కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

15వ అధ్యాయం

దేవున్ని ఆరాధించే సరైన పద్ధతి ఏంటి?

దేవున్ని ఆరాధించే సరైన పద్ధతి ఏంటి?

1. దేవున్ని ఆరాధించే సరైన పద్ధతి ఏంటో ఎవరు మనకు చెప్పాలి?

చాలా మతాలు దేవుని గురించిన నిజాలు బోధిస్తున్నాయని అంటున్నాయి. కానీ అది సాధ్యం కాదు, ఎందుకంటే దేవుడు ఎవరు, మనం ఆయనను ఎలా ఆరాధించాలి అనే విషయాల గురించి మతాలు వేర్వేరు విధాలుగా నేర్పిస్తాయి. మరి దేవున్ని ఆరాధించాల్సిన అసలు పద్ధతి ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? మనం ఆయనను ఎలా ఆరాధించాలో యెహోవా మాత్రమే చెప్పగలడు.

2. దేవున్ని ఆరాధించడానికున్న సరైన పద్ధతిని మీరు ఎలా తెలుసుకోవచ్చు?

2 యెహోవాను ఆరాధించడానికున్న సరైన పద్ధతిని తెలుసుకోవడానికి ఆయన మనకు బైబిలును ఇచ్చాడు. అందుకే బైబిల్ని లోతుగా చదవండి. యెహోవాకు మీ మీద ఎంతో శ్రద్ధ ఉంది కాబట్టి ఆయన నేర్పించే విషయాలను మీరు అర్థం చేసుకునేలా, వాటిని పాటించేలా ఆయన మీకు సహాయం చేస్తాడు.—యెషయా 48:17.

3. మనం ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు?

3 దేవుడు అన్ని మతాలను అంగీకరిస్తాడు అని కొంతమంది అంటారు కానీ యేసు అలా చెప్పలేదు. ఆయన ఇలా చెప్పాడు: “‘ప్రభువా, ప్రభువా’ అని నన్ను పిలిచే ప్రతీ ఒక్కరు పరలోక రాజ్యంలోకి వెళ్లరు, కానీ . . . నా తండ్రి కోరేవాటిని చేసేవాళ్లే ప్రవేశిస్తారు.” కాబట్టి మనం దేవుడు ఏమి కోరుతున్నాడో తెలుసుకుని, దాన్ని చేయాలి. ఇది ఎంతో ముఖ్యమైంది, ఎందుకంటే యేసు దేవునికి లోబడనివాళ్లను నేరస్తులతో, “అక్రమంగా నడుచుకునే” వాళ్లతో పోల్చాడు.—మత్తయి 7:21-23.

4. దేవుని ఇష్టం చేయడం గురించి యేసు ఏమి చెప్పాడు?

4 మనం దేవుని ఇష్టం చేయాలని అనుకున్నప్పుడు మనకు సమస్యలు వస్తాయని యేసు మనల్ని హెచ్చరించాడు. ఆయన ఇలా అన్నాడు: “ఇరుకు ద్వారం గుండా వెళ్లండి; ఎందుకంటే నాశనానికి నడిపించే ద్వారం వెడల్పుగా, ఆ దారి విశాలంగా ఉంది; చాలామంది దాని గుండా వెళ్తున్నారు. అయితే జీవానికి నడిపించే ద్వారం ఇరుకుగా, ఆ దారి కష్టంగా ఉంది; కొంతమందే దాన్ని కనుక్కుంటున్నారు.” (మత్తయి 7:13, 14) కష్టంగా ఉన్న దారి లేదా దేవున్ని ఆరాధించే సరైన పద్ధతి శాశ్వత జీవితాన్ని తెస్తుంది. విశాలంగా ఉన్న దారి లేదా దేవున్ని తప్పుగా ఆరాధించే పద్ధతి మరణాన్ని తీసుకొస్తుంది. కానీ యెహోవాకు ఎవరూ చనిపోవడం ఇష్టం లేదు. ఆయన అందరికీ తన గురించి నేర్చుకునే అవకాశం ఇస్తున్నాడు.—2 పేతురు 3:9.

దేవున్ని ఆరాధించే సరైన పద్ధతి

5. దేవున్ని సరైన విధంగా ఆరాధించేవాళ్లను మీరు ఎలా గుర్తుపట్టవచ్చు?

5 దేవున్ని సరైన పద్ధతిలో ఆరాధించేవాళ్లను మనం గుర్తు పట్టవచ్చని యేసు చెప్పాడు. వాళ్లు ఏమి నమ్ముతున్నారు, ఏమి చేస్తున్నారు అనే విషయాల్ని బట్టి మనం గుర్తు పట్టవచ్చు. ఆయన ఇలా అన్నాడు: “వాళ్ల పనుల్ని బట్టి మీరు వాళ్లను గుర్తుపడతారు. . . . ప్రతీ మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది.” (మత్తయి 7:16, 17) అంటే దాని అర్థం దేవున్ని ఆరాధించే వాళ్లలో ఏ తప్పులూ ఉండవని కాదు. కానీ దేవుని సేవకులు ఎప్పుడూ సరైనదే చేయడానికి ప్రయత్నిస్తారు. మనం ఇప్పుడు దేవున్ని సరైన విధంగా ఆరాధించేవాళ్లను గుర్తు పట్టడానికి ఏమి సహాయం చేస్తుందో చూద్దాం.

6, 7. నిజమైన ఆరాధన బైబిలు ప్రకారం ఎందుకు ఉంటుంది? యేసు మాదిరి మనకు ఏమి నేర్పిస్తుంది?

6 మన ఆరాధన బైబిలు ప్రకారం ఉండాలి. బైబిలు ఇలా చెప్తుంది: “లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. దానివల్ల దేవుని సేవకుడు ప్రతీ మంచిపని చేయడానికి పూర్తిగా సమర్థుడు అవ్వగలుగుతాడు, పూర్తిగా సిద్ధంగా ఉండగలుగుతాడు.” (2 తిమోతి 3:16, 17) అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఇలా రాశాడు: “మీరు మా దగ్గర దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దాన్ని మనుషుల వాక్యంలా కాకుండా, దేవుని వాక్యంలా దాన్ని స్వీకరించారు. అది నిజంగా దేవుని వాక్యమే.” (1 థెస్సలొనీకయులు 2:13) నిజమైన ఆరాధన దేవుని వాక్యమైన బైబిలు ఆధారంగా ఉంటుంది. మనుషుల అభిప్రాయాలను బట్టి, ఆచారాలను బట్టి, లేదా వేరేవాటిని బట్టి ఉండదు.

7 యేసు నేర్పించినదంతా దేవుని వాక్యం ఆధారంగానే ఉంది. (యోహాను 17:17 చదవండి.) ఆయన ఎప్పుడూ లేఖనాల్లో నుండి చెప్పాడు. (మత్తయి 4:4, 7, 10) దేవుని నిజమైన సేవకులు యేసు మాదిరిని పాటిస్తూ, ప్రతీదీ బైబిలు ఆధారంగా నేర్పిస్తారు.

8. యెహోవాను ఆరాధించడం గురించి యేసు ఏమి నేర్పించాడు?

8 మనం యెహోవాను మాత్రమే ఆరాధించాలి. కీర్తన 83:18 ఇలా చెప్తుంది: “యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే భూమంతటి పైన మహోన్నతుడివి.” ప్రజలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని యేసు కోరుకున్నాడు, ఆయన ప్రజలకు దేవుని పేరును నేర్పించాడు. (యోహాను 17:6 చదవండి.) యేసు ఇలా అన్నాడు: “నీ దేవుడైన యెహోవానే నువ్వు ఆరాధించాలి, ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి.” (మత్తయి 4:10) కాబట్టి దేవుని సేవకులముగా మనం యేసు చేసింది చేయాలి. మనం యెహోవాను మాత్రమే ఆరాధించాలి, ఆయన పేరును ఉపయోగించాలి, ఇతరులకు ఆయన పేరు గురించి నేర్పించాలి, ఆయన మనకోసం ఏమి చేస్తాడో నేర్పించాలి.

9, 10. మనం ఒకరికొకరం ప్రేమను ఎలా చూపించుకుంటాం?

9 ప్రజల మీద నిజమైన ప్రేమ ఉండాలి. ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉండాలని యేసు తన శిష్యులకు నేర్పించాడు. (యోహాను 13:35 చదవండి.) మనం ఎక్కడివాళ్లం, మన సంస్కృతి ఏంటి, మనం గొప్పవాళ్లమా లేదా పేదవాళ్లమా అనేది ముఖ్యం కాదు. ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమ సహోదరసహోదరీల్లా మనల్ని ఐక్యం చేయాలి. (కొలొస్సయులు 3:14) కాబట్టి మనం యుద్ధాలకు వెళ్లి మనుషుల్ని చంపం. బైబిలు ఇలా చెప్తుంది: “దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో దీన్నిబట్టి స్పష్టమౌతుంది: నీతిగా నడుచుకోని వాళ్లెవ్వరూ, సహోదరుణ్ణి ప్రేమించని వాళ్లెవ్వరూ దేవుని పిల్లలు కారు.” మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. “మనం కయీనులా ఉండకూడదు, అతను దుష్టుడి వైపు ఉండి తన తమ్ముణ్ణి దారుణంగా చంపేశాడు.”—1 యోహాను 3:10-12; 4:20, 21.

10 మనం ఒకరికి ఒకరం సహాయం చేసుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి మన సమయాన్ని, శక్తిని, డబ్బుని, వస్తువుల్ని ఇస్తాం. (హెబ్రీయులు 10:24, 25) మనం అందరికీ మంచి చేస్తాం.—గలతీయులు 6:10.

11. దేవునికి దగ్గర చేసే మార్గంగా మనం యేసును ఎందుకు అంగీకరిస్తాం?

11 మనం యేసుకు లోబడాలి, ఎందుకంటే దేవునికి దగ్గర చేసే మార్గం ఆయనే. బైబిలు ఇలా చెప్తుంది: “ఆయన ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా రక్షణ రాదు. ఎందుకంటే, మనల్ని రక్షించడానికి ప్రజల్లో నుండి దేవుడు ఎంచుకున్న వేరే ఏ పేరూ భూమ్మీద లేదు.” (అపొస్తలుల కార్యాలు 4:12) విధేయులైన మనుషుల కోసం యేసు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇచ్చేలా యెహోవా ఆయన్ని పంపించాడని మనం ఈ పుస్తకం 5వ అధ్యాయంలో నేర్చుకున్నాం. (మత్తయి 20:28) భూమిని పరిపాలించడానికి యెహోవా యేసును రాజుగా చేశాడు. అందుకే మనం శాశ్వతంగా జీవించాలంటే యేసుకు లోబడాలని బైబిలు చెప్తుంది.—యోహాను 3:36 చదవండి.

12. మనం రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకోం?

12 మనం రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు. యేసు రాజకీయాల్లో పాల్గోలేదు, ఆయన మీద విచారణ జరుగుతున్న సమయంలో రోమా పరిపాలకుడైన పిలాతుతో యేసు ఇలా అన్నాడు: “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.” (యోహాను 18:36 చదవండి.) యేసులా మనం దేవుని పరలోక రాజ్యానికి నమ్మకంగా ఉంటాం. అందుకే మనం ఎక్కడ జీవిస్తున్నా రాజకీయాల్లో జోక్యం చేసుకోం. కానీ బైబిలు మనకు “పై అధికారాలకు” అంటే ప్రభుత్వాలకు లోబడి ఉండాలని ఆజ్ఞ ఇస్తుంది. (రోమీయులు 13:1) మనం నివసిస్తున్న దేశంలో ఉన్న నియమాలకు మనం లోబడి ఉంటాం. అయితే ఏదైనా చట్టం దేవుని నియమాలకు వ్యతిరేకంగా ఉంటే మనం అపొస్తలులను అనుకరిస్తాం. వాళ్లు ఇలా అన్నారు: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.”—అపొస్తలుల కార్యాలు 5:29; మార్కు 12:17.

13. మనం దేవుని రాజ్యం గురించి అందరికీ ఏమని చెప్తాం?

13 ప్రపంచ సమస్యలకు ఒకేఒక్క పరిష్కారం దేవుని రాజ్యం అని మనం నమ్ముతాం. “ఈ రాజ్య సువార్త” భూమంతటా ప్రకటించబడుతుందని యేసు చెప్పాడు. (మత్తయి 24:14 చదవండి.) దేవుని రాజ్యం మన కోసం చేసేవాటిని ఏ ప్రభుత్వం చేయలేదు. (కీర్తన 146:3) యేసు “నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి” అని అన్నప్పుడు దేవుని రాజ్యం కోసం ప్రార్థన చేయమని నేర్పించాడు. (మత్తయి 6:10) దేవుని రాజ్యం మనుషుల ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేసి “అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది” అని బైబిలు చెప్తుంది.—దానియేలు 2:44.

14. దేవున్ని సరైన పద్ధతిలో ఆరాధించేది ఎవరని మీరు నమ్ముతున్నారు?

14 ఈ విషయాలు చదివాక మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఎవరి నమ్మకాలు బైబిలు ఆధారంగా ఉన్నాయి? ఎవరు దేవుని పేరు గురించి ఇతరులకు చెప్తున్నారు? ఎవరు ఒకరికి ఒకరు నిజమైన ప్రేమను చూపించుకుంటున్నారు? యేసును దేవుడు పంపించాడని ఎవరు నమ్ముతున్నారు? ఎవరు రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటున్నారు? ఎవరు దేవుని రాజ్యం మాత్రమే మన సమస్యలను పరిష్కరిస్తుందని చెప్తున్నారు?’ యెహోవాసాక్షులు మాత్రమే.—యెషయా 43:10-12.

మీరేమి చేస్తారు?

15. దేవుడు మన ఆరాధనను అంగీకరించాలని మనం కోరుకుంటే మనమేమి చేయాలి?

15 దేవుడు ఉన్నాడు అని నమ్మితే సరిపోదు. చెడ్డదూతలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ వాళ్లు ఆయనకు లోబడరు. (యాకోబు 2:19) దేవుడు మన ఆరాధనను అంగీకరించాలని మనం కోరుకుంటే, మనం ఆయన ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదు, ఆయన చెప్పింది కూడా చేయాలి.

16. మనం అబద్ధ మతానికి ఎందుకు దూరంగా ఉండాలి?

16 దేవుడు మన ఆరాధనను అంగీకరించాలంటే మనం అబద్ధ మతానికి దూరంగా ఉండాలి. యెషయా ప్రవక్త ఇలా రాశాడు: “దాని మధ్య నుండి వెళ్లిపోండి, మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోండి.” (యెషయా 52:11; 2 కొరింథీయులు 6:17) అందుకే మనం అబద్ధ ఆరాధనకు సంబంధించిన ప్రతీదానికి దూరంగా ఉండాలి.

17, 18. “మహాబబులోను” అంటే ఏంటి? మనం దాని నుండి వెంటనే బయటకు వచ్చేయడం ఎందుకు ముఖ్యం?

17 అబద్ధ మతం అంటే ఏంటి? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆరాధించమని చెప్పే ఏ మతమైనా అబద్ధ మతమే. బైబిలు అబద్ధ మతాలన్నిటినీ “మహాబబులోను” అని పిలుస్తుంది. (ప్రకటన 17:5) ఎందుకు? నోవహు జలప్రళయం తర్వాత, ప్రాచీన బబులోను నగరంలో చాలా అబద్ధ మత బోధలు మొదలయ్యాయి. ఆ అబద్ధ బోధలు భూమి అంతటా వ్యాపించాయి. ఉదాహరణకు బబులోనులో నివసించే ప్రజలు ముగ్గురు ముగ్గురు కలిసిన దేవుళ్లను ఆరాధించేవాళ్లు. ఈ రోజుల్లో కూడా చాలా మతాలు దేవుడు త్రిత్వం అని నేర్పిస్తాయి. కానీ బైబిలు స్పష్టంగా, ఒకే ఒక్క నిజమైన దేవుడు ఉన్నాడని, ఆయన యెహోవా అని, యేసు ఆయన కుమారుడని నేర్పిస్తుంది. (యోహాను 17:3) బబులోనులో నివసించే ప్రజలు మనిషి చనిపోయాక, శరీరం చనిపోతుంది కానీ మనిషిలో ఒక భాగం ఇంకా బ్రతికే ఉంటుందని, ఆ భాగమే నరకంలో బాధించబడుతుందని నమ్మేవాళ్లు. అది నిజం కాదు.—అదనపు సమాచారంలో 14, 17, 18 పాయింట్లు చూడండి.

18 త్వరలో అబద్ధ మతాలన్నీ నాశనం అవుతాయని దేవుడు ముందే చెప్పాడు. (ప్రకటన 18:8) కాబట్టి అబద్ధ మతాన్ని వెంటనే విడిచిపెట్టడం ఎందుకు అంత ముఖ్యమో మీకు అర్థం అయిందా? సమయం దాటిపోకముందే మీరు ఆ పని చేయాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు.—ప్రకటన 18:4.

యెహోవా దేవున్ని ఆయన ప్రజలతో సేవించడం ద్వారా మీరు ప్రపంచవ్యాప్త కుటుంబంలో భాగం అవుతారు

19. మీరు యెహోవాను సేవించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా చూసుకుంటాడు?

19 మీరు అబద్ధ మతాన్ని విడిచిపెట్టి యెహోవాను సేవించాలని నిర్ణయించుకున్నప్పుడు మీ స్నేహితులు కొంతమంది లేదా మీ కుటుంబం ఆ నిర్ణయాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. వాళ్లవల్ల మీకు జీవితంలో కష్టాలు రావచ్చు. కానీ యెహోవా మిమ్మల్ని వదిలిపెట్టడు. లక్షలమంది ఉన్న ప్రపంచవ్యాప్త కుటుంబంలో మీరు భాగం అవుతారు. వాళ్లందరూ ఒకరిని ఒకరు నిజంగా ప్రేమించుకుంటారు. దేవుని నూతన లోకంలో శాశ్వతంగా జీవించే అవకాశం మీకు ఉంటుంది. (మార్కు 10:28-30) బహుశా యెహోవాను సేవించాలనే మీ నిర్ణయాన్ని మొదట్లో వ్యతిరేకించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు ముందుముందు బైబిలు గురించి నేర్చుకోవచ్చు.

20. దేవున్ని సరైన విధంగా ఆరాధించడం ఎందుకు ముఖ్యం?

20 అతి త్వరలో, యెహోవా దేవుడు చెడుతనాన్ని అంతం చేస్తాడు, ఆయన రాజ్యం భూమి మీద పరిపాలిస్తుంది. (2 పేతురు 3:9, 13) అది చాలా అద్భుతమైన కాలం. అందరం యెహోవా కోరుకున్న విధంగా ఆయన్ను ఆరాధిస్తాం. కాబట్టి మీరు ఇప్పుడే చర్య తీసుకుని దేవున్ని సరైన విధంగా ఆరాధించడం చాలా ముఖ్యం.