కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

16వ అధ్యాయం

దేవున్ని ఆరాధించాలని నిర్ణయించుకోండి

దేవున్ని ఆరాధించాలని నిర్ణయించుకోండి

1, 2. మిమ్మల్ని మీరు ఏమని ప్రశ్నించుకోవాలి? అలా ప్రశ్నించుకోవడం ఎందుకు ముఖ్యం?

మీరు బైబిలు స్టడీలో, దేవున్ని ఆరాధిస్తున్నామని చెప్పుకునే చాలామంది నిజానికి దేవుడు అసహ్యించుకునే వాటిని నేర్పిస్తున్నారు లేదా చేస్తున్నారు అని తెలుసుకున్నారు. (2 కొరింథీయులు 6:17) అందుకే యెహోవా దేవుడు మనల్ని “మహాబబులోను” నుండి, అంటే అబద్ధ మతం నుండి బయటకు వచ్చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. (ప్రకటన 18:2, 4) మీరేమి చేస్తారు? ప్రతీ ఒక్కరం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి, మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘దేవుడు కోరుకున్న విధంగానే నేను ఆయనను ఆరాధించాలని అనుకుంటున్నానా లేదా నేను ఎప్పుడూ ఆరాధించిన విధంగానే ఆరాధించాలని అనుకుంటున్నానా?’

2 మీరు ఇప్పటికే అబద్ధమతాన్ని వదిలేసి ఉంటే లేదా దానితో తెగతెంపులు చేసుకుని ఉంటే మంచిదే. కానీ మీ లోపల ఎక్కడో అబద్ధ మతానికి సంబంధించిన అలవాట్లు గానీ, ఆచారాలు గానీ ఉండవచ్చు. అలాంటి అలవాట్లు, ఆచారాల గురించి ఇప్పుడు చర్చిద్దాం, వాటిని యెహోవా చూస్తున్న విధంగా చూడడం ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం.

విగ్రహాలను, చనిపోయినవాళ్లను ఆరాధించడం

3. (ఎ) ఆరాధనలో విగ్రహాలను ఉపయోగించడం ఆపేయాలంటే కొంతమందికి ఎందుకు కష్టంగా ఉండవచ్చు? (బి) దేవున్ని ఆరాధించడానికి విగ్రహాలను ఉపయోగించడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

3 కొంతమంది వాళ్ల ఇంట్లోనే విగ్రహాలను లేదా పూజా మందిరాలను ఉపయోగించి చాలా సంవత్సరాలు దేవున్ని ఆరాధించారు. మీరు కూడా అలా చేస్తుంటే అవి లేకుండా దేవున్ని ఆరాధించడం మీకు వింతగా లేదా తప్పుగా కూడా అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, యెహోవాను ఎలా ఆరాధించాలో ఆయనే మనకు నేర్పిస్తాడు. బైబిలు స్పష్టంగా చెప్తుంది, మనం ఆరాధనలో విగ్రహాలను ఉపయోగించకూడదని యెహోవా కోరుకుంటున్నాడు.—నిర్గమకాండం 20:4, 5 చదవండి; కీర్తన 115:4-8; యెషయా 42:8; 1 యోహాను 5:21.

4. (ఎ) చనిపోయిన మన పూర్వికులను ఎందుకు ఆరాధించకూడదు? (బి) చనిపోయినవాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించవద్దని యెహోవా తన ప్రజలకు ఎందుకు చెప్పాడు?

4 కొంతమంది చనిపోయిన పూర్వికులను సంతోషపెట్టడానికి చాలా సమయాన్ని, శక్తిని ఉపయోగిస్తారు. వాళ్లు చనిపోయినవాళ్లను ఆరాధిస్తారు కూడా. కానీ చనిపోయినవాళ్లు మనకు సహాయం చేయలేరు లేదా హాని చేయలేరు అని మనం నేర్చుకున్నాం. వాళ్లు ఎక్కడో జీవించి లేరు. చెప్పాలంటే వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే చనిపోయిన బంధువు నుండి వచ్చినట్లు అనిపించే ఏ సందేశమైనా నిజానికి చెడ్డదూతల నుండి వస్తుంది. అందుకే చనిపోయినవాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించవద్దని లేదా మంత్రతంత్రాలకు సంబంధించిన దేని జోలికీ పోవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు.—ద్వితీయోపదేశకాండం 18:10-12; అదనపు సమాచారంలో 2631 పాయింట్లు చూడండి.

5. విగ్రహాలను, చనిపోయిన పూర్వికులను ఆరాధించడం ఆపేయడానికి మీకు ఏమి సహాయం చేస్తుంది?

5 విగ్రహాలను లేదా చనిపోయిన పూర్వికులను ఆరాధించడం ఆపేయడానికి మీకు ఏమి సహాయం చేస్తుంది? మీరు బైబిల్ని చదివి ఈ విషయాల గురించి యెహోవా అభిప్రాయం ఏంటో జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఆయన వాటిని అసహ్యించుకుంటాడు లేదా హేయంగా చూస్తాడు. (ద్వితీయోపదేశకాండం 27:15) యెహోవా అభిప్రాయాల ప్రకారంగా ఆలోచించడానికి, ఆయన కోరుకున్న విధంగా ఆయన్ని ఆరాధించడానికి, ప్రతీరోజు యెహోవాకు ప్రార్థన చేయండి. (యెషయా 55:9) అబద్ధ ఆరాధనకు సంబంధించిన దేన్నైనా మీ జీవితంలో నుండి తీసేసుకోవడానికి కావాల్సిన శక్తిని యెహోవా మీకు ఇస్తాడనే నమ్మకంతో ఉండండి.

మనం క్రిస్మస్‌ చేసుకోవాలా?

6. డిసెంబరు 25ను యేసు పుట్టిన రోజుగా ఎందుకు నిర్ణయించారు?

6 ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా జరుపుకునే పండుగల్లో క్రిస్మస్‌ ఒకటి. చాలామంది క్రిస్మస్‌ను యేసు పుట్టిన రోజుగా భావిస్తారు. కానీ నిజానికి క్రిస్మస్‌కి అబద్ధ ఆరాధనతో సంబంధం ఉంది. ఒక ఎన్‌సైక్లోపీడియా చెప్తున్నట్లు, డిసెంబరు 25న అన్యులైన రోమన్లు సూర్యుని పుట్టిన రోజును చేసుకునేవాళ్లు. ఎక్కువమంది అన్యులను క్రైస్తవులుగా చేయాలని చర్చి నాయకులు అనుకున్నారు. అందుకే యేసు డిసెంబరు 25న పుట్టకపోయినా, ఆ రోజును యేసు పుట్టిన రోజుగా జరపాలని నిర్ణయించారు. (లూకా 2:8-12) యేసు శిష్యులు క్రిస్మస్‌ చేయలేదు. యేసు పుట్టిన 200 సంవత్సరాల తర్వాత కూడా “ఆయన ఖచ్చితంగా ఎప్పుడు పుట్టాడనే విషయం ఎవ్వరికీ తెలీదు, అయినా చాలా తక్కువమంది దాని గురించి పట్టించుకున్నారు” అని ఒక రెఫరెన్సు పుస్తకం చెప్తుంది. (సేక్రెడ్‌ ఆరిజిన్స్‌ ఆఫ్‌ ప్రొఫౌండ్‌ థింగ్స్‌) యేసు భూమి మీద జీవించిన వందల సంవత్సరాల తర్వాత క్రిస్మస్‌ పండుగ ఆచారాలు మొదలయ్యాయి.

7. నిజక్రైస్తవులు క్రిస్మస్‌ ఎందుకు చేసుకోరు?

7 క్రిస్మస్‌, క్రిస్మస్‌ ఆచారాలైన పార్టీలు, గిఫ్టులు ఇవ్వడం లాంటివన్నీ వేరే మతాల నుండి వచ్చాయని చాలామందికి తెలుసు. ఉదాహరణకు, అన్యమత మూలాల నుండి వచ్చిన కారణంగా క్రిస్మస్‌ పండుగను చేసుకోకూడదని ఇంగ్లండ్‌లో, అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో కొంతకాలం నిషేధించారు. ఎవరైనా క్రిస్మస్‌ని జరుపుకుంటే వాళ్లను శిక్షించే వాళ్లు. కానీ మళ్లీ కొంతకాలానికి ప్రజలు క్రిస్మస్‌ని జరుపుకోవడం మొదలుపెట్టారు. నిజక్రైస్తవులు క్రిస్మస్‌ ఎందుకు చేసుకోరు? ఎందుకంటే వాళ్లు చేసే ప్రతిదానిలో దేవున్ని సంతోషపెట్టాలని కోరుకుంటారు.

మనం పుట్టిన రోజులు చేసుకోవాలా?

8, 9. తొలి క్రైస్తవులు ఎందుకు పుట్టినరోజులు చేసుకోలేదు?

8 చాలామంది వాళ్ల పుట్టిన రోజును పండుగలా చేసుకుంటారు. క్రైస్తవులు పుట్టినరోజులు చేసుకోవాలా? బైబిల్లో ఉన్న పుట్టినరోజు వేడుకలు యెహోవాను ఆరాధించని వాళ్లు మాత్రమే చేసుకున్నారు. (ఆదికాండం 40:20; మార్కు 6:21) పుట్టినరోజు పండుగలు అబద్ధ దేవుళ్ల గౌరవంగా చేసేవాళ్లు. అందుకే తొలి క్రైస్తవులు “ఎవరి పుట్టిన రోజునైనా చేసుకోవడం అన్యమత ఆచారంగా భావించేవాళ్లు.”—ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా.

9 ప్రతి ఒక్కరు పుట్టేటప్పుడు ఒక ఆత్మ అక్కడ ఉంటుందని, ఆ ఆత్మ జీవితాంతం ఆ వ్యక్తిని కాపాడుతుందని ప్రాచీన రోమన్లు, గ్రీకులు నమ్మేవాళ్లు. “ఒక వ్యక్తి ఏ దేవత జన్మదినాన పుడతాడో ఆ దేవతతో ఈ ఆత్మకు నిగూఢ సంబంధం ఉంటుంది” అని ద లోర్‌ ఆఫ్‌ బర్త్‌డేస్‌ అనే పుస్తకం వివరిస్తుంది.

10. క్రైస్తవులు పుట్టినరోజులు ఎందుకు చేసుకోకూడదు?

10 అబద్ధ మతాలకు సంబంధించిన పండుగలను యెహోవా ఒప్పుకుంటాడని మీకు అనిపిస్తుందా? (యెషయా 65:11, 12) లేదు, ఆయన ఒప్పుకోడు. అందుకే మనం పుట్టిన రోజునుగానీ అబద్ధ మతంతో సంబంధమున్న ఏ పండుగనిగానీ చేసుకోం.

అది అంత ముఖ్యమా?

11. కొంతమంది పండుగలు ఎందుకు చేసుకుంటారు? మీకు ఏది అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాలి?

11 కొంతమందికి క్రిస్మస్‌, మిగతా పండుగలు వేరే మతాల నుండి వచ్చాయని తెలుసు, అయినా వాళ్లు వాటిని చేసుకుంటూనే ఉంటారు. పండుగలు కుటుంబంగా సంతోషంగా గడపడానికి వచ్చే మంచి అవకాశాలని వాళ్లు అనుకుంటారు. మీకు అలానే అనిపిస్తుందా? మీ కుటుంబంతో సమయం గడపాలనుకోవడం తప్పు కాదు. కుటుంబాన్ని ఏర్పాటు చేసింది యెహోవాయే, అందుకే మీకు కుటుంబంతో మంచి సంబంధాలు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (ఎఫెసీయులు 3:14, 15) కానీ, మనం అబద్ధ మత పండుగలు చేసుకోవడం ద్వారా మన బంధువులను సంతోషపెట్టడం కన్నా యెహోవాతో మంచి సంబంధం కలిగి ఉండడం పైనే మనసు పెట్టాలి. అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ప్రభువుకు ఏది ఇష్టమో జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండండి.”—ఎఫెసీయులు 5:10.

12. ఏదైనా పండుగను యెహోవా ఎందుకు ఒప్పుకోడు?

12 ఏదైనా పండుగ ఎలా వచ్చింది అనేది అంత ముఖ్యం కాదని చాలామంది అనుకుంటారు, కానీ యెహోవా అలా అనుకోడు. అబద్ధ ఆరాధన నుండి వచ్చిన పండుగలను లేదా మనుషులకు, జాతీయ చిహ్నాలకు ఘనత తీసుకొచ్చే పండుగలను ఆయన ఒప్పుకోడు. ఉదాహరణకు, ఐగుప్తీయులు వాళ్ల అబద్ధ దేవుళ్లకు ఎన్నో పండుగలు చేసేవాళ్లు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి తప్పించుకున్న తర్వాత ఐగుప్తీయుల పండుగల్లాంటి ఒక పండుగను జరుపుకున్నారు. దాన్ని “యెహోవాకు పండుగ” అని అన్నారు. కానీ అలా చేసినందుకు యెహోవా వాళ్లను శిక్షించాడు. (నిర్గమకాండం 32:2-10) యెషయా ప్రవక్త చెప్పినట్లు, మనం “అపవిత్రమైన దేన్నీ” ముట్టకూడదు.—యెషయా 52:11 చదవండి.

వేరేవాళ్లతో దయగా ఉండండి

13. మీరు పండుగలు చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు మీకు ఎలాంటి ప్రశ్నలు రావచ్చు?

13 మీరు పండుగలు చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు మీకు చాలా ప్రశ్నలు రావచ్చు. ఉదాహరణకు: నేను వాళ్లతో కలిసి క్రిస్మస్‌ ఎందుకు చేసుకోవడం లేదని, నాతో పనిచేసేవాళ్లు అడిగితే నేనేమి చేయాలి? ఎవరైనా నాకు క్రిస్మస్‌ గిఫ్ట్‌ ఇస్తే నేనేమి చేయాలి? నా భర్త లేదా భార్య నేను పండుగలు చేయాలని ఆశిస్తే ఏమి చేయాలి? పండుగలు లేదా బర్త్‌డేలు చేసుకోనందుకు నా పిల్లలు బాధపడకుండా ఉండాలంటే నేను ఏమి చేయవచ్చు?

14, 15. ఎవరైనా మీకు పండుగ శుభాకాంక్షలు చెప్తే లేదా పండుగ సందర్భంగా ఏదైనా గిఫ్ట్‌ ఇస్తే మీరు ఏమి చేయవచ్చు?

14 అలాంటి పరిస్థితిలో ప్రతీసారి ఏమి చెప్పాలి, ఏమి చేయాలి అని నిర్ణయించుకునే ముందు తెలివిని ఉపయోగించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఎవరైనా మీకు పండుగ శుభాకాంక్షలు చెబితే మీరు వాళ్లను పట్టించుకోనట్లు ఉండాల్సిన అవసరం లేదు. మీరు మర్యాదగా చిన్న “థాంక్యూ” చెప్పవచ్చు. కానీ కొన్నిసార్లు ఎవరైనా ఈ విషయం గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, వాళ్లకు మీరు ఆ పండుగ ఎందుకు చేసుకోరో వివరించవచ్చు. కానీ ఎప్పుడూ దయగా, తెలివిగా, గౌరవంగా చెప్పాలి. బైబిలు చెప్తున్నట్లు, “మీ మాటలు ఎప్పుడూ దయగా, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. అప్పుడు, ప్రతీ ఒక్కరికి ఎలా జవాబివ్వాలో మీకు తెలుస్తుంది.” (కొలొస్సయులు 4:6) మీకు అందరితో సంతోషంగా సమయం గడపడం, గిఫ్ట్‌లు ఇవ్వడం ఇష్టమే కానీ పండుగ సమయాల్లో మాత్రం అలాంటివి చేయకూడదని అనుకుంటున్నారని మీరు వాళ్లకు వివరంగా చెప్పవచ్చు.

15 ఎవరైనా మీకు గిఫ్ట్‌ ఇస్తే మీరు ఏమి చేయాలి? ఇలాంటి ప్రతి సందర్భంలో మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో బైబిలు చెప్పడం లేదు, కానీ మనం మంచి మనస్సాక్షితో ఉండేలా చూసుకోవాలని మాత్రం చెప్తుంది. (1 తిమోతి 1:18, 19) బహుశా మీకు గిఫ్ట్‌ ఇచ్చేవాళ్లకు మీరు ఆ పండుగ చేసుకోరని తెలియకపోవచ్చు. లేదా వాళ్లు మీతో ఇలా చెప్పవచ్చు: “మీరు ఈ పండుగ చేసుకోరని నాకు తెలుసు, అయినా మీకు ఈ గిఫ్ట్‌ ఇవ్వాలని ఉంది.” ఈ రెండు సందర్భాల్లో గిఫ్ట్‌ తీసుకోవాలో వద్దో మీరు నిర్ణయించుకోవచ్చు. మీ నిర్ణయాన్ని బట్టి మీ మనస్సాక్షికి ఇబ్బంది కలుగకుండా చూసుకోండి. యెహోవాతో మన సంబంధాన్ని పాడుచేసే ఏ పనిని చేయాలని మనం అనుకోం.

మీరు, మీ కుటుంబం

యెహోవాను ఆరాధించేవాళ్లు సంతోషంగా ఉంటారు

16. మీ కుటుంబ సభ్యులు పండుగలు చేసుకోవాలని అనుకుంటే మీరు ఏమి చేయాలి?

16 మీ కుటుంబ సభ్యులు ఏదైనా పండుగ చేసుకోవాలని అనుకుంటే మీరు ఏమి చేయవచ్చు? మీరు వాళ్లతో వాదించాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఇష్టమైనది చేసే హక్కు వాళ్లకు ఉందని గుర్తుపెట్టుకోండి. మీ నిర్ణయాల్ని వాళ్లు గౌరవించాలని మీరు కోరుకున్నట్లే మీరు కూడా దయగా వాళ్ల నిర్ణయాలను గౌరవించండి. (మత్తయి 7:12 చదవండి.) కానీ ఆ పండుగ రోజు మీరు వాళ్లతో సమయం గడపాలని మీ కుటుంబ సభ్యులు కోరుకుంటే మీరు ఏమి చేయాలి? ఏమి చేయాలో నిర్ణయించుకునే ముందు, సరైన నిర్ణయం తీసుకునేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. ఆ పరిస్థితి గురించి ఆలోచించండి, దాని గురించి పరిశోధన చేయండి. మీరు ఎప్పుడూ యెహోవాను సంతోషపెట్టాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

17. వేరేవాళ్లు పండుగలు చేసుకోవడం చూసి మీ పిల్లలు ఏదో పోగొట్టుకుంటున్నట్లు అనుకోకూడదంటే మీరు ఏమి చేయాలి?

17 వేరేవాళ్లు పండుగలు చేసుకోవడం చూస్తున్నప్పుడు మీ పిల్లలు బాధపడకుండా మీరు వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు? ఎప్పటికప్పుడు మీరే వాళ్లకోసం ప్రత్యేకంగా ఏమైనా చేస్తుండాలి. వాళ్లకు ఏమైనా గిఫ్ట్‌లు ఇచ్చి ఆశ్చర్యపర్చవచ్చు. అయినా అన్నిటికన్నా ముఖ్యంగా మీరు వాళ్లకు ఇవ్వాల్సిన అసలు గిఫ్ట్‌ మీ సమయం, మీ ప్రేమ.

సత్యారాధనను ఆచరణలో పెట్టండి

18. మనం మీటింగ్స్‌కి ఎందుకు వెళ్లాలి?

18 యెహోవాను సంతోషపెట్టాలంటే మనం అబద్ధ మతంతో పాటు అందులో ఉన్న ఆచారాలను, పండుగలను విడిచిపెట్టాలి. అంతేగాక మనం సత్యారాధనను ఆచరణలో పెట్టాలి. ఎలా? ఒకటి క్రమంగా మీటింగ్స్‌కి వెళ్లాలి. (హెబ్రీయులు 10:24, 25 చదవండి.) సత్యారాధనలో మీటింగ్స్‌ చాలా ముఖ్యమైన భాగం. (కీర్తన 22:22; 122:1) మనం అందరం కలుసుకున్నప్పుడు ఒకరినొకరం ప్రోత్సహించుకోగలం.—రోమీయులు 1:12.

19. మీరు తెలుసుకున్న బైబిలు విషయాల గురించి వేరేవాళ్లకు చెప్పడం ఎందుకు ముఖ్యం?

19 మనం బైబిల్లో తెలుసుకున్న వాటి గురించి ఇతరులకు చెప్పడం సత్యారాధనలో మరో భాగం. చాలామంది భూమి మీద జరుగుతున్న చెడు విషయాలను చూసి బాధపడుతున్నారు. బహుశా అలా బాధపడుతున్నవాళ్లు మీకు తెలిసి ఉండవచ్చు. భవిష్యత్తులో జరగబోయే అద్భుతమైన విషయాల గురించి వాళ్లకు చెప్పండి. మీరు మీటింగ్స్‌కి వెళ్తూ, ఇతరులకు బైబిలు గురించి చెప్తూ ఉంటే మీకు అబద్ధ మతంలో, వాటి ఆచారాల్లో పాల్గొనాలనే కోరిక ఇక ఉండదు. మీరు సంతోషంగా ఉంటారనే నమ్మకంతో ఉండవచ్చు, అంతేకాదు ఆయన్ని సరైన విధంగా ఆరాధించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను యెహోవా ఎంతో ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—మలాకీ 3:10.