కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ అధ్యాయం

దేవుని రాజ్యం అంటే ఏంటి?

దేవుని రాజ్యం అంటే ఏంటి?

1. చాలామందికి తెలిసిన ఏ ప్రార్థన గురించి మనం ఇప్పుడు చూస్తాం?

కోట్లమంది ప్రజలకు పరలోక ప్రార్థన లేదా ప్రభువు ప్రార్థన తెలుసు. యేసు ఈ ప్రార్థనను ఉపయోగించి తన శిష్యులకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు. ఆయన వేటికోసం ప్రార్థన చేశాడు? ఈ ప్రార్థన ఇప్పుడు మనకు ఎందుకు ముఖ్యం?

2. యేసు ఏ మూడు ముఖ్యమైన విషయాల గురించి ప్రార్థన చేయమని మనకు నేర్పించాడు?

2 యేసు ఇలా చెప్పాడు: “కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థించాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి. నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి.’” (మత్తయి 6:9-13 చదవండి.) యేసు ఈ మూడు విషయాల గురించి ప్రార్థన చేయమని మనకు ఎందుకు నేర్పించాడు?—అదనపు సమాచారంలో 20వ పాయింట్‌ చూడండి.

3. దేవుని రాజ్యం గురించి మనం ఏమి తెలుసుకోవాలి?

3 మనం దేవుని పేరు యెహోవా అని నేర్చుకున్నాం. భూమి గురించి, మనుషుల గురించి దేవుని ఉద్దేశం ఏమిటో కూడా చూశాం. కానీ “నీ రాజ్యం రావాలి” అని యేసు అన్నాడు, ఆ మాటల భావం ఏమిటి? దేవుని రాజ్యం అంటే ఏంటి, అది ఏమి చేస్తుంది, ఆ రాజ్యం దేవుని పేరును ఎలా పవిత్రం చేస్తుంది అనే విషయాల గురించి మనం నేర్చుకుంటాం.

దేవుని రాజ్యం అంటే ఏంటి?

4. దేవుని రాజ్యం అంటే ఏంటి? దానికి రాజు ఎవరు?

4 యెహోవా ఒక పరలోక ప్రభుత్వాన్ని స్థాపించి దానికి యేసును రాజుగా ఎన్నుకున్నాడు. బైబిలు ఈ ప్రభుత్వాన్ని దేవుని రాజ్యం అని పిలుస్తుంది. యేసు “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.” (1 తిమోతి 6:15) యేసు మానవ పరిపాలకుడు చేయలేని మంచిని ప్రజలకు చేయగలడు, అంతేకాదు పరిపాలకులు అందరినీ కలిపినా వాళ్లందరికన్నా ఆయన చాలా శక్తిమంతుడు.

5. దేవుని ప్రభుత్వం ఎక్కడ ఉండి పరిపాలిస్తుంది? దేన్ని పరిపాలిస్తుంది?

5 పునరుత్థానమైన 40 రోజులకు యేసు పరలోకానికి వెళ్లాడు. కొంతకాలం తర్వాత యెహోవా ఆయనను ఆ రాజ్యానికి రాజుగా నియమించాడు. (అపొస్తలుల కార్యాలు 2:33) దేవుని ప్రభుత్వం పరలోకం నుండి భూమిని పరిపాలిస్తుంది. (ప్రకటన 11:15) అందుకే బైబిలు, దేవుని రాజ్యాన్ని “పరలోక రాజ్యం” అని పిలుస్తుంది.—2 తిమోతి 4:18.

6, 7. యేసు ఏ మానవ రాజుకన్నా గొప్పవాడని ఎందుకు చెప్పవచ్చు?

6 ఏ మానవ రాజుకన్నా యేసే గొప్పవాడని బైబిలు చెప్తుంది, ఎందుకంటే “ఆయన మాత్రమే అమర్త్యత గలవాడు.” (1 తిమోతి 6:16) మానవ పరిపాలకులందరూ చివరికి చనిపోతారు, కానీ యేసు ఎప్పటికీ చనిపోడు. ఆయన మనకు చేసే మంచి శాశ్వతంగా ఉండిపోతుంది.

7 యేసు న్యాయంగా, దయగా ఉండే రాజని బైబిలు ప్రవచనం చెప్తుంది: “యెహోవా పవిత్రశక్తి ఆయన మీద నిలిచివుంటుంది, అది ఆయనకు తెలివిని, అవగాహనను ఇస్తుంది, ఆ పవిత్రశక్తి వల్ల ఆయన మంచి సలహా ఇస్తాడు, బలవంతుడిగా ఉంటాడు, ఆ పవిత్రశక్తి వల్ల ఆయనకు చాలా జ్ఞానం, యెహోవా పట్ల భయభక్తులు ఉంటాయి. యెహోవా పట్ల భయభక్తులు కలిగివుండడం అంటే ఆయనకు ఇష్టం. ఆయన కంటికి కనిపించేదాన్ని బట్టి తీర్పుతీర్చడు, కేవలం చెవులతో విన్నదాన్ని బట్టి గద్దింపు ఇవ్వడు. ఆయన పక్షపాతం లేకుండా దీనులకు [లేదా, పేదవాళ్లకు] తీర్పుతీరుస్తాడు.” (యెషయా 11:2-4) మీ రాజు అలా ఉండాలని మీరు కోరుకోరా?

8. యేసుతో పాటు ఇంకొంతమంది పరిపాలిస్తారని మనకు ఎలా తెలుసు?

8 పరలోక ప్రభుత్వంలో యేసుతో పాటు పరిపాలించడానికి దేవుడు కొంతమంది మనుషుల్ని ఎన్నుకున్నాడు. ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు తిమోతితో ఇలా అన్నాడు: “మనం సహిస్తూ ఉంటే, ఆయనతో కలిసి రాజులుగా పరిపాలిస్తాం.” (2 తిమోతి 2:12) యేసుతో పాటు ఎంతమంది రాజులుగా పరిపాలిస్తారు?

9. యేసుతో ఎంతమంది పరిపాలిస్తారు? దేవుడు వాళ్లను ఎన్నుకోవడం ఎప్పుడు మొదలుపెట్టాడు?

9 మనం 7వ అధ్యాయంలో నేర్చుకున్నట్లుగా అపొస్తలుడైన యోహానుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో యోహాను యేసును పరలోకంలో రాజుగా చూశాడు. ఆయనతో పాటు 1,44,000 మిగతా రాజులు ఉన్నారు. 1,44,000 ఎవరు? వీళ్లు “ఆయన [యేసు] పేరు, ఆయన తండ్రి పేరు నొసళ్ల మీద రాయబడిన” వాళ్లు. “వీళ్లు గొర్రెపిల్ల [యేసు] ఎక్కడికి వెళ్లినా సరే, ఆయన వెంట వెళ్తూ ఉంటారు.” వీళ్లు మనుషుల్లో నుండి కొనబడ్డారని యోహాను వివరించాడు. (ప్రకటన 14:1, 4 చదవండి.) 1,44,000 మంది యేసుతోపాటు “రాజులుగా ఈ భూమిని” పరిపాలించడానికి దేవుడు ఎన్నుకున్న నమ్మకమైన క్రైస్తవులు. వాళ్లు చనిపోగానే, పరలోకంలో జీవించడానికి పునరుత్థానం అవుతారు. (ప్రకటన 5:10) 1,44,000 మంది రాజుల్లో ఉండడానికి యెహోవా నమ్మకమైన క్రైస్తవులను అపొస్తలుల కాలం నుండి ఎన్నుకుంటున్నాడు.

10. మనుషులను పరిపాలించడానికి యేసును, 1,44,000 మందిని నియమించడంలో యెహోవా ప్రేమ ఎలా కనపడుతుంది?

10 యెహోవాకు మన మీద చాలా శ్రద్ధ ఉంది కాబట్టి ఆయన యేసుతో పాటు పరిపాలించడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాడు. యేసు మనల్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి మంచి పరిపాలకుడిగా ఉంటాడు. మనిషి జీవితం ఎలా ఉంటుందో, బాధ అంటే ఏమిటో యేసుకు బాగా తెలుసు. యేసు మన గురించి బాధపడతాడు, ఆయన “మన బలహీనతల్ని అర్థంచేసుకోలేనివాడు కాదు, మనలాగే ఆయనకు అన్నిరకాల పరీక్షలు ఎదురయ్యాయి” అని పౌలు చెప్పాడు. (హెబ్రీయులు 4:15; 5:8) 1,44,000 మందికి కూడా మనిషి జీవితం ఎలా ఉంటుందో తెలుసు. వాళ్లు కూడా అపరిపూర్ణతతో రోగాలతో పోరాడినవాళ్లే. కాబట్టి యేసు, 1,44,000 మంది, మన భావాలనే కాదు, మన ఎదుర్కొనే సమస్యలను కూడా అర్థం చేసుకోగలరని మనం నమ్మకంతో ఉండవచ్చు.

దేవుని రాజ్యం ఏమి చేస్తుంది?

11. పరలోకంలో దేవుని ఇష్టం జరిగేలా ప్రార్థించమని యేసు తన శిష్యులకు ఎందుకు నేర్పించాడు?

11 పరలోకంలో దేవుని ఇష్టం జరిగేలా ప్రార్థించమని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఎందుకు? మనం 3వ అధ్యాయంలో చూసినట్లు అపవాదియైన సాతాను యెహోవాకు ఎదురుతిరిగాడు. సాతాను ఎదురు తిరిగాక అతనిని, నమ్మకద్రోహులైన దూతల్ని లేదా దయ్యాల్ని యెహోవా కొంతకాలం పరలోకంలోనే ఉండనిచ్చాడు. అంటే పరలోకంలో కొంతమంది దేవుని ఇష్టం చేయడం లేదు. 10వ అధ్యాయంలో మనం సాతాను గురించి, చెడ్డదూతల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటాం.

12. ప్రకటన 12:10 లో ఏ రెండు ముఖ్యమైన సంఘటనలు వివరించబడ్డాయి?

12 యేసు దేవుని రాజ్యానికి రాజు అవ్వగానే సాతాను మీద యుద్ధానికి వెళ్తాడని బైబిలు చెప్తుంది. (ప్రకటన 12:7-10 చదవండి.) 10వ వచనం రెండు ముఖ్యమైన సంఘటనలను వివరిస్తుంది. రాజైన యేసుతో దేవుని రాజ్య పరిపాలన మొదలవుతుంది, సాతాను పరలోకం నుండి భూమి మీదకు పడవేయబడతాడు. అయితే, ఈ సంఘటనలన్నీ ఇప్పటికే జరిగిపోయాయని మనం తర్వాత నేర్చుకుంటాం.

13. సాతాను పడవేయబడ్డాక పరలోకంలో ఏమి జరిగింది?

13 సాతాను అతని చెడ్డదూతలు పరలోకం నుండి పడవేయబడ్డాక నమ్మకమైన దేవదూతల ఆనందాన్ని బైబిలు వివరిస్తుంది. “పరలోకమా, పరలోక నివాసులారా, సంతోషించండి!” అని బైబిల్లో ఉంది. (ప్రకటన 12:12) ఇప్పుడు పరలోకంలో పూర్తిగా శాంతి, ఐక్యత ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అందరూ దేవుని ఇష్టాన్ని చేస్తున్నారు.

సాతాను, అతని చెడ్డదూతలు పరలోకం నుండి పడవేయబడ్డారు కాబట్టి భూమి మీద ఇన్ని కష్టాలు ఉన్నాయి.

14. సాతాను పరలోకం నుండి పడవేయబడ్డాడు కాబట్టి భూమి మీద ఏమి జరిగింది?

14 కానీ భూమి మీద జీవితం అలా లేదు. మనుషులకు భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి, “ఎందుకంటే అపవాది తనకు కొంచెం సమయమే ఉందని తెలిసి చాలా కోపంతో” దిగివచ్చాడు. (ప్రకటన 12:12) సాతాను ఉద్రేకంతో ఉన్నాడు. అతను పరలోకం నుండి పడవేయబడ్డాడు, ఇంక త్వరలో నాశనం అయిపోతాడు అని అతనికి తెలుసు. భూమి మీద సమస్యలు, శ్రమలు, కష్టాలు తీసుకురావడానికి సాతాను చేయగలిగినదంతా చేస్తాడు.

15. భూమి గురించి దేవుని ఉద్దేశం ఏంటి?

15 భూమి గురించి దేవుని ఉద్దేశం మారలేదు. పరదైసు భూమి మీద పరిపూర్ణ మనుషులు శాశ్వతంగా జీవించాలని దేవుడు ఇంకా కోరుకుంటున్నాడు. (కీర్తన 37:29) మరి దేవుని రాజ్యం దానిని ఎలా సాధిస్తుంది?

16, 17. దానియేలు 2:44 మనకు దేవుని రాజ్యం గురించి ఏమని చెప్తుంది?

16 దానియేలు 2:44 లో ప్రవచనం ఇలా చెప్తుంది: “ఆ రాజుల కాలాల్లో పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది ఎప్పటికీ నాశనం కాదు. ఆ రాజ్యం వేరే ఏ ప్రజల చేతుల్లోకి వెళ్లదు. అది ఆ రాజ్యాలన్నిటినీ నలగ్గొట్టి నాశనం చేస్తుంది, అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది.” ఈ ప్రవచనం దేవుని రాజ్యం గురించి మనకు ఏమి నేర్పిస్తుంది?

17 ఆ ప్రవచనం మొదట, దేవుని రాజ్యం “ఆ రాజుల కాలాల్లో” పరిపాలించడం మొదలుపెడుతుంది అని చెప్తుంది. అంటే దేవుని రాజ్య పరిపాలన మొదలైనప్పుడు భూమి మీద ఇంకా మిగతా ప్రభుత్వాలు ఉంటాయి. రెండు, దేవుని రాజ్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది, వేరే ఏ ప్రభుత్వం ఆ స్థానంలోకి రాదు అని ఆ ప్రవచనం చెప్తుంది. మూడు, దేవుని రాజ్యానికీ లోకంలో ఉన్న ప్రభుత్వాలన్నిటికీ యుద్ధం జరుగుతుంది. అప్పుడు దేవుని రాజ్యం గెలుస్తుంది, అది భూమిని పరిపాలించే ఒకే ఒక్క ప్రభుత్వంగా అవుతుంది. అప్పుడు మనుషులు ఇప్పటివరకు చూడని మంచి ప్రభుత్వాన్ని చూస్తారు.

18. దేవుని రాజ్యానికి, ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలకు జరిగే చివరి యుద్ధం పేరేంటి?

18 దేవుని రాజ్యం భూమి మీద పరిపాలనను ఎలా చేజిక్కించుకుంటుంది? అర్మగిద్దోను అనే చివరి యుద్ధానికి ముందు చెడ్డదూతలు “భూమంతటా ఉన్న రాజుల్ని” తప్పుదారి పట్టిస్తారు. వాళ్లు “సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధం కోసం భూమంతా ఉన్న రాజుల్ని” పోగుచేస్తారు. అవును మానవ ప్రభుత్వాలు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడతాయి.—ప్రకటన 16:14, 16; అదనపు సమాచారంలో 10వ పాయింట్‌ చూడండి.

19, 20. దేవుని రాజ్యం భూమిని ఎందుకు పరిపాలించాలి?

19 మనకు దేవుని రాజ్యం ఎందుకు అవసరం? దానికి కనీసం మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి మనం పాపులం, రోగాలు వచ్చి చనిపోతాం. కానీ దేవుని రాజ్యంలో మనం శాశ్వతంగా బ్రతికి ఉంటామని బైబిలు చెప్తుంది. యోహాను 3:16 లో ఇలా ఉంది “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.”

20 రెండవ కారణం మన చుట్టూ దుష్టులైన ప్రజలు ఉన్నారు. చాలామంది అబద్ధాలు చెప్తారు, మోసం చేస్తారు, లైంగిక పాపాలు చేస్తారు. వాళ్లను తీసివేయడానికి మనం ఏమి చేయలేం, కానీ దేవుడు చేయగలడు. చెడ్డ పనులు చేస్తూ ఉండేవాళ్లు అర్మగిద్దోనులో నాశనం అవుతారు. (కీర్తన 37:10 చదవండి.) మనకు దేవుని రాజ్యం ఎందుకు అవసరమో చెప్పడానికి మూడవ కారణం ఏంటంటే మానవ ప్రభుత్వాలు ఇప్పటి వరకూ బలహీనంగా, క్రూరంగా, అవినీతితో ఉన్నాయి. దేవునికి లోబడేలా ప్రజలకు సహాయం చేయాలని ఆ పరిపాలకులు అనుకోరు. “మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని చేసుకున్నాడు” అని బైబిలు చెప్తుంది.—ప్రసంగి 8:9.

21. భూమి మీద దేవుని ఇష్టం జరిగేలా ఆ రాజ్యం ఏమి చేస్తుంది?

21 అర్మగిద్దోను తర్వాత దేవుని రాజ్యం భూమి మీద దేవుని ఇష్టం జరిగేలా చేస్తుంది. ఉదాహరణకు ఆ రాజ్యం సాతానును అతని చెడ్డ దూతలను తీసేస్తుంది. (ప్రకటన 20:1-3) ఎవ్వరూ అనారోగ్యంతో బాధపడరు లేదా చనిపోరు. విమోచన క్రయధనం వల్ల నమ్మకమైన మనుషులంతా పరదైసులో శాశ్వతంగా జీవిస్తారు. (ప్రకటన 22:1-3) ఆ రాజ్యం దేవుని పేరును పవిత్రం చేస్తుంది. అంటే ఏంటి? అంటే దేవుని ప్రభుత్వం భూమిని పరిపాలిస్తున్నప్పుడు, మనుషులందరూ దేవుని పేరును గౌరవిస్తారు.—అదనపు సమాచారంలో 21వ పాయింట్‌ చూడండి.

యేసు ఎప్పుడు రాజు అయ్యాడు?

22. యేసు భూమి మీద ఉన్నప్పుడు లేదా పునరుత్థానం అయిన వెంటనే రాజు అవ్వలేదని మనకు ఎలా తెలుసు?

22 యేసు తన శిష్యులకు “నీ రాజ్యం రావాలి” అని ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి భవిష్యత్తులో దేవుని ప్రభుత్వం వస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. యెహోవా మొదట తన ప్రభుత్వాన్ని స్థాపించి యేసును రాజుగా చేస్తాడు. యేసు భూమి మీదనుండి పరలోకానికి వెళ్లిపోగానే రాజు అయ్యాడా? లేదు. ఆయన ఆగాల్సి వచ్చింది. ఈ విషయాన్ని యేసు పునరుత్థానమైన కొంతకాలానికి పేతురు, పౌలు స్పష్టం చేశారు. వాళ్లు కీర్తన 110:1 ని ఉపయోగిస్తూ యేసు గురించి చెప్పారు. ఆ ప్రవచనంలో “నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు నువ్వు నా కుడిపక్కన కూర్చో” అని యెహోవా చెప్పాడు. (అపొస్తలుల కార్యాలు 2:32-35; హెబ్రీయులు 10:12, 13) యెహోవా ఆయనను రాజుగా చేసే వరకు యేసు ఎంతకాలం ఆగాల్సి వచ్చింది?

దేవుని రాజ్యం భూమి మీద దేవుని ఇష్టం జరిగేలా చేస్తుంది

23. (ఎ) యేసు ఎప్పుడు దేవుని ప్రభుత్వానికి రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడు? (బి) మనం తర్వాత అధ్యాయంలో ఏమి నేర్చుకుంటాం?

23 1914కు చాలా సంవత్సరాల ముందు, నిజాయితీగా ఆలోచించే క్రైస్తవులు కొంతమంది, బైబిలు ప్రవచనాల్లో ఆ సంవత్సరం ముఖ్యమైనదని అర్థం చేసుకున్నారు. 1914 నుండి జరిగిన ప్రపంచ సంఘటనలు కూడా అది నిజమే అని రుజువు చేశాయి. యేసు రాజుగా పరిపాలించడం మొదలుపెట్టింది ఆ సంవత్సరంలోనే. (కీర్తన 110:2) ఆ తర్వాత వెంటనే సాతాను భూమి మీదకు పడవేయబడ్డాడు. ఇప్పుడు అతనికి ‘కొంచెం సమయమే ఉంది.’ (ప్రకటన 12:12) తర్వాత అధ్యాయంలో మనం ఆ సమయంలోనే జీవిస్తున్నామని చాలా రుజువుల్ని చూస్తాం. దేవుని రాజ్యం త్వరలో భూమి మీద దేవుని ఇష్టం జరిగేలా చేస్తుందని కూడా నేర్చుకుంటాం.—అదనపు సమాచారంలో 22వ పాయింట్‌ చూడండి.