కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10వ అధ్యాయం

దేవదూతల గురించిన సత్యం

దేవదూతల గురించిన సత్యం

1. దేవదూతల గురించి ఎందుకు నేర్చుకోవాలి?

యెహోవా, తన కుటుంబం గురించి మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. దేవదూతలు దేవుని కుటుంబంలో ఒక భాగం. బైబిల్లో వాళ్లను “దేవుని కుమారులు” అని పిలిచారు. (యోబు 38:7) దేవదూతలు ఏమి చేస్తారు? పూర్వకాలంలో వాళ్లు ప్రజలకు ఎలా సహాయం చేశారు? ఇప్పుడు వాళ్లు మనకు సహాయం చేయగలరా?—అదనపు సమాచారంలో 8వ పాయింట్‌ చూడండి.

2. దేవదూతలు ఎలా వచ్చారు? ఎంతమంది దేవదూతలు సృష్టించబడ్డారు?

2 దేవదూతలు ఎలా వచ్చారో మనం తెలుసుకోవాలి. యెహోవా యేసును సృష్టించాక “మిగతా వాటన్నిటినీ, అంటే అటు పరలోకంలో ఇటు భూమ్మీద” ఉన్నవాటన్నిటినీ సృష్టించాడని కొలొస్సయులు 1:16 చెప్తుంది. వాటిలో దేవదూతలు కూడా ఉన్నారు. దేవుడు ఎంతమంది దేవదూతలను సృష్టించాడు? కోటానుకోట్ల దేవదూతలు ఉన్నారని బైబిలు చెప్తుంది.—కీర్తన 103:20; ప్రకటన 5:11.

3. యోబు 38:4-7 దేవదూతల గురించి మనకు ఏమి చెప్తుంది?

3 యెహోవా భూమిని సృష్టించక ముందే దేవదూతలను సృష్టించాడని బైబిలు బోధిస్తుంది. భూమిని చూసినప్పుడు వాళ్లకు ఎలా అనిపించి ఉంటుంది? వాళ్లు సంతోషించారని యోబు పుస్తకం మనకు చెప్తుంది. వాళ్లు అప్పుడు ఒకే ఐక్య కుటుంబంలా కలిసి యెహోవాను సేవిస్తున్నారు.—యోబు 38:4-7.

దేవదూతలు దేవుని ప్రజలకు సహాయం చేస్తారు

4. దేవదూతలకు మనుషుల మీద శ్రద్ధ ఉందని మనకెలా తెలుసు?

4 దేవదూతలు మనుషుల విషయంలో, భూమి-మనుషుల పట్ల యెహోవాకున్న ఉద్దేశం విషయంలో ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. (సామెతలు 8:30, 31; 1 పేతురు 1:11, 12) ఆదాముహవ్వలు తిరుగుబాటు చేసినప్పుడు దేవదూతలు చాలా బాధపడివుంటారు. ఇప్పుడు కూడా ఎంతోమంది ప్రజలు యెహోవాకు ఎదురుతిరగడం చూసి వాళ్లు చాలా బాధపడుతుండవచ్చు. కానీ ఎవరైనా పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు తిరిగి వస్తే దేవదూతలు సంతోషిస్తారు. (లూకా 15:10) దేవదూతలు దేవున్ని ఆరాధించేవాళ్ల పట్ల చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. భూమ్మీద తన సేవకులకు సహాయం చేయడానికి, కాపాడడానికి యెహోవా దేవదూతలను ఉపయోగిస్తాడు. (హెబ్రీయులు 1:7, 14) అలాంటి కొన్ని ఉదాహరణలను ఇప్పుడు చూద్దాం.

నా దేవుడు “తన దూతను పంపించి సింహాల నోళ్లు మూయించాడు.”—దానియేలు 6:22

5. గతంలో దేవదూతలు దేవుని సేవకులకు ఎలా సహాయం చేశారు?

5 సొదొమ, గొమొర్రా పట్టణాలు నాశనం అవుతున్నప్పుడు లోతు, అతని కుటుంబం తప్పించుకునేలా సహాయం చేయడానికి యెహోవా ఇద్దరు దేవదూతలను పంపించాడు. (ఆదికాండం 19:15, 16) దానికి, వందల సంవత్సరాల తర్వాత, దానియేలు ప్రవక్తను సింహాల గుహలో పడేసినప్పుడు ఆయనకు ఏమీ కాలేదు, ఎందుకంటే దేవుడు “తన దూతను పంపించి సింహాల నోళ్లు మూయించాడు.” (దానియేలు 6:22) తర్వాత, అపొస్తలుడైన పేతురు జైల్లో ఉన్నప్పుడు, యెహోవా తన దూతను పంపించి అతన్ని విడిపించాడు. (అపొస్తలుల కార్యాలు 12:6-11) యేసు భూమ్మీద ఉన్నప్పుడు కూడా దూతలు ఆయనకు సహాయం చేశారు. ఉదాహరణకు, ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత “దేవదూతలు ఆయనకు సేవలు చేశారు.” (మార్కు 1:13) ఆయన చంపబడే కాస్త ముందు, ఒక దేవదూత “ఆయన్ని బలపర్చాడు.”—లూకా 22:43.

6. (ఎ) ఈ రోజుల్లో దేవదూతలు దేవుని ప్రజలకు సహాయం చేస్తారని మనకెలా తెలుసు? (బి) మనం ఏ ప్రశ్నలకు జవాబులు పరిశీలిస్తాం?

6 ఈ రోజుల్లో దేవదూతలు మనుషులకు కనిపించరు. కానీ ఇప్పటికీ దేవుడు తన సేవకులకు సహాయం చేయడానికి దేవదూతలను ఉపయోగిస్తున్నాడు. బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవాకు భయపడేవాళ్లందరి చుట్టూ ఆయన దూత కాపలా ఉండి వాళ్లను రక్షిస్తాడు.” (కీర్తన 34:7) మనకు కాపుదల ఎందుకు కావాలి? ఎందుకంటే మనకు శత్రువులు ఉన్నారు, వాళ్లకు ఎంతో శక్తి ఉంది, వాళ్లు మనకు హాని చేయాలని చూస్తున్నారు. ఆ శత్రువులు ఎవరు? వాళ్లు ఎక్కడ నుండి వచ్చారు? వాళ్లు మనకు ఎలా హాని చేయడానికి ప్రయత్నిస్తున్నారు? వాటికి జవాబులు తెలుసుకోవడానికి, ఆదాముహవ్వలు సృష్టించబడిన కొంతకాలానికి ఏమి జరిగిందో చూద్దాం.

కనిపించని మన శత్రువులు

7. సాతాను మోసం వల్ల చాలామంది ప్రజలు ఏమి చేశారు?

7 ఒక దేవదూత దేవునికి తిరుగుబాటు చేసి ఇతరులను పరిపాలించాలని కోరుకున్నాడని మనం 3వ అధ్యాయంలో నేర్చుకున్నాం. బైబిలు అతన్ని అపవాదియైన సాతాను అని పిలుస్తుంది. (ప్రకటన 12:9) మిగతావాళ్లు కూడా దేవునికి ఎదురు తిరగాలని సాతాను కోరుకున్నాడు. సాతాను హవ్వను మోసం చేయగలిగాడు, ఇక అప్పటినుండి అతను చాలామందిని మోసం చేశాడు. కానీ హేబెలు, హనోకు, నోవహు లాంటి కొంతమంది యెహోవాకు నమ్మకంగా ఉన్నారు.—హెబ్రీయులు 11:4, 5, 7.

8. (ఎ) కొంతమంది దేవదూతలు చెడ్డదూతలుగా లేదా దయ్యాలుగా ఎలా అయ్యారు? (బి) పెద్ద వరద నుండి తప్పించుకోవడానికి చెడ్డదూతలు ఏమి చేశారు?

8 నోవహు కాలంలో కొంతమంది దేవదూతలు తిరుగుబాటు చేసి, వాళ్లు ఉంటున్న పరలోకాన్ని విడిచిపెట్టి భూమ్మీదకు మనుషులుగా జీవించడానికి వచ్చారు. ఎందుకు? వాళ్లు భార్యల్ని కోరుకున్నారని బైబిలు చెప్తుంది. (ఆదికాండం 6:2 చదవండి.) కానీ దేవదూతలు అలా చేయడం తప్పు. (యూదా 6) ఆ చెడ్డదూతల్లాగే ఆ కాలంలో చాలామంది మనుషులు చెడిపోయి క్రూరంగా తయారయ్యారు. అందుకే భూమంతా పెద్ద వరదను తీసుకొచ్చి ఆ చెడ్డ మనుషులను నాశనం చేయాలని యెహోవా నిర్ణయించుకున్నాడు. కానీ ఆయన తన నమ్మకమైన సేవకులను కాపాడాడు. (ఆదికాండం 7:17, 23) అప్పుడు చెడ్డదూతలు వాళ్లను వాళ్లు కాపాడుకోవడం కోసం పరలోకానికి తిరిగి వెళ్లారు. ఆ చెడ్డదూతలు లేదా దయ్యాలు సాతాను తిరుగుబాటులో అతని వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు, అపవాది వాళ్లకు నాయకుడు అయ్యాడు.—మత్తయి 9:34.

9. (ఎ) పరలోకానికి తిరిగి వెళ్లాక చెడ్డదూతలకు ఏమి జరిగింది? (బి) మనం తర్వాత దేని గురించి పరిశీలిస్తాం?

9 యెహోవా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి, ఆయన ఆ చెడ్డదూతలను తిరిగి తన కుటుంబంలో చేర్చుకోలేదు. (2 పేతురు 2:4) చెడ్డదూతలు ఇక ఎప్పటికీ మనుషుల రూపంలోకి మారలేరు, కానీ వాళ్లు ఇప్పటికీ ‘లోకమంతటినీ మోసం చేస్తూనే’ ఉన్నారు. (ప్రకటన 12:9; 1 యోహాను 5:19) వాళ్లు చాలామందిని ఎలా మోసం చేస్తున్నారో లేదా తప్పుదారి పట్టిస్తున్నారో తెలుసుకుందాం.—2 కొరింథీయులు 2:11 చదవండి.

చెడ్డదూతలు మనుషులను ఎలా మోసం చేస్తారు?

10. చెడ్డదూతలు ప్రజలను ఎలా మోసం చేస్తారు?

10 చెడ్డదూతలు మనుషులను చాలా రకాలుగా మోసం చేస్తారు. ప్రజలు నేరుగా గానీ, భూతవైద్యుడు లేదా దయ్యం పట్టిన వ్యక్తి ద్వారా గానీ చెడ్డదూతలను సంప్రదిస్తారు. చెడ్డదూతలను సంప్రదించడాన్ని అభిచారం లేదా మంత్రతంత్రాలు అని అంటారు. కానీ బైబిలు చెడ్డదూతలకు సంబంధించిన దేని నుండైనా దూరంగా ఉండమని మనకు ఆజ్ఞ ఇస్తుంది. (గలతీయులు 5:19-21) ఎందుకు? వేటగాడు జంతువులను పట్టుకోవడానికి ఉచ్చులను ఉపయోగించినట్లే చెడ్డదూతలు కూడా ప్రజలను పట్టుకోవడానికి, వాళ్లను తమ అధీనంలోకి తీసుకోవడానికి ఉచ్చులను ఉపయోగిస్తారు.—అదనపు సమాచారంలో 26వ పాయింట్‌ చూడండి.

11. సోదె చెప్పడం అంటే ఏమిటి? మనం దానికి ఎందుకు దూరంగా ఉండాలి?

11 చెడ్డదూతలు ఉపయోగించే ఒక ఉచ్చు సోదె చెప్పడం. సోదె చెప్పడం అంటే మానవాతీత శక్తుల ద్వారా భవిష్యత్తు గురించి లేదా తెలియనివాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం. అలా తెలుసుకోవడానికి కొంతమంది నక్షత్రాలు, శకునాలు చూస్తారు, టారో కార్డులను, క్రిస్టల్‌ బంతులను ఉపయోగిస్తారు, అరచేతిని చూస్తారు. చాలామంది ఇలాంటి అలవాట్ల వల్ల ఏ హానీ ఉండదని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి. ఉదాహరణకు బైబిలు చెడ్డదూతలు, జ్యోతిష్యులు కలిసి పని చేస్తారని చెప్తుంది. అపొస్తలుల కార్యాలు 16:16-18 లో మనం “చెడ్డదూత పట్టిన” ఒక అమ్మాయి గురించి చదువుతాం, ఆ దూత వల్ల ఆమె “భవిష్యత్తు చెప్పేది.” అపొస్తలుడైన పౌలు ఆ చెడ్డదూతను వెళ్లగొట్టినప్పుడు ఆమెకు భవిష్యత్తు గురించి చెప్పే శక్తి పోయింది.

12. (ఎ) చనిపోయినవాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించడం ఎందుకు ప్రమాదకరం? (బి) క్రైస్తవులు ఎందుకు మంత్రతంత్రాలకు సంబంధించిన ఆచారాల్లో అస్సలు పాల్గొనరు?

12 ప్రజల్ని మోసం చేయడానికి చెడ్డదూతలు మరో ఉచ్చును ఉపయోగిస్తారు. చనిపోయినవాళ్లతో మనం మాట్లాడవచ్చని, చనిపోయినవాళ్లు నిజానికి ఎక్కడో జీవిస్తూనే ఉంటారని, వాళ్లు మనతో మాట్లాడగలరని లేదా మనకు హానీ చేయగలరని మనల్ని నమ్మించడానికి చెడ్డదూతలు ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, ఎవరికైనా స్నేహితుడు లేదా బంధువు చనిపోతే, వాళ్లు చనిపోయినవాళ్లతో మాట్లాడతామని చెప్పే మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లవచ్చు. ఆ మంత్రగాళ్లు, చనిపోయిన స్నేహితుడు లేదా బంధువు గురించి ఏదైనా ఆసక్తి కలిగించే విషయం చెప్పవచ్చు, లేదా వాళ్లలా మాట్లాడవచ్చు కూడా. (1 సమూయేలు 28:3-19) అంత్యక్రియల్లో చేసే చాలా ఆచారాలు కూడా చనిపోయినవాళ్లు ఎక్కడో బ్రతికి ఉన్నారనే నమ్మకాన్ని బట్టే వచ్చాయి. వీటిలో అంతిమ సంస్కారాలు, దినాలు, సంవత్సరికాలు, చనిపోయిన వాళ్లకు బలి ఇవ్వడం, వితంతువును చేసే ఆచారాలు, శవజాగారాలు లాంటి ఆచారాలు ఉన్నాయి. క్రైస్తవులు ఈ ఆచారాలు పాటించడానికి ఒప్పుకోకపోతే, వాళ్ల కుటుంబ సభ్యులు లేదా గ్రామ నివాసులు వాళ్లను విమర్శించవచ్చు, అవమానించవచ్చు, లేదా వెలివేయవచ్చు. కానీ చనిపోయినవాళ్లు ఎక్కడా బ్రతికి ఉండరని క్రైస్తవులకు తెలుసు. వాళ్లతో మాట్లాడడం అసాధ్యం, వాళ్లు మనకు ఏ హాని చేయలేరు. (కీర్తన 115:17) ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. చనిపోయినవాళ్లతో గానీ చెడ్డదూతలతో గానీ మాట్లాడడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి, లేదా మంత్రతంత్రాలకు సంబంధించిన ఆచారాల్లో అస్సలు పాల్గొనకండి.—ద్వితీయోపదేశకాండం 18:10, 11 చదవండి; యెషయా 8:19.

13. ఒకప్పుడు దయ్యాల భయంతో జీవించినవాళ్లు ఇప్పుడు ఏమి చేయగలుగుతున్నారు?

13 చెడ్డదూతలు ప్రజలను మోసం చేయడమే కాదు, వాళ్లను భయపెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇప్పుడు సాతానుకు, అతని చెడ్డదూతలకు “కొంచెం సమయమే ఉందని” తెలుసు. తర్వాత దేవుడు వాళ్లను భూమ్మీద నుండి తీసేస్తాడు. కాబట్టి వాళ్లు ఇంకా కోపంగా, క్రూరంగా తయారౌతున్నారు. (ప్రకటన 12:12, 17) అయితే, ఒకప్పుడు చెడ్డదూతల లేదా దయ్యాల భయంతో జీవించిన వేలమంది ఇప్పుడు అస్సలు భయపడడం లేదు. వాళ్లు ఆ భయాన్ని ఎలా పోగొట్టుకున్నారు?

చెడ్డదూతలను ఎదిరించి, వాళ్లను వదిలించుకోండి

14. మొదటి శతాబ్దంలో క్రైస్తవుల్లా మనం చెడ్డదూతల బారి నుండి ఎలా బయట పడవచ్చు?

14 చెడ్డదూతలను ఎలా ఎదిరించాలో, వాళ్లను ఎలా వదిలించుకోవాలో బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, ఎఫెసు పట్టణంలో ఉన్న కొంతమంది సత్యం తెలుసుకోకముందు చెడ్డదూతల్ని సంప్రదించేవాళ్లు. వాళ్లు ఎలా బయట పడ్డారు? బైబిలు ఇలా చెప్తుంది: “ఇంద్రజాలం చేసేవాళ్లలో చాలామంది తమ పుస్తకాల్ని ఒకచోటికి తీసుకొచ్చి అందరిముందు వాటిని కాల్చేశారు.” (అపొస్తలుల కార్యాలు 19:19) వాళ్లు క్రైస్తవులుగా మారాలని అనుకున్నారు కాబట్టి, ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకాలన్నీ కాల్చేశారు. ఇప్పుడు కూడా మనం అలాంటి పనే చేయాలి. యెహోవాను సేవించాలని కోరుకునేవాళ్లందరూ చెడ్డదూతలకు లేదా దయ్యాలకు సంబంధించిన ప్రతీదాన్ని వదిలించుకోవాలి. అంటే దయ్యాలు, మానవాతీత శక్తులు, ఇంద్రజాలం వల్ల ఏ హాని లేదని అనిపించేలా లేదా సరదాగా అనిపించేలా చేసే పుస్తకాలు, పత్రికలు, రాశి ఫలాలు, జ్యోతిష్యం, సినిమాలు, గేమ్‌లు, ఆటలు, పోస్టర్లు లాంటి వాటన్నిటినీ వదిలించుకోవాలి. ఇంకా దుష్టశక్తుల నుండి కాపాడుకోవడానికి ప్రజలు పెట్టుకునేవన్నీ తీసేయాలి.—1 కొరింథీయులు 10:21.

15. సాతానును అతని చెడ్డదూతల్ని ఎదిరించడానికి మనం ఇంకా ఏమి చేయాలి?

15 ఎఫెసు పట్టణంలో ఉన్నవాళ్లు, మ్యాజిక్‌కు లేదా ఇంద్రజాలానికి సంబంధించిన తమ పుస్తకాలను నాశనం చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్లు ఇంకా “చెడ్డదూతల సైన్యంతో” పోరాడుతున్నారని పౌలు రాశాడు. (ఎఫెసీయులు 6:12) అవును, వాళ్లు వాళ్ల పుస్తకాలను ఎప్పుడో కాల్చేసినప్పటికీ, చెడ్డదూతలు ఇంకా వాళ్లకు హాని చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి, వాళ్లు ఇంకా ఏమి చేయాల్సి ఉంది? పౌలు ఇలా చెప్పాడు: “విశ్వాసం అనే పెద్ద డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుడి అగ్ని బాణాలన్నీ ఆర్పేయగలుగుతారు.” (ఎఫెసీయులు 6:16) యుద్ధంలో డాలు ఎలాగైతే సైనికుడిని కాపాడుతుందో అలాగే మన విశ్వాసం మనల్ని కాపాడుతుంది. యెహోవా మనల్ని కాపాడతాడని మనం ఖచ్చితంగా నమ్మితే సాతానును, అతని చెడ్డదూతలను ఎదిరించగలుగుతాం.—మత్తయి 17:20.

16. యెహోవా మీద మన విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

16 యెహోవా మీద మనకున్న విశ్వాసాన్ని ఇంకా ఎలా బలపర్చుకోవచ్చు? మనం ప్రతీ రోజూ బైబిల్ని చదవాలి, మనల్ని కాపాడుకోవడానికి యెహోవా మీద ఆధారపడాలి. మనకు యెహోవా మీద బలమైన నమ్మకం ఉంటే సాతాను, చెడ్డదూతలు మనకు హాని చేయలేరు.—1 యోహాను 5:5.

17. మనల్ని చెడ్డదూతల నుండి ఇంకా ఏది కాపాడుతుంది?

17 ఎఫెసులో ఉన్న క్రైస్తవులు ఇంకా ఏమి చేయాల్సి ఉంది? వాళ్లు మంత్రతంత్రాలతో నిండిపోయిన పట్టణంలో జీవిస్తున్నారు. అందుకే పౌలు ఇలా చెప్పాడు: “ప్రతీ సందర్భంలో . . . ప్రార్థిస్తూ ఉండండి.” (ఎఫెసీయులు 6:18) వాళ్లు ప్రతి సమయంలో కాపాడమని యెహోవాను అడగడం అవసరం. మరి మన విషయం ఏంటి? ఇప్పుడు మనం కూడా మంత్రతంత్రాలతో నిండిపోయిన లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి మనం కూడా కాపాడమని యెహోవాను అడగాలి, మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన పేరు ఉపయోగించాలి. (సామెతలు 18:10 చదవండి.) సాతాను నుండి కాపాడమని మనం యెహోవాను అడుగుతూనే ఉంటే, యెహోవా మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు.—కీర్తన 145:19; మత్తయి 6:13.

18, 19. (ఎ) సాతానుతో, చెడ్డదూతలతో చేసే పోరాటంలో మనం ఎలా గెలవచ్చు? (బి) తర్వాత అధ్యాయంలో మనం ఏ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటాం?

18 మంత్రతంత్రాలకు సంబంధించిన ప్రతీదాన్ని మన జీవితంలో నుండి వదిలించుకొని, కాపుదల కోసం యెహోవా వైపు చూడడం ద్వారా మనం సాతానును, చెడ్డదూతలను ఎదిరించవచ్చు. మనం వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు. (యాకోబు 4:7, 8 చదవండి.) చెడ్డదూతల కన్నా యెహోవా ఎంతో శక్తిమంతుడు. నోవహు కాలంలో యెహోవా వాళ్లను శిక్షించాడు, భవిష్యత్తులో పూర్తిగా నాశనం చేస్తాడు. (యూదా 6) మనం మన పోరాటంలో ఒంటరిగా లేమని గుర్తుంచుకోండి. మనల్ని కాపాడడానికి యెహోవా తన దూతలను ఉపయోగిస్తున్నాడు. (2 రాజులు 6:15-17) యెహోవా సహాయంతో మనం సాతానుకు, చెడ్డదూతలకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో గెలుస్తామనే నమ్మకంతో ఉండవచ్చు.—1 పేతురు 5:6, 7; 2 పేతురు 2:9.

19 కానీ సాతాను, చెడ్డదూతలు ఎన్నో సమస్యలను తీసుకొస్తున్నా దేవుడు వాళ్లను ఇంకా ఎందుకు తీసివేయడం లేదు? ఈ ప్రశ్నకు జవాబు మనం తర్వాత అధ్యాయంలో తెలుసుకుంటాం.