కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8

లైంగిక దాడి గురించి నేనేం తెలుసుకోవాలి?

లైంగిక దాడి గురించి నేనేం తెలుసుకోవాలి?

అది ఎందుకు ప్రాముఖ్యం?

ప్రతీ సంవత్సరం, లక్షలమంది లైంగిక దాడులకు లేదా అత్యాచారాలకు గురౌతున్నారు. ముఖ్యంగా యౌవనులే వాటికి బలౌతున్నారు.

మీరు ఏం చేస్తారు?

ఒకతను ఆనెట్‌మీద అత్యాచారం చేసే ప్రయత్నంలో ఆమెను నేలమీదికి తోసేశాడు. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఇలా చెప్తుంది, “అతని నుండి తప్పించుకోవడానికి నేను అన్నిరకాలుగా ప్రయత్నించాను. గట్టిగా అరిచాను. కానీ ఏం ఉపయోగం లేదు. అతణ్ణి తోసేశాను, నెట్టేశాను, గుద్దాను, గిచ్చాను. అంతలోనే అతను ఒక కత్తి తీసుకుని నా మీద దాడి చేశాడు. దాంతో నేను ఏమీ చేయలేకపోయాను.”

అలాంటి పరిస్థితే మీకు ఎదురైతే మీరేం చేస్తారు?

ఒక్కక్షణం ఆగి, ఆలోచించండి!

మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఘోరాలు జరగవచ్చు. ఉదాహరణకు రాత్రిపూట బయటికెళ్లేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉన్నా ఏదోక చెడు సంఘటన జరగవచ్చు. వేగంగా పరుగెత్తేవాళ్లు ‘పరుగులో గెలవరు; జ్ఞానం గలవారికి అన్నం దొరకదు; ఇవన్నీ అదృష్టవశముచేత [‘అనూహ్యంగా,’ NW] కాలవశము చేత కలుగుతున్నాయి.’—ప్రసంగి 9:11.

ఆనెట్‌లాగే కొంతమంది యౌవనులు, తెలియని వ్యక్తి చేతుల్లో లైంగిక దాడికి గురౌతున్నారు. మరికొంతమంది, తెలిసినవాళ్ల చేతుల్లో, ఆఖరికి కుటుంబ సభ్యుల చేతుల్లో లైంగిక దాడికి గురౌతున్నారు. 10 ఏళ్లున్న నటాలీ మీద, వాళ్ల ఇంటి పక్కన ఉండే ఒక టీనేజీ అబ్బాయి అత్యాచారం చేశాడు. “భయంతో, సిగ్గుతో నేను ఆ విషయాన్ని మొదట్లో ఎవ్వరికీ చెప్పలేదు” అని నటాలీ అంటుంది.

అది మీ తప్పు కాదు

జరిగినదాని గురించి ఆలోచిస్తూ ఆనెట్‌ ఇప్పటికీ కుమిలిపోతుంది. ఆమె ఇలా చెప్తుంది, “ఆ రోజు రాత్రి నాకసలు నిద్రే పట్టలేదు, కళ్లు మూసుకుంటే అదే గుర్తొస్తుంది.” ఆమె ఇంకా ఇలా అంటుంది, “నేను అతనినుండి తప్పించుకోవడానికి ఇంకా గట్టిగా ప్రయత్నించాల్సింది. కానీ అతను నన్ను పొడిచిన తర్వాత, భయంతో నేను ఏమీ చేయలేకపోయాను. నేను ఏదోకటి చేసివుండాల్సిందని ఇప్పటికీ అనిపిస్తుంటుంది.”

నటాలీ కూడా అలాంటి బాధతోనే కుమిలిపోతుంది. ఆమె ఇలా చెప్తుంది, “నేను అంత నిర్లక్ష్యంగా ఉండివుండకూడదు. ఆడుకోవడానికి బయటికి వెళ్లినప్పుడు అక్కతోనే కలిసివుండమని మా అమ్మానాన్నలు చెప్పారు. అయినా నేను వినలేదు. అందుకే ఇలా జరిగింది. దానివల్ల మా ఇంట్లోవాళ్లు చాలా బాధపడ్డారు. ఇదంతా నావల్లే అని నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది.”

మీకు కూడా ఆనెట్‌లాగా, నటాలీలాగా అనిపిస్తుంటే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తప్పు, మీరు కావాలని చేసింది కాదు. అబ్బాయిలు అలా ప్రవర్తించడం సహజమనీ, అమ్మాయిలు దాన్ని ఇష్టపడతారనీ, చెప్తూ కొంతమంది ఆ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తారు. నిజానికి, ఏ అమ్మాయీ దాన్ని ఇష్టపడదు. అలాంటి దారుణానికి మీరు బలైతే, ఆ తప్పు మీది కాదు!

“ఆ తప్పు మీది కాదు!” అనే మాటలు వినడానికి బాగుంటాయి, కానీ నమ్మడానికే కొంచెం కష్టంగా ఉంటాయి. కొంతమంది, జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తమలోనే దాచుకుని, లోలోపల కుమిలిపోతుంటారు. కానీ దాన్ని దాచిపెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం? అత్యాచారానికి గురైన వ్యక్తికా? అత్యాచారం చేసిన వ్యక్తికా? కాబట్టి, మీరు అలా దాచిపెట్టకండి.

మీ బాధను మీలోనే దాచుకోకండి

తీవ్రమైన కష్టాలొచ్చినప్పుడు, నీతిమంతుడైన యోబు ఇలా అన్నాడు, “నా ప్రాణం చేదెక్కిపోయింది గనుక నేను మాట్లాడతాను.” (యోబు 10:1, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మీరు కూడా అదే చేయవచ్చు. అసలు ఏం జరిగిందో మీరు ఓ నమ్మదగిన వ్యక్తితో చెప్పుకుంటే, మీ బాధను తట్టుకోవడానికి వాళ్లు సహాయం చేస్తారు.

మీ బాధను మీరొక్కరే మోయలేకపోవచ్చు. అలాంటప్పుడు దాన్ని వేరేవాళ్లతో ఎందుకు పంచుకోకూడదు?

ఆనెట్‌ అదే చేసింది. ఆమె ఇలా చెప్తుంది, “జరిగిన విషయాన్ని నేను నా బెస్ట్‌ ఫ్రెండ్‌కి చెప్పాను. మా సంఘంలో ఉన్న ఇద్దరు పెద్దలతో మాట్లాడమని ఆమె నాకు సలహా ఇచ్చింది. ఆమె చెప్పినట్టే చేశాను. సంఘపెద్దలు నాతో చాలాసార్లు మాట్లాడారు, సరిగ్గా నాకు కావాల్సిన ఓదార్పును ఇచ్చారు. జరిగినదానికి కారణం నేను కాదని, దాంట్లో అసలు నా తప్పే లేదని వాళ్లు నన్ను ఓదార్చారు.”

నటాలీ, తనకు జరిగినదాని గురించి వాళ్ల అమ్మానాన్నలకు చెప్పింది. ఆమె ఇలా అంటుంది, “మా అమ్మానాన్నలు నాకు ఎంతో సహాయం చేశారు. నా మనసులో ఉన్న బాధను చెప్పుకోమని నన్ను ప్రోత్సహించారు. అప్పుడు నా బాధ, కోపం కాస్త తగ్గాయి.”

ప్రార్థన కూడా ఆమెకు సహాయం చేసింది. ఆమె ఇలా చెప్తుంది, “నా బాధను ఎవ్వరికీ చెప్పుకోలేనప్పుడు, దేవునికి ప్రార్థించడం ద్వారా చాలా ఓదార్పు పొందాను. ప్రార్థనలో దేవునికి అన్నీ చెప్పుకునేదాన్ని. దానివల్ల నా మనసు కుదుటపడి ప్రశాంతంగా ఉండేది.”

నటాలీలాగే మీరు కూడా కోలుకోగలరు. (ప్రసంగి 3:3) మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కావాల్సినంత విశ్రాంతి తీసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా, సమస్త ఓదార్పుకు మూలమైన యెహోవాపై ఆధారపడండి.—2 కొరింథీయులు 1:3, 4.

డేటింగ్‌ చేసేంత వయసు మీకుంటే

మీరు ఓ అమ్మాయి అయితే, తప్పుడు పని చేయమని ఎవరైనా మిమ్మల్ని బలవంతపెడితే, “అలా చేయవద్దు!” లేదా “చేయి తీసేయ్‌!” అని ఖచ్చితంగా చెప్పేయండి. అలా చెప్తే ఆ అబ్బాయికి దూరమౌతానేమో అని భయపడకండి. ఒకవేళ ఈ కారణం వల్ల అతను మీతో స్నేహం తెంచేసుకుంటే, అతను మీకు తగినవాడు కాదని అర్థం. ఎందుకంటే, మీకు కావాల్సింది, మీ శరీరాన్ని, మీ విలువల్ని గౌరవించే ఓ మంచి వ్యక్తి.

క్విజ్‌

“స్కూల్లో అబ్బాయిలు నా డ్రస్‌ లాగుతూ, ఒక్కసారి తమతో సెక్స్‌లో పాల్గొనమంటూ నాతో చాలా నీచంగా మాట్లాడేవాళ్లు.”—కారెటా.

ఆ అబ్బాయిలు ఏం చేస్తున్నారని మీకు అనిపిస్తుంది?

  1. ఏడిపిస్తున్నారా?

  2. సరసాలాడుతున్నారా?

  3. లైంగికంగా వేధిస్తున్నారా?

“బస్‌లో వెళ్తున్నప్పుడు, ఒక అబ్బాయి నాతో అసభ్యంగా మాట్లాడుతూ నన్ను దగ్గరికి లాక్కోబోయాడు. నేను వెంటనే అతని చేతిని తీసేసి, దూరంగా జరగమన్నాను. అతను నన్ను ఓ పిచ్చిదానిలా చూశాడు.”—క్యాండిస్‌.

ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడని మీకు అనిపిస్తుంది?

  1. ఏడిపిస్తున్నారా?

  2. సరసాలాడుతున్నారా?

  3. లైంగికంగా వేధిస్తున్నారా?

“పోయిన సంవత్సరం ఒకబ్బాయి, తనకు నేనంటే చాలా ఇష్టమని, నాతో సమయం గడపాలనుకుంటున్నాడని చెప్తూ ఉండేవాడు. నేను వద్దని చెప్తున్నా వినేవాడు కాదు. కొన్నిసార్లు నా చేతిని నిమిరేవాడు. నేను ఆపమని చెప్పినా, ఆపేవాడు కాదు. ఒకరోజు నేను చెప్పులు వేసుకుంటుంటే, అతను వచ్చి నా వెనకాల పట్టుకున్నాడు.”—బెతని.

ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడని మీకు అనిపిస్తుంది?

  1. ఏడిపిస్తున్నారా?

  2. సరసాలాడుతున్నారా?

  3. లైంగికంగా వేధిస్తున్నారా?

ఈ మూడు ప్రశ్నలకు సరైన జవాబు, ఆప్షన్‌ C.

లైంగికంగా వేధించడానికి, ఏడిపించడానికి, సరసాలాడడానికి మధ్య తేడా ఏంటి?

లైంగిక వేధింపులు, ఒక్కళ్లే బలవంతంగా చేసేవి. అవతలి వ్యక్తి వద్దని చెప్పినా, అవి ఆగవు.

లైంగిక వేధింపులు ఎంత ప్రమాదకరమైనవంటే, అవి లైంగిక దాడులకు కూడా దారితీయవచ్చు.