కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

9వ అధ్యాయం

లోకాంతం దగ్గర్లో ఉందా?

లోకాంతం దగ్గర్లో ఉందా?

1. మనం భవిష్యత్తు గురించి ఎక్కడ తెలుసుకోగలం?

మీరు టీవీలో వార్తలు చూసినప్పుడు ‘పరిస్థితి ఎందుకు ఇంత భయంకరంగా ఉంది’ అని ఎప్పుడైనా అనుకున్నారా? ప్రపంచంలో ఎంతో విషాదం, క్రూరత్వం ఉండడం వల్ల కొంతమంది మనం లోకాంతానికి దగ్గర్లో ఉన్నామని నమ్ముతున్నారు. అది నిజమేనా? భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఏమైనా ఉందా? భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనుషులు తెలుసుకోలేకపోయినా, యెహోవా దేవుడు తెలుసుకోగలడు. మన భవిష్యత్తు గురించి, ఈ భూమి భవిష్యత్తు గురించి ఆయన బైబిల్లో చెప్తున్నాడు.—యెషయా 46:10; యాకోబు 4:14.

2, 3. యేసు శిష్యులు ఏమి తెలుసుకోవాలని అనుకున్నారు? యేసు వాళ్లకు ఎలా జవాబు ఇచ్చాడు?

2 బైబిల్లో మనం లోకాంతం గురించి చదివినప్పుడు, దానర్థం ఈ భూమంతా నాశనం అవుతుంది అని కాదు గానీ, చెడుతనం నాశనం అవుతుంది అని అర్థం. దేవుని రాజ్యం ఈ భూమిని పరిపాలిస్తుందని యేసు ప్రజలకు బోధించాడు. (లూకా 4:43) ఆయన శిష్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని అనుకున్నారు, వాళ్లు యేసును ఇలా అడిగారు: “ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏమిటి?” (మత్తయి 24:3) యేసు వాళ్లకు ఖచ్చితమైన తేదీని చెప్పలేదు, కానీ ఈ లోకం అంతమయ్యే కాస్త ముందు ఏమి జరుగుతుందో చెప్పాడు. యేసు ఏ విషయాలు జరుగుతాయని చెప్పాడో అవి ఇప్పుడు జరుగుతున్నాయి.

3 మనం లోకాంతానికి ఎంతో దగ్గర్లో ఉన్నామనే రుజువులను ఈ అధ్యాయంలో చర్చిస్తాం. మొదటిగా, మనం పరలోకంలో జరిగిన ఒక యుద్ధం గురించి తెలుసుకోవాలి, అప్పుడు ఈ భూమ్మీద పరిస్థితులు ఎందుకు ఇంత భయంకరంగా ఉన్నాయో మనకు అర్థం అవుతుంది.

పరలోకంలో యుద్ధం

4, 5. (ఎ) యేసు రాజు అయిన వెంటనే పరలోకంలో ఏమి జరిగింది? (బి) ప్రకటన 12:12 ప్రకారం, సాతాను కిందకు పడవేయబడినప్పటి నుండి భూమ్మీద ఏమి జరుగుతుంది?

4 యేసు 1914లో పరలోకంలో రాజు అయ్యాడని మనం 8వ అధ్యాయంలో తెలుసుకున్నాం. (దానియేలు 7:13, 14) అప్పుడు ఏమి జరిగిందో ప్రకటన పుస్తకం మనకు చెప్తుంది: “పరలోకంలో యుద్ధం మొదలైంది. మిఖాయేలు [అంటే, యేసు], ఆయన దూతలు మహాసర్పంతో [సాతానుతో] యుద్ధం చేశారు. మహాసర్పం, దాని దూతలు కూడా యుద్ధం చేశారు.” * సాతాను, అతని చెడ్డ దూతలు ఆ యుద్ధంలో ఓడిపోయి, ఈ భూమ్మీదకు పడవేయబడ్డారు. అప్పుడు దేవదూతలు ఎంత సంతోషించి ఉంటారో ఒక్కసారి ఊహించండి! కానీ భూమ్మీద ఉన్న ప్రజల విషయం ఏమిటి? ఇది భూమి మీద ప్రజలందరికీ ఎంతో బాధ కలిగించే సమయం అని బైబిలు చెప్తుంది. ఎందుకు? ఎందుకంటే, సాతాను “తనకు కొంచెం సమయమే ఉందని తెలిసి” చాలా కోపంగా ఉన్నాడు.—ప్రకటన 12:7, 9, 12.

5 సాతాను ఈ భూమ్మీద ఎన్ని సమస్యలు తీసుకురాగలడో అన్ని సమస్యలు తీసుకొస్తున్నాడు. దేవుడు సాతానుని నాశనం చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి సాతాను చాలా కోపంగా ఉన్నాడు. చివరి రోజుల్లో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడో ఇప్పుడు పరిశీలిద్దాం.—అదనపు సమాచారంలో 24వ పాయింట్‌ చూడండి.

చివరి రోజులు

6, 7. ఇప్పుడున్న యుద్ధాలు, ఆహారకొరతలు గురించి ఏమి చెప్పవచ్చు?

6 యుద్ధాలు. యేసు ఇలా చెప్పాడు: “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి.” (మత్తయి 24:7) చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మన కాలంలో జరిగిన యుద్ధాల్లో ఎక్కువమంది చనిపోయారు. వరల్డ్‌వాచ్‌ ఇన్సిట్యూట్‌ చెప్పే ఒక రిపోర్టు ప్రకారం, 1914 నుండి 10 కోట్ల కన్నా ఎక్కువమంది యుద్ధాల్లో చనిపోయారు. 1,900 సంవత్సరాల్లో జరిగిన యుద్ధాల వల్ల చనిపోయిన వాళ్లకన్నా, 1900 నుండి 2000 మధ్య ఉన్న 100 సంవత్సరాల్లో చనిపోయినవాళ్లు మూడు రెట్లు ఎక్కువ. లక్షలమంది ప్రజలు యుద్ధం వల్ల అనుభవించిన మానసిక వేదనను, బాధను ఒక్కసారి ఊహించుకోండి!

7 ఆకలి. యేసు ఇలా చెప్పాడు: “ఆహారకొరతలు . . . వస్తాయి.” (మత్తయి 24:7) ఇంతకుముందుకన్నా ఇప్పుడు ఎక్కువ ఆహారం పండుతుంది కానీ, చాలామంది ప్రజలకు తినడానికి సరిపోయేంత ఆహారం లేదు. ఎందుకు? ఎందుకంటే ఆహారం కొనడానికి సరిపోయేంత డబ్బు లేదా పండించడానికి సరిపోయేంత భూమి వాళ్ల దగ్గర లేదు. వంద కోట్ల కన్నా ఎక్కువమంది ప్రజలు ప్రతీరోజు కనీస ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా జీవిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతీ సంవత్సరం కోట్లమంది పిల్లలు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి సరిపోయేంత ఆహారం లేకపోవడం వల్లే చనిపోతున్నారు.

8, 9. భూకంపాలు, వ్యాధుల విషయంలో యేసు చెప్పిన ప్రవచనాలు నెరవేరుతున్నాయని ఏది చూపిస్తుంది?

8 భూకంపాలు. యేసు ఇలా ప్రవచించాడు: “తీవ్రమైన భూకంపాలు వస్తాయి.” (లూకా 21:11) ఇప్పుడు ప్రతీ సంవత్సరం పెద్దపెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. 1900వ సంవత్సరం నుండి భూకంపాల వల్ల 20 లక్షల కన్నా ఎక్కువమంది చనిపోయారు. భూకంపాలను ముందుగానే కనిపెట్టే టెక్నాలజీ ముందుకన్నా ఇప్పుడు ఎక్కువగా సహాయపడుతుంది. అయినప్పటికీ ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు.

9 వ్యాధులు. “పెద్దపెద్ద అంటువ్యాధులు” వస్తాయని యేసు ముందే చెప్పాడు. ప్రమాదకరమైన వ్యాధులు త్వరగా వ్యాపించి చాలామంది చనిపోతున్నారు. (లూకా 21:11) డాక్టర్లు చాలా జబ్బులను తగ్గించడం నేర్చుకున్నారు కానీ ఇప్పటికీ తగ్గించలేని జబ్బులు చాలా ఉన్నాయి. నిజానికి ఒక రిపోర్టు ప్రకారం, ప్రతి సంవత్సరం లక్షలమంది క్షయ, మలేరియా, కలరా వంటి జబ్బుల వల్ల చనిపోతున్నారు. అవికాక, డాక్టర్లు మరో 30 కొత్త జబ్బుల్ని కనుక్కున్నారు, వాటిలో కొన్నిటిని అసలు తగ్గించలేం.

చివరి రోజుల్లో ప్రజలు ఎలా ఉంటారు?

10. 2 తిమోతి 3:1-5 వచనాలు ఈ రోజుల్లో ఎలా నిజమౌతున్నాయి?

10 బైబిల్లో 2 తిమోతి 3:1-5 వచనాల్లో ఇలా ఉంది: “చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి.” చివరి రోజుల్లో చాలామంది ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో అపొస్తలుడైన పౌలు వివరించాడు. ప్రజలు ఇలా ఉంటారని ఆయన చెప్పాడు:

  • స్వార్థపరులు

  • డబ్బును ప్రేమించేవాళ్లు

  • అమ్మానాన్నలకు లోబడనివాళ్లు

  • నమ్మకంగా ఉండనివాళ్లు

  • కుటుంబం పట్ల మమకారం లేనివాళ్లు

  • ఆత్మనిగ్రహం లేనివాళ్లు

  • దౌర్జన్యంగా, కోపంగా ఉండేవాళ్లు

  • దేవున్ని కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు

  • పైకి దేవుని మీద ప్రేమ ఉన్నట్లు కనిపించినా, ఆయనకు లోబడనివాళ్లు

11. కీర్తన 92:7 ప్రకారం, చెడ్డ ప్రజలకు ఏమి అవుతుంది?

11 మీరు ఉంటున్న ప్రాంతంలో చాలామంది ఇలాగే ఉన్నారా? ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇలాగే ఉన్నారు. కానీ దేవుడు ఈ విషయంలో త్వరలోనే చర్య తీసుకుంటాడు. ఆయన ఇలా మాటిచ్చాడు: “శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోవడానికే [లేదా నాశనం అవ్వడానికే] దుష్టులు కలుపు మొక్కల్లా చిగురిస్తారు, తప్పుచేసే వాళ్లంతా వర్ధిల్లుతారు.”—కీర్తన 92:7.

ఈ చివరి రోజుల్లో మంచివార్త

12, 13. యెహోవా ఈ చివరి రోజుల్లో మనకు ఏమి నేర్పించాడు?

12 ఈ చివరి రోజుల్లో భూమంతా బాధలతో, కష్టాలతో నిండి ఉంటుందని బైబిలు ముందే చెప్పింది. కానీ మంచి పనులు కూడా జరుగుతాయని బైబిలు చెప్తుంది.

“ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది.”—మత్తయి 24:14

13 బైబిలును అర్థం చేసుకోవడం. దానియేలు ప్రవక్త చివరి రోజుల గురించి రాశాడు. ఆయన ఇలా అన్నాడు: “నిజమైన జ్ఞానం ఎక్కువౌతుంది.” (దానియేలు 12:4) బైబిల్ని బాగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని దేవుడు తన ప్రజలకు ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఇస్తున్నాడు. ముఖ్యంగా 1914 నుండి యెహోవా అలా చేస్తున్నాడు. ఉదాహరణకు, తన పేరుకున్న ప్రాముఖ్యత గురించి, భూమి పట్ల తనకున్న ఉద్దేశం గురించి ఆయన నేర్పించాడు. అంతేకాదు విమోచన క్రయధనం గురించిన సత్యాన్ని, మనం చనిపోయాక అసలు ఏమి జరుగుతుందనే సత్యాన్ని, పునరుత్థానం గురించిన సత్యాన్ని నేర్పించాడు. దేవుని రాజ్యం మాత్రమే మన సమస్యలన్నిటినీ తీసేస్తుందని మనం నేర్చుకున్నాం. మనం ఎలా సంతోషంగా ఉండవచ్చో, దేవున్ని సంతోషపెట్టేలా ఎలా జీవించవచ్చో కూడా మనం తెలుసుకున్నాం. మరి దేవుని సేవకులు వాళ్లు తెలుసుకున్న విషయాలతో ఏమి చేస్తారు? మరో ప్రవచనం దానికి జవాబు ఇస్తుంది.—అదనపు సమాచారంలో 21, 25 పాయింట్లు చూడండి.

14. రాజ్యం గురించిన మంచివార్త ఎక్కడ ప్రకటించబడుతుంది? ఆ మంచివార్తను ఎవరు ప్రకటిస్తున్నారు?

14 ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే పని. చివరి రోజుల గురించి మాట్లాడుతూ, యేసు ఇలా అన్నాడు: “ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది.” (మత్తయి 24:3, 14) దేవుని రాజ్యం గురించిన మంచివార్త 230 కన్నా ఎక్కువ దేశాల్లో, 900 కన్నా ఎక్కువ భాషల్లో ప్రకటించబడుతూ ఉంది. అవును, “అన్ని దేశాల నుండి, గోత్రాల నుండి” వచ్చిన యెహోవాసాక్షులు భూమంతటా రాజ్యం అంటే ఏంటో, ఆ రాజ్యం మనుషులందరి కోసం ఏమి చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయం చేస్తున్నారు. (ప్రకటన 7:9) ఈ పనిని వాళ్లు ఏమీ తీసుకోకుండా చేస్తున్నారు. ఎంతోమంది వాళ్లను ద్వేషించినా, హింసించినా యేసు చెప్పినట్లు ప్రకటనా పనిని ఏదీ ఆపలేదు.—లూకా 21:17.

మీరు ఏమి చేస్తారు?

15. (ఎ) మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని మీరు నమ్ముతున్నారా? ఎందుకు నమ్ముతున్నారు? (బి) దేవుని మాట వినేవాళ్లకు, విననివాళ్లకు ఏమి జరుగుతుంది?

15 మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని మీరు నమ్ముతున్నారా? చివరి రోజుల గురించి బైబిలు చెప్తున్న చాలా ప్రవచనాలు నెరవేరుతున్నాయి. త్వరలోనే మంచివార్తను ప్రకటించే పనిని ఆపేయాలని యెహోవా నిర్ణయిస్తాడు, అప్పుడు “అంతం” వస్తుంది. (మత్తయి 24:14) అంతం అంటే ఏంటి? అంతం అంటే అర్మగిద్దోను, ఆ యుద్ధం ద్వారా దేవుడు చెడు అంతటిని తీసేస్తాడు. తనకు, తన కుమారుడికి లోబడని వాళ్లనందరినీ నాశనం చేయడానికి యెహోవా యేసును, ఆయన శక్తిమంతులైన దూతలను ఉపయోగిస్తాడు. (2 థెస్సలొనీకయులు 1:6-9) ఆ తర్వాత సాతాను, అతని చెడ్డ దూతలు ప్రజలను మోసం చేయరు. దేవుని మాట వినాలనుకునే వాళ్లందరూ, ఆ రాజ్యాన్ని నమ్మి దానికి నమ్మకంగా మద్దతు ఇచ్చే వాళ్లందరూ దేవుడు చేసిన ప్రతీ వాగ్దానం నెరవేరడం చూస్తారు.—ప్రకటన 20:1-3; 21:3-5.

16. అంతం చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఏమి చేయాల్సిన అవసరం ఉంది?

16 సాతాను పరిపాలించే ఈ లోకం త్వరలోనే అంతం అవుతుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం ‘నేను ఏమి చేయాల్సిన అవసరం ఉంది?’ అని ప్రశ్నించుకోవడం చాలా ముఖ్యం. మీరు బైబిలు గురించి వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. మీరు మీ బైబిలు స్టడీని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. (యోహాను 17:3) బైబిలును అర్థం చేసుకునేలా ప్రజలకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులకు ప్రతీవారం మీటింగ్స్‌ ఉంటాయి.ఆ మీటింగ్స్‌కు క్రమంగా రావడానికి ప్రయత్నించండి. (హెబ్రీయులు 10:24, 25 చదవండి.) మీరు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటే మార్చుకోవడానికి భయపడకండి. ఆ మార్పులు చేసుకుంటుండగా, యెహోవాతో మీ స్నేహం ఇంకా బలపడుతుంది.—యాకోబు 4:8.

17. అంతం వచ్చినప్పుడు చాలామంది ఎందుకు ఆశ్చర్యపోతారు?

17 చెడ్డ ప్రజల నాశనం, చాలామంది అనుకోని సమయంలో “రాత్రిపూట దొంగ వచ్చినట్టు” వస్తుందని అపొస్తలుడైన పౌలు వివరించాడు. (1 థెస్సలొనీకయులు 5:2) మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామనే రుజువులను పట్టించుకోకూడదని చాలామంది నిర్ణయించుకుంటారని యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “మానవ కుమారుడి ప్రత్యక్షత [లేదా, చివరి రోజులు] నోవహు రోజుల్లాగే ఉంటుంది. జలప్రళయానికి ముందున్న కాలంలో ప్రజలు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు; నోవహు ఓడలోకి వెళ్లే రోజు వరకు వాళ్లు అలాగే చేశారు. జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయే వరకు వాళ్లు ఏమీ పట్టించుకోలేదు. మానవ కుమారుడి ప్రత్యక్షత కూడా అలాగే ఉంటుంది.”—మత్తయి 24:37-39.

18. యేసు మనకు ఏ హెచ్చరిక ఇచ్చాడు?

18 “అతిగా తినడం వల్ల, అతిగా తాగడం వల్ల, జీవిత చింతల వల్ల” మన ధ్యాస పక్కకు మళ్లకూడదని యేసు హెచ్చరించాడు. అంతం అకస్మాత్తుగా, “ఒక ఉచ్చులా” వస్తుందని ఆయన చెప్పాడు. “అది భూమంతటా ఉన్న వాళ్లందరి మీదికి వస్తుంది” అని కూడా ఆయన చెప్పాడు. తర్వాత ఇంకా ఇలా అన్నాడు: “కాబట్టి, జరగాల్సిన వీటన్నిటినీ తప్పించుకొని మానవ కుమారుడి ముందు నిలబడగలిగేలా మీరు ఎప్పుడూ పట్టుదలగా ప్రార్థిస్తూ, మెలకువగా ఉండండి.” (లూకా 21:34-36) యేసు హెచ్చరికను వినడం ఎందుకు చాలా ముఖ్యం? ఎందుకంటే, అతి త్వరలో సాతాను చెడ్డలోకం అంతం అయిపోతుంది. యెహోవా, యేసు ఆమోదించిన వాళ్లు మాత్రమే అంతాన్ని తప్పించుకుని, కొత్త లోకంలో శాశ్వతంగా జీవిస్తారు.—యోహాను 3:16; 2 పేతురు 3:13.

^ పేరా 4 యేసుక్రీస్తుకు ఉన్న ఇంకొక పేరు మిఖాయేలు. ఎక్కువ సమాచారం కోసం, అదనపు సమాచారంలో 23వ పాయింట్‌ చూడండి.