కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

11వ అధ్యాయం

ఎందుకు ఇన్ని బాధలు?

ఎందుకు ఇన్ని బాధలు?

1, 2. చాలామంది ఏమని అడుగుతుంటారు?

సునామి ఒక గ్రామాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఒకతను తుపాకీతో చర్చ్‌లో కాల్పులు జరిపి ఎంతోమందిని గాయపర్చాడు, చంపేశాడు. క్యాన్సర్‌ ఒక తల్లి ప్రాణాన్ని తీసుకుని, ఐదుగురు పిల్లల్ని అనాథలు చేసింది.

2 ఇలాంటి విపత్తులు లేదా విషాద సంఘటనలు జరిగినప్పుడు చాలామంది “ఎందుకు ఇలా జరిగింది?” అని ప్రశ్నిస్తారు. ఈ లోకంలో ఎందుకింత ద్వేషం, బాధలు ఉన్నాయి అని చాలామంది అడుగుతుంటారు. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా?

3, 4. (ఎ) హబక్కూకు ఏ ప్రశ్నలు అడిగాడు? (బి) యెహోవా ఆయనకు ఎలా జవాబు ఇచ్చాడు?

3 బైబిల్లో, దేవుని మీద బలమైన విశ్వాసం ఉన్నవాళ్లు కూడా అలాంటి ప్రశ్నలు అడిగారు. ఉదాహరణకు, ప్రవక్తయైన హబక్కూకు యెహోవాను ఇలా అడిగాడు: “నన్నెందుకు దుష్టత్వాన్ని చూడనిస్తున్నావు? అణచివేతను నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటున్నావు? నాశనం, దౌర్జన్యం ఎందుకు నా కళ్లముందు ఉన్నాయి? గొడవలు, కొట్లాటలు ఎందుకు ఎక్కువౌతున్నాయి?”—హబక్కూకు 1:3.

4 హబక్కూకు 2:2, 3 లో మనం హబక్కూకు ప్రశ్నలకు దేవుడు ఇచ్చిన జవాబును, పరిస్థితిని సరిచేస్తానని ఆయన చేసిన వాగ్దానాన్ని చదువుతాం. యెహోవాకు ప్రజల మీద ఎంతో ప్రేమ ఉంది. “ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది” అని బైబిలు చెప్తుంది. (1 పేతురు 5:7) మనం బాధలు పడడం మనకన్నా ఎక్కువగా దేవునికి అస్సలు ఇష్టం లేదు. (యెషయా 55:8, 9) అయితే మనం ఇప్పుడు ఈ లోకంలో ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయో చూద్దాం.

ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి?

5. బాధల గురించి చాలామంది మత గురువులు ఏమి చెప్తారు? బైబిలు ఏమి నేర్పిస్తుంది?

5 ప్రజలు బాధలు పడడం దేవుని చిత్తం అని పాస్టర్లు, ప్రీస్టులు, మత గురువులు ఎక్కువగా చెప్తుంటారు. మనిషికి జరిగేది ఏదైనా, చివరికి విషాద సంఘటనలైనా ప్రతీది దేవుడు ముందే నిర్ణయించాడని, అది ఎందుకో మనం అర్థం చేసుకోలేమని కొంతమంది చెప్తుంటారు. ఇంకొంతమంది, ఎవరు చనిపోయినా ఆఖరికి చిన్న పిల్లలు చనిపోయినా, వాళ్లు పరలోకంలో దేవునితోపాటు ఉండడానికే చనిపోయారని చెప్తారు. కానీ అది నిజం కాదు. యెహోవా ఎప్పుడూ చెడుకు కారణం కాదు. బైబిలు ఇలా చెప్తుంది: “సత్యదేవుడు చెడుగా ప్రవర్తించడం, సర్వశక్తిమంతుడు తప్పుచేయడం అసాధ్యం!”—యోబు 34:10.

6. లోకంలో ఉన్న బాధలకు చాలామంది దేవున్ని ఎందుకు నిందిస్తారు?

6 చాలామంది లోకంలో ఉన్న బాధలకు దేవున్ని నిందిస్తారు. ఎందుకంటే దేవుడే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడని వాళ్లు అనుకుంటారు. కానీ మనం 3వ అధ్యాయంలో నేర్చుకున్నట్లు, లోకాన్ని నిజంగా పరిపాలిస్తున్నది అపవాదైన సాతాను.

7, 8. లోకంలో ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి?

7 “లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది” అని బైబిలు మనకు చెప్తుంది. (1 యోహాను 5:19) ఈ లోక పరిపాలకుడైన సాతాను దుష్టుడు, క్రూరుడు. అతను “లోకమంతటినీ మోసం చేస్తున్నాడు.” (ప్రకటన 12:9) చాలామంది సాతానునే అనుకరిస్తున్నారు. లోకంలో ఇన్ని అబద్దాలు, ఇంత ద్వేషం, ఇంత క్రూరత్వం ఉండడానికి ఇది కేవలం ఒక కారణం మాత్రమే.

8 లోకంలో ఇన్ని బాధలు ఉండడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఆదాముహవ్వలు దేవునికి తిరుగుబాటు చేశాక వాళ్ల పిల్లలకు పాపాన్ని వారసత్వంగా ఇచ్చారు. పాపం వల్ల మనుషులు ఇతర మనుషుల్ని బాధపెడుతుంటారు. వాళ్లు ఇతరుల కన్నా ముఖ్యమైన వాళ్లుగా ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు. వాళ్లు గొడవలు పడతారు, యుద్ధాలు చేస్తారు, ఇతరుల మీద దౌర్జన్యం చేస్తారు. (ప్రసంగి 4:1; 8:9) కొన్నిసార్లు “అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు” వల్ల కూడా ప్రజలు బాధలు అనుభవిస్తున్నారు. (ప్రసంగి 9:11) అంటే అనుకోకుండా ఏదైన జరిగేటప్పుడు అక్కడ ఉండడం వల్ల యాక్సిడెంట్లు, ఇతర చెడు సంఘటనలు వాళ్లకు జరగవచ్చు.

9. బాధలను ఉండనివ్వడానికి యెహోవాకు సరైన కారణమే ఉందని మనం ఎందుకు నమ్మవచ్చు?

9 యెహోవా ఎప్పుడూ బాధలను తీసుకురాడు. యుద్ధాలకు, నేరాలకు, మనుషులు తోటివాళ్లను బాధపెట్టడానికి దేవుడు కారణం కాదు. భూకంపాలు, తుఫాన్లు, వరదలు వంటి విపత్తులను దేవుడు తీసుకురాడు. కానీ మీరు ఇలా ఆలోచించవచ్చు, ‘యెహోవా ఈ విశ్వమంతటిలో సర్వశక్తిమంతుడై ఉండి కూడా, ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరగకుండా ఎందుకు ఆపట్లేదు?’ దేవునికి మన మీద ఎంతో శ్రద్ధ ఉందని మనకు తెలుసు, కాబట్టి బాధలను ఉండనివ్వడానికి ఆయనకు సరైన కారణమే ఉండి ఉంటుంది.—1 యోహాను 4:8.

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

10. సాతాను యెహోవాను ఎలా సవాలు చేశాడు?

10 అపవాది ఏదెను తోటలో ఆదాముహవ్వలను మోసం చేశాడు. దేవుడు చెడ్డ పరిపాలకుడని సాతాను నిందించాడు. ఆదాముహవ్వలకు దేవుడు ఏదో మంచిని దక్కకుండా చేస్తున్నాడని సాతాను వాదించాడు. తాను యెహోవా కన్నా మంచి పరిపాలకుడినని, ఆదాముహవ్వలకు దేవుడు అవసరం లేదని సాతాను వాళ్లను నమ్మించాలనుకున్నాడు.—ఆదికాండం 3:2-5; అదనపు సమాచారంలో 27వ పాయింట్‌ చూడండి.

11. మనం ఏ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలి?

11 ఆదాముహవ్వలు యెహోవా మాట వినకుండా ఆయనమీద తిరుగుబాటు చేశారు. వాళ్ల మంచి, చెడు నిర్ణయించుకునే హక్కు వాళ్లకే ఉందని ఆదాముహవ్వలు అనుకున్నారు. మరి వాళ్లు చేసింది తప్పని, మనకు ఏది మంచిదో ఆయనకే తెలుసని యెహోవా ఎలా రుజువు చేస్తాడు?

12, 13. (ఎ) తనకు ఎదురుతిరిగిన వాళ్లను యెహోవా వెంటనే ఎందుకు నాశనం చేయలేదు? (బి) సాతాను ఈ లోక పరిపాలకుడిగా ఉండడానికి, మనుషులు తమను తామే పరిపాలించుకోవడానికి యెహోవా ఎందుకు అవకాశాన్ని ఇచ్చాడు?

12 యెహోవా ఆదాముహవ్వలను వెంటనే నాశనం చేయలేదు. వాళ్లకు పిల్లలు పుట్టేలా అనుమతించాడు. తర్వాత ఆదాముహవ్వల పిల్లలు వాళ్ల పరిపాలకునిగా ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించుకునే అవకాశం యెహోవా ఇచ్చాడు. ఈ భూమిని పరిపూర్ణమైన మనుషులతో నింపాలనేదే యెహోవా ఉద్దేశం, దాన్ని ఆపడానికి సాతాను ఎంత ప్రయత్నించినా అది ఖచ్చితంగా జరుగుతుంది.—ఆదికాండం 1:28; యెషయా 55:10, 11.

13 సాతాను లక్షలమంది దేవదూతల ఎదుట యెహోవాను సవాలు చేశాడు. (యోబు 38:7; దానియేలు 7:10) కాబట్టి అతను వేసిన నింద నిజమో కాదో నిరూపించుకోవడానికి యెహోవా సాతానుకు సమయాన్ని ఇచ్చాడు. అంతేకాదు, తన సహాయం లేకుండా మనుషులు సాతాను నిర్దేశం కింద సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని విజయం సాధించగలరో లేదో చూపించడానికి యెహోవా సమయం ఇచ్చాడు.

14. గడిచిన కాలం ఏమి నిరూపించింది?

14 వేల సంవత్సరాలుగా ప్రజలు తమను తాము పరిపాలించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ విజయం సాధించలేకపోయారు. సాతాను అబద్ధికుడని రుజువైంది. మనుషులకు దేవుని సహాయం ఖచ్చితంగా అవసరం. యిర్మీయా ప్రవక్త చెప్పిన ఈ మాటలు ఎంత నిజమో కదా: “యెహోవా, తాను వెళ్లాల్సిన దారిని మనిషి సొంతగా కనుక్కోలేడని నాకు బాగా తెలుసు. తన అడుగును నిర్దేశించుకునే అధికారం కూడా అతనికి లేదు.”—యిర్మీయా 10:23.

యెహోవా ఇంతకాలం ఎందుకు ఆగాడు?

15, 16. (ఎ) యెహోవా బాధలను ఇంతకాలం ఎందుకు ఉండనిచ్చాడు? (బి) సాతాను వల్ల వచ్చిన సమస్యలను యెహోవా ఎందుకు సరిచేయడం లేదు?

15 బాధలను యెహోవా ఎందుకు ఇంతకాలం ఉండనిచ్చాడు? చెడు జరగకుండా ఆయన ఎందుకు ఆపడం లేదు? సాతాను పరిపాలన విఫలం అయ్యిందని నిరూపించడానికి సమయం పట్టింది. మనుషులు అన్ని రకాల ప్రభుత్వాలను ప్రయత్నించారు కానీ విజయం సాధించలేకపోయారు. సైన్స్‌లో, టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి సాధించినా ఇంతకుముందుకన్నా ఎక్కువగా అన్యాయం, పేదరికం, నేరాలు, యుద్ధాలు ఉన్నాయి. దేవుడు లేకుండా మనల్ని మనం సరిగ్గా పరిపాలించుకోలేం.

16 సాతాను వల్ల వచ్చిన సమస్యలను యెహోవా సరిచేయడం లేదు. ఒకవేళ సరిచేస్తే దేవుడు సాతాను పరిపాలనకు మద్దతు ఇస్తున్నట్లు అవుతుంది కాబట్టి ఆయన అలాంటి పని ఎప్పుడూ చేయడు. అంతేకాక మనుషులు కూడా వాళ్లను వాళ్లు ఎంతో బాగా పరిపాలించుకుంటున్నామని అనుకునే అవకాశం ఉంది. కానీ అది అబద్ధం. ఆ అబద్ధానికి యెహోవా మద్దతు ఇవ్వడు. ఆయన ఎప్పుడూ అబద్ధం ఆడడు.—హెబ్రీయులు 6:18.

17, 18. సాతాను వల్ల జరిగిన నష్టమంతటి విషయంలో యెహోవా ఏమి చేస్తాడు?

17 సాతాను, మనుషులు దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల వచ్చిన నష్టాన్నంతటినీ యెహోవా సరిచేయగలడా? ఖచ్చితంగా. దేవునికి అన్నీ సాధ్యమే. సాతాను లేవదీసిన ప్రతీ సవాలు ఎప్పుడు పూర్తిగా పరిష్కారం అవుతుందో యెహోవాకు తెలుసు. అప్పుడు ఆయన భూమిని తను అనుకున్నట్లు పరదైసుగా మారుస్తాడు. “సమాధుల్లో ఉన్న వాళ్లందరూ” తిరిగి బ్రతుకుతారు. (యోహాను 5:28, 29) ప్రజలకు ఇక జబ్బులు రావు లేదా చనిపోరు. “అపవాది పనుల్ని నాశనం” చేయడానికి యెహోవా యేసును ఉపయోగిస్తాడు. సాతాను వల్ల కలిగిన నష్టాన్నంతటినీ యేసు సరిచేస్తాడు. (1 యోహాను 3:8) అప్పటి వరకు యెహోవా మన విషయంలో ఓర్పు చూపిస్తున్నాడు కాబట్టి మనం ఆయన గురించి తెలుసుకోగలుగుతున్నాం, ఆయనను మన పరిపాలకునిగా నిర్ణయించుకోగలుగుతున్నాం. అందుకు మనం ఆయనకు ఎంతో కృతజ్ఞులై ఉన్నాం. (2 పేతురు 3:9, 10 చదవండి.) మనం కష్టాల్లో ఉన్నా, వాటిని తట్టుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు.—యోహాను 4:23; 1 కొరింథీయులు 10:13 చదవండి.

18 యెహోవాను మన పరిపాలకునిగా చేసుకోవాలని ఆయన మనల్ని బలవంతపెట్టడు. ఆయన మనుషులకు నిర్ణయించుకునే స్వేచ్ఛను లేదా స్వేచ్ఛాచిత్తాన్ని ఇచ్చాడు. ఈ అమూల్యమైన బహుమానం వల్ల మనం ఏమి పొందామో కొన్ని విషయాలు పరిశీలిద్దాం.

మీ స్వేచ్ఛను మీరు ఎలా ఉపయోగిస్తారు?

19. మనకు యెహోవా ఏ అద్భుతమైన బహుమానాన్ని ఇచ్చాడు? ఈ బహుమానాన్ని ఇచ్చినందుకు మనమెందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి?

19 యెహోవా ఇచ్చిన స్వేచ్ఛాచిత్తం అనే అద్భుతమైన బహుమానం మనకీ జంతువులకీ ఎంత తేడా ఉందో చూపిస్తుంది. జంతువులు వాటి సహజ గుణాన్ని బట్టే జీవిస్తాయి. కానీ మనం మన జీవితాలను ఎలా జీవించాలో నిర్ణయించుకోవచ్చు, మనం యెహోవాను సంతోషపెట్టాలా వద్దా అని కూడా నిర్ణయించుకోవచ్చు. (సామెతలు 30:24) అంతేకాదు మనం యంత్రాల్లా లేము, అవి ఎలా పనిచేయాలని తయారుచేస్తే అలానే పనిచేస్తాయి. కానీ మనకు మాత్రం, మనం ఎలాంటి వాళ్లుగా అవ్వాలి, ఎవరు మన స్నేహితులుగా ఉండాలి, మన జీవితాన్ని ఎలా ఉపయోగించాలి వంటి విషయాల్లో మనకిష్టమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది. మనం జీవితాన్ని ఆనందించాలని యెహోవా కోరుకుంటున్నాడు.

20, 21. ఇప్పుడు మీరు తీసుకోగలిగే మంచి నిర్ణయం ఏంటి?

20 మనం ఆయనను ప్రేమించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (మత్తయి 22:37, 38) ఏ తండ్రైనా తన కొడుకు ఎవ్వరి బలవంతం లేకుండా, హృదయపూర్వకంగా “ఐ లవ్‌ యూ” అని చెప్తే విని సంతోషిస్తాడు. యెహోవా దేవుడు కూడా ఆ తండ్రి లాంటివాడే. మనం యెహోవాను ఆరాధించాలా వద్దా అని నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆయన మనకు ఇచ్చాడు. సాతాను, ఆదాముహవ్వలు యెహోవాకు ఎదురుతిరగాలని నిర్ణయించుకున్నారు. మీరు మీకున్న స్వేచ్ఛాచిత్తం అనే వరాన్ని ఎలా ఉపయోగిస్తారు?

21 యెహోవాను సేవించడానికి మీ స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించండి. లక్షలమంది దేవున్ని సంతోషపెట్టాలని, సాతానును వద్దని నిర్ణయించుకున్నారు. (సామెతలు 27:11) దేవుడు బాధలన్నిటిని తీసేసిన తర్వాత కొత్త లోకంలో ఉండడానికి ఇప్పుడు మీరు ఏమి చేయవచ్చు? తర్వాత అధ్యాయం ఆ ప్రశ్నకు జవాబు చెప్తుంది.