం స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను.” (యోహాను 14:2) అంటే ఆయన అనుచరుల్లో కొంతమంది పరలోకంలో ఆయనతో ఉండడానికి పునరుత్థానం అవుతారు. అలా ఎంతమంది పునరుత్థానం అవుతారు? ఒక చిన్నమంద, అంటే చాలా తక్కువమంది అని యేసు చెప్పాడు. (లూకా 12:32) అపొస్తలుడైన యోహాను ఆ ఖచ్చితమైన సంఖ్యను ఇచ్చాడు. యోహాను ఆ సంఖ్యను, యేసు “సీయోను పర్వతం మీద నిలబడి” ఉండడాన్ని “1,44,000 మంది ఆయనతో పాటు” ఉండడాన్ని చూసినప్పుడు చెప్పగలిగాడు.—ప్రకటన 14:1.

24 మరి 1,44,000 మంది క్రైస్తవులు ఎప్పుడు పునరుత్థానం అవుతారు? క్రీస్తు పరలోకంలో పరిపాలించడం మొదలుపెట్టాక ఇది జరుగుతుందని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 15:23) మనం ఇప్పుడు ఆ కాలంలోనే జీవిస్తున్నాం, ఇప్పటికే 1,44,000లో చాలామంది పరలోకానికి పునరుత్థానం అయిపోయారు. ఇంకా భూమి మీద ఉండి, మనకాలంలో చనిపోయినవాళ్లు వెంటనే పరలోకంలో జీవించడానికి పునరుత్థానం అవుతారు. కానీ ఎక్కువ మంది భూమి మీద పరదైసులో జీవించడానికే భవిష్యత్తులో పునరుత్థానం అవుతారు.

25. మనం తర్వాత అధ్యాయంలో ఏమి నేర్చుకుంటాం?

25 చాలా త్వరలో యెహోవా మనుషులందరినీ మరణం నుండి విడిపిస్తాడు, మరణం ఇంక అస్సలు ఉండదు. (యెషయా 25:8 చదవండి.) కానీ పరలోకానికి వెళ్లే వాళ్లు అక్కడ ఏమి చేస్తారు? వాళ్లు రాజ్య ప్రభుత్వంలో యేసుతో పాటు పరిపాలిస్తారని బైబిలు చెప్తుంది. మనం ఆ ప్రభుత్వం గురించి తర్వాత అధ్యాయంలో ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం.

^ పేరా 9 వేరే చోట్ల కూడా బైబిలు పునరుత్థానం అయిన పిల్లలు, పెద్దవాళ్లు, స్త్రీలు, పురుషులు, ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులు కాని వాళ్ల గురించి చెప్తుంది. వాటిని మీరు 1 రాజులు 17:17-24; 2 రాజులు 4:32-37; 13:20, 21; మత్తయి 28:5-7; లూకా 7:11-17; 8:40-56; అపొస్తలుల కార్యాలు 9:36-42; 20:7-12 వచనాల్లో చదవవచ్చు.