కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 1

దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు

దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు

యెహోవా దేవుడు మన సృష్టికర్త. ఆయన అన్నిటినీ, అంటే మనకు కనిపించే వాటిని కనిపించని వాటిని సృష్టించాడు. మనకు కనిపించే వాటిని చేసే ముందు దేవుడు చాలాచాలా దేవదూతల్ని చేశాడు. దేవదూతలు అంటే ఎవరో మీకు తెలుసా? దేవదూతలు యెహోవా సేవకులు. వాళ్లు ఆయనలానే ఉంటారు. మనం దేవున్ని చూడలేనట్లే వాళ్లనూ చూడలేం. యెహోవా చేసిన మొదటి దేవదూత ఆయనకు సహాయకుడు అయ్యాడు. యెహోవా నక్షత్రాల్ని, గ్రహాల్ని, ఇంకా మిగతా వాటన్నిటిని చేసినప్పుడు ఆ దేవదూత ఆయనకు సహాయం చేశాడు. ఆ గ్రహాలన్నిటిలో ఒక గ్రహం ఈ భూమి, మన అందమైన ఇల్లు.

తర్వాత జంతువులు మనుషులు ఉండడానికి వీలుగా భూమిని యెహోవా రెడీ చేశాడు. ఆయన సూర్యకిరణాలను భూమి మీద పడేలా చేశాడు. కొండల్ని, మహాసముద్రాల్ని, నదుల్ని చేశాడు.

తర్వాత ఏమైంది? యెహోవా ఇలా చెప్పాడు: ‘నేను గడ్డిని, మొక్కల్ని, చెట్లను చేయబోతున్నాను.’ రకరకాల పండ్లు, కూరగాయలు, పూలు పెరగడం మొదలయ్యాయి. తర్వాత యెహోవా ఎగిరే, ఈదే, పాకే, నడిచే జంతువులన్నిటిని చేశాడు. కుందేలు లాంటి చిన్నచిన్న జంతువుల్ని, ఏనుగు లాంటి పెద్దపెద్ద జంతువుల్ని చేశాడు. మీకు ఇష్టమైన జంతువు ఏంటి?

తర్వాత యెహోవా మొదటి దేవదూతతో ‘మనం మనిషిని తయారు చేద్దాం’ అన్నాడు. మనుషుల్ని జంతువుల్లా ఉండేలా చేయలేదు. మనుషులు కొత్తకొత్త వాటిని కనిపెట్టగలరు. వాళ్లు మాట్లాడతారు, నవ్వుతారు, ప్రార్థన చేస్తారు. భూమిని, జంతువుల్ని చూసుకుంటారు. మొట్టమొదటి మనిషి ఎవరో మీకు తెలుసా? చూద్దాం.

“ఆదియందు దేవుడు భూమ్యా కాశములను సృజించెను.” —ఆదికాండము 1:1