కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

19వ అధ్యాయం

యెహోవాకు దగ్గరగా ఉండండి

యెహోవాకు దగ్గరగా ఉండండి

1, 2. ఈ రోజుల్లో మనకు భద్రత ఎక్కడ దొరుకుతుంది?

ఒక తుఫాను రోజున మీరు బయట నడుస్తున్నారు అనుకోండి. ఆకాశం చీకటిగా అవుతుంది, మెరుపులు వస్తూ ఉరుములు మొదలయ్యాయి. వెంటనే వాన కురవడం మొదలైంది. ఎక్కడైనా ఆగడానికి స్థలం కోసం మీరు వెదుకుతున్నారు. చివరికి మీకు పొడిగా, భద్రంగా ఉన్న చోటు కనిపించగానే ఎంత ఉపశమనంగా ఉంటుందో కదా!

2 మనం ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ప్రపంచ పరిస్థితులు అంతకంతకు చెడుగా మారుతున్నాయి. ‘నేను ఎక్కడ భద్రంగా ఉండగలను’ అని మీరు అనుకోవచ్చు. బైబిల్లో కీర్తన గ్రంథకర్త ఇలా రాశాడు: “‘నువ్వే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు’ అని నేను యెహోవాతో అంటాను.” (కీర్తన 91:2) అవును, ఇప్పుడు మనకున్న సమస్యల నుండి యెహోవా ఉపశమనాన్ని ఇవ్వగలడు, అంతేకాదు భవిష్యత్తు గురించి ఆయన మనకు మంచి నిరీక్షణను కూడా ఇస్తున్నాడు.

3. యెహోవాను మన ఆశ్రయంగా ఎలా చేసుకోగలం?

3 యెహోవా మనల్ని ఎలా కాపాడతాడు? మనకున్న ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి లేదా పరిష్కరించుకోవడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు, మనకు హాని చేయాలనుకునే ఎలాంటి వాళ్లకన్నా ఆయన ఎంతో శక్తిమంతుడు. ఒకవేళ ఇప్పుడు మనకు ఏదైనా నష్టం జరిగినా భవిష్యత్తులో యెహోవా ఆ నష్టాన్ని సరిచేయగలడని నమ్మకంతో ఉండవచ్చు. “దేవుడు ప్రేమించే ప్రజలుగా” ఉండమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (యూదా 21) కష్ట సమయాల్లో యెహోవా సహాయం పొందాలంటే మనం ఆయనకు దగ్గరగా ఉండాలి. కానీ మనం అది ఎలా చేయగలం?

దేవుని ప్రేమకు స్పందించండి

4, 5. యెహోవా మనమీద తనకున్న ప్రేమను ఎలా చూపించాడు?

4 యెహోవాకు దగ్గరగా ఉండాలంటే, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. యెహోవా మనకోసం చేసిన వాటన్నిటి గురించి ఆలోచించండి. ఆయన మనకు అందమైన భూమిని ఇచ్చి అందులో ఆకర్షణీయమైన మొక్కల్ని, జంతువుల్ని పెట్టాడు. అంతేకాదు మనకు తినడానికి రుచికరమైన ఆహారాన్ని, తాగడానికి శుభ్రమైన నీటిని ఇచ్చాడు. బైబిలు ద్వారా యెహోవా మనకు ఆయన పేరును, ఆయన అద్భుతమైన లక్షణాలను నేర్పించాడు. వీటన్నిటికీ మించి, ఆయన తన ప్రియ కుమారుని ప్రాణాన్ని మనకోసం ఇవ్వడానికి ఆయనను భూమ్మీదకు పంపించి మనమీద తనకున్న ప్రేమను చూపించాడు. (యోహాను 3:16) ఆ త్యాగం వల్ల, మనం భవిష్యత్తులో అద్భుతమైన జీవితం కోసం ఎదురుచూస్తున్నాం.

5 యెహోవా మెస్సీయ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, ఆ పరలోక ప్రభుత్వం త్వరలో బాధలన్నిటినీ తీసేస్తుంది. ఆ రాజ్యం భూమిని పరదైసుగా మారుస్తుంది, అక్కడ ప్రజలందరూ శాంతితో, సంతోషంతో శాశ్వతంగా జీవిస్తారు. (కీర్తన 37:29) ఇప్పుడు మనం మంచి జీవితాన్ని ఎలా అనుభవించాలో బోధించడం ద్వారా కూడా యెహోవా మనకు తన ప్రేమను చూపించాడు. ఆయనకు ప్రార్థించమని కూడా ఆయన మనల్ని అడుగుతున్నాడు, మన ప్రార్థనలు వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. యెహోవా మనలో ప్రతి ఒక్కరికీ ఆయన ప్రేమను స్పష్టంగా చూపించాడు.

6. యెహోవా ప్రేమకు మీరు ఎలా స్పందించాలి?

6 యెహోవా ప్రేమకు మీరు ఎలా స్పందించాలి? ఆయన మీ కోసం చేసిన వాటన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞులై ఉన్నారని చూపించండి. విచారకరంగా ఈ రోజుల్లో చాలామందికి కృతజ్ఞత లేదు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు కూడా ప్రజలు అలాగే ఉన్నారు. ఒకసారి యేసు 10 మంది కుష్ఠు రోగులను బాగుచేశాడు, కానీ ఒక్కరు మాత్రమే ఆయనకు కృతజ్ఞత చెప్పారు. (లూకా 17:12-17) మనం యేసుకు కృతజ్ఞత చెప్పిన అతనిలా ఉండాలని అనుకుంటాం. మనం ఎప్పుడూ యెహోవాకు కృతజ్ఞులై ఉండాలని అనుకుంటాం.

7. మనం యెహోవాను ఎంత ఎక్కువగా ప్రేమించాలి?

7 మనం యెహోవా మీద ప్రేమను కూడా చూపించాలి. యెహోవాను నిండు హృదయంతో, నిండు ప్రాణంతో, నిండు మనసుతో ప్రేమించాలని యేసు తన శిష్యులకు చెప్పాడు. (మత్తయి 22:37 చదవండి.) దాని అర్థం ఏంటి?

8, 9. మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఆయనకు ఎలా చూపిస్తాం?

8 మనం యెహోవాను ప్రేమిస్తున్నామని చెప్తే సరిపోతుందా? లేదు. మనం నిండు హృదయంతో, నిండు ప్రాణంతో, నిండు మనసుతో యెహోవాను ప్రేమిస్తే ఆయన మీద మనకున్న ప్రేమను మన పనుల్లో చూపిస్తాం. (మత్తయి 7:16-20) మనం దేవున్ని ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలు పాటిస్తామని బైబిలు స్పష్టంగా చెప్తుంది. అది కష్టమైన పనా? కాదు, ఎందుకంటే యెహోవా “ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహాను 5:3 చదవండి.

9 మనం యెహోవాకు లోబడినప్పుడు మన జీవితం సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. (యెషయా 48:17, 18) అయితే యెహోవాకు దగ్గరగా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? ఇప్పుడు చూద్దాం.

యెహోవాకు ఎప్పుడూ దగ్గరౌతూ ఉండండి

10. యెహోవా గురించి మీరు ఎందుకు నేర్చుకుంటూ ఉండాలి?

10 మీరు యెహోవా స్నేహితులు ఎలా అయ్యారు? మీరు బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా యెహోవా గురించి ఎక్కువ తెలుసుకున్నారు, ఆయనతో స్నేహం పెంచుకున్నారు. ఈ స్నేహం ఒక మంటలాంటిది. అది ఎప్పుడూ మండుతూ ఉండాలి. మంట ఆరిపోకుండా ఉండడానికి ఇంధనం అవసరమైనట్లే, యెహోవాతో మీ స్నేహాన్ని బలంగా ఉంచుకోవడానికి మీరు ఆయన గురించి నేర్చుకుంటూ ఉండాలి.—సామెతలు 2:1-5.

ఒక మంటలా యెహోవా మీద మీకున్న ప్రేమ ఎప్పుడూ మండుతూ ఉండడానికి ఇంధనం అవసరం

11. బైబిలు బోధలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

11 మీరు బైబిల్ని చదువుతూ ఉంటే, మీ హృదయాన్ని నిజంగా కదిలించే విషయాలు మీరు నేర్చుకుంటారు. యేసు బైబిలు ప్రవచనాలను వివరిస్తున్నప్పుడు ఆయన ఇద్దరు శిష్యులకు ఎలా అనిపించిందో గమనించండి. వాళ్లు ఇలా అన్నారు: “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ, లేఖనాల అర్థాన్ని విడమర్చి చెప్తున్నప్పుడు లోలోపల మన హృదయాలు మండుతున్నట్టు మనకు అనిపించలేదా?”—లూకా 24:32.

12, 13. (ఎ) దేవుని మీద మనకున్న ప్రేమకు ఏమి జరిగే అవకాశం ఉంది? (బి) యెహోవా మీద మనకున్న ప్రేమను తగ్గిపోకుండా ఎలా ఉంచుకోవచ్చు?

12 లేఖనాలను అర్థం చేసుకున్నప్పుడు శిష్యుల హృదయాలు కదిలిపోయాయి, అలాగే బైబిల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మీకు కూడా అలాంటి ఉత్సాహమే కలిగి ఉంటుంది. ఇది మీరు యెహోవాను తెలుసుకోవడానికి, ఆయనను ప్రేమించడానికి మీకు సహాయం చేసింది. ఈ ప్రేమ తగ్గిపోవాలని మీరు కోరుకోరు.—మత్తయి 24:12.

13 ఒకసారి మీరు దేవునికి స్నేహితులు అయ్యాక, మీ స్నేహాన్ని బలంగా ఉంచుకోవడానికి మీరు బాగా కష్టపడాలి. మీరు యెహోవా గురించి, యేసు గురించి నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకునే వాటి గురించి, వాటిని మీ జీవితంలో ఎలా పాటించాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. (యోహాను 17:3) మీరు బైబిల్ని చదివినా లేదా అధ్యయనం చేసినా, ఇలా ఆలోచించండి: ‘యెహోవా దేవుని గురించి ఇది నాకు ఏమి నేర్పిస్తుంది? నేను ఆయనను నిండు హృదయంతో, నిండు ప్రాణంతో ఎందుకు ప్రేమించాలి?’—1 తిమోతి 4:15.

14. యెహోవా మీద మనకున్న ప్రేమను బలంగా ఉంచుకోవడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

14 మీకు మంచి స్నేహితుడు ఉంటే, ఆయనతో మీరు క్రమంగా మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు మీ స్నేహం బలంగా ఉంటుంది. అదే విధంగా, మనం యెహోవాతో ప్రార్థన ద్వారా క్రమంగా మాట్లాడితే, ఆయన మీద మనకున్న ప్రేమ బలంగా ఉంటుంది. (1 థెస్సలొనీకయులు 5:17 చదవండి.) ప్రార్థన మన పరలోక తండ్రి మనకు ఇచ్చిన అద్భుతమైన బహుమానం. మనం ఆయనతో ఎప్పుడూ హృదయపూర్వకంగా మాట్లాడాలి. (కీర్తన 62:8) మన ప్రార్థనలు ఎప్పుడూ అప్పజెప్పినట్లు ఉండకూడదు, మనం చెప్తున్న విషయాలు నిజంగా మన మనసులో నుండి రావాలి. అవును, మనం బైబిల్ని లోతుగా చదువుతూ ఉంటే, హృదయపూర్వకంగా ప్రార్థిస్తే యెహోవా మీద మనకున్న ప్రేమను బలంగా ఉంచుకుంటాం.

యెహోవా గురించి ఇతరులతో మాట్లాడండి

15, 16. పరిచర్యను మీరు ఎలా చూస్తారు?

15 మనం యెహోవాకు దగ్గరగా ఉండాలని కోరుకుంటే, మన విశ్వాసం గురించి ఇతరులతో మాట్లాడాలి. యెహోవా గురించి ఇతరులకు చెప్పే అవకాశం నిజంగా చాలా గొప్పది. (లూకా 1:74) అది నిజ క్రైస్తవులందరికీ యేసు ఇచ్చిన బాధ్యత. మనలో ప్రతి ఒక్కరం దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి. మీరు ఇప్పటికే ఈ పనిని మొదలుపెట్టారా?—మత్తయి 24:14; 28:19, 20.

16 పరిచర్య చాలా విలువైనదని అపొస్తలుడైన పౌలు భావించాడు. ఆయన దాన్ని “సంపద” అని పిలిచాడు. (2 కొరింథీయులు 4:7) యెహోవా గురించి, ఆయన సంకల్పం గురించి ఇతరులకు చెప్పడం మీరు చేయగల పనులన్నిటిలో చాలా ముఖ్యమైనది. యెహోవా సేవ చేయడానికి అది మీకున్న ఒక మార్గం, మీరు ఆయన కోసం చేసేదాన్ని ఆయన విలువైనదిగా చూస్తాడు. (హెబ్రీయులు 6:10) పరిచర్య ద్వారా యెహోవాకు దగ్గర అవ్వడానికి, శాశ్వత జీవితాన్ని పొందడానికి మీరు మీకూ, ఇతరులకూ సహాయం చేస్తారు. కాబట్టి పరిచర్య మీకూ, మీరు చెప్పేది వినేవాళ్లకూ ప్రయోజనాలను తెస్తుంది. (1 కొరింథీయులు 15:58 చదవండి.) మీకు అంత సంతృప్తిని ఇవ్వగలిగే పని వేరేది ఏమైనా ఉందా?

17. పరిచర్యను ఎందుకు అత్యవసరంగా చేయాలి?

17 పరిచర్య చాలా అత్యవసరంగా చేయాల్సిన పని. మనం “వాక్యాన్ని” ప్రకటించాలి, అత్యవసర భావంతో ఆ పని చేయాలి. (2 తిమోతి 4:2) దేవుని రాజ్యం గురించి ప్రజలు వినాల్సిన అవసరం ఉంది. బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా మహారోజు దగ్గరపడింది! అది సమీపంగా ఉంది, చాలా వేగంగా దూసుకొస్తోంది!” అంతం “ఆలస్యం అవ్వదు!” (జెఫన్యా 1:14; హబక్కూకు 2:3) అవును యెహోవా చాలా త్వరలో సాతాను దుష్టలోకాన్ని నాశనం చేస్తాడు. అది జరిగేముందు ప్రజలను హెచ్చరించాలి, అప్పుడు వాళ్లు యెహోవాను సేవించాలని నిర్ణయించుకోగలుగుతారు.

18. నిజ క్రైస్తవులతో పాటు మనం యెహోవాను ఎందుకు ఆరాధించాలి?

18 నిజ క్రైస్తవులతో కలిసి మనం ఆయన్ను ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు. బైబిలు ఇలా చెప్తుంది: “ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా పురికొల్పుకోవడానికి మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం. కూటాలు మానేయడం కొందరికి అలవాటు, కానీ మనం అలా మానేయకుండా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉందాం, ఆ రోజు దగ్గరపడే కొద్దీ ఇంకా ఎక్కువగా ఇవన్నీ చేద్దాం.” (హెబ్రీయులు 10:24, 25) ప్రతి మీటింగ్‌కి వెళ్లడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. మీటింగ్స్‌ ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, బలపర్చుకోవడానికి అవకాశాన్ని ఇస్తాయి.

19. మన క్రైస్తవ సహోదరసహోదరీలను ప్రేమించడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

19 మీరు మీటింగ్స్‌కు వెళ్లినప్పుడు యెహోవాను ఆరాధించడానికి సహాయం చేసే మంచి స్నేహితులు మీకు దొరుకుతారు. మీలాగే యెహోవాను ఆరాధించడానికి శాయశక్తులా కృషిచేసే వేర్వేరు సహోదరసహోదరీలను మీరు కలుస్తారు. మీలాగే వాళ్లు కూడా అపరిపూర్ణులే, వాళ్లూ పొరపాట్లు చేస్తారు. వాళ్లు అలా చేసినప్పుడు వాళ్లను క్షమించడానికి సిద్ధంగా ఉండండి. (కొలొస్సయులు 3:13 చదవండి.) ఎప్పుడూ మీ క్రైస్తవ సహోదరసహోదరీల మంచి లక్షణాల మీదే మనసు పెట్టండి, అది మీరు వాళ్లను ప్రేమించడానికి, యెహోవాకు మరింత దగ్గర అవ్వడానికి సహాయం చేస్తుంది.

వాస్తవమైన జీవితం

20, 21. “వాస్తవమైన జీవితం” అంటే ఏంటి?

20 యెహోవా స్నేహితులందరూ శ్రేష్ఠమైన జీవితాన్ని పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. భవిష్యత్తులో మన జీవితం ఇప్పటి జీవితానికి పూర్తి వేరుగా ఉంటుందని బైబిలు నేర్పిస్తుంది.

మీరు “వాస్తవమైన జీవితం” ఆనందించాలనేది యెహోవా కోరిక. మీ కోరిక కూడా అదేనా?

21 భవిష్యత్తులో మనం శాశ్వతంగా జీవిస్తాం, ఇప్పటిలా కేవలం 70 లేదా 80 సంవత్సరాలు కాదు. మనం అందమైన పరదైసులో సంపూర్ణ ఆరోగ్యంతో, శాంతితో, సంతోషంతో ‘శాశ్వత జీవితాన్ని’ ఆనందిస్తాం. ఆ జీవితాన్ని బైబిలు “వాస్తవమైన జీవితం” అని పిలుస్తుంది. యెహోవా మనకు ఈ వాస్తవమైన జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కానీ దాని మీద “గట్టి పట్టు” సాధించడానికి మనం చేయగలిగినదంతా చేయాలి.—1 తిమోతి 6:12, 19.

22. (ఎ) మనం “వాస్తవమైన జీవితం మీద గట్టి పట్టు” ఎలా సాధించగలుగుతాం? (బి) మనం సొంతగా ఎందుకు శాశ్వత జీవితాన్ని సంపాదించుకోలేం?

22 మనం “వాస్తవమైన జీవితం మీద గట్టి పట్టు” ఎలా సాధించగలుగుతాం? మనం “మేలు చేస్తూ మంచిపనుల విషయంలో ధనవంతులుగా” ఉండాలి. (1 తిమోతి 6:18) అంటే బైబిలు నుండి నేర్చుకున్న విషయాలను మనం పాటించాలి. అయితే, వాస్తవమైన జీవితం మన సొంత ప్రయత్నాల మీద ఆధారపడి ఉండదు. మనం సొంతగా ఎప్పటికీ శాశ్వత జీవితాన్ని సంపాదించుకోలేం. అది యెహోవా తన నమ్మకమైన సేవకులకు ఇచ్చే ఉచితమైన బహుమానం, ‘ఆయన అపారదయకు’ నిదర్శనం. (రోమీయులు 5:15) మన పరలోక తండ్రి తన నమ్మకమైన సేవకులకు ఈ బహుమానాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు.

23. మీరు ఇప్పుడు సరైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి?

23 మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘దేవుడు ఆమోదించే విధంగా నేను ఆయనను ఆరాధిస్తున్నానా?’ మీరు ఇంకా మార్పులు చేసుకోవాలని గుర్తిస్తే, వెంటనే ఆ మార్పులు చేసుకోండి. మనం యెహోవా మీద ఆధారపడి, ఆయనకు లోబడడానికి అన్నివిధాలా కృషి చేసినప్పుడు యెహోవా మనకు అండగా ఉంటాడు. సాతాను దుష్టలోకానికి ఉన్న ఈ చివరి రోజుల్లో ఆయన తన నమ్మకమైన ప్రజలను సురక్షితంగా ఉంచుతాడు. తర్వాత, యెహోవా వాగ్దానం చేసిన విధంగా మనం పరదైసులో శాశ్వతంగా జీవించేలా ఆయన చూసుకుంటాడు. అవును, ఇప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే మీరు వాస్తవమైన జీవితాన్ని పొందవచ్చు!