కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 2

దేవుడు మొదటి పురుషుడిని, స్త్రీని చేశాడు

దేవుడు మొదటి పురుషుడిని, స్త్రీని చేశాడు

యెహోవా ఏదెను అనే ప్రాంతంలో ఒక తోటను వేశాడు. ఆ తోట నిండా పూలు, చెట్లు, జంతువులు ఉన్నాయి. తర్వాత దేవుడు మొదటి మనిషిని మట్టితో చేసి, అతని ముక్కులోకి ఊదాడు. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ మనిషికి ప్రాణం వచ్చింది! అతనే ఆదాము. యెహోవా ఆదాముకు ఆ తోటను అప్పగించి జంతువులన్నిటికి పేర్లు పెట్టమని చెప్పాడు.

యెహోవా ఆదాముకు ఒక ముఖ్యమైన నియమం పెట్టాడు. ఆదాముతో, ‘నువ్వు ఈ చెట్ల కాయలన్నిటినీ తినవచ్చు. కాని ఒక ప్రత్యేక చెట్టు కాయలు మాత్రం తినకూడదు. ఆ చెట్టు కాయను తింటే నువ్వు చనిపోతావు’ అని చెప్పాడు.

తర్వాత యెహోవా నేను అతనికి ‘సాటియైన సహాయాన్ని’ చేస్తాను అని అన్నాడు. ఆయన ఆదాము గాఢ నిద్ర పోయేలా చేశాడు. తర్వాత ఆదాము ప్రక్కటెముకల్లో ఒక దానితో ఆదాముకు భార్యను చేశాడు. ఆమె పేరు హవ్వ. అప్పుడు ఆదాము, హవ్వ మొదటి కుటుంబం అయ్యారు. ఆదాము కొత్తగా వచ్చిన భార్యను చూసి ఏమనుకున్నాడు? ఆదాము చాలా సంతోషంగా ఇలా అన్నాడు: ‘ఆహా! యెహోవా నా ప్రక్కటెముకతో చేసినది, చివరికి ఈమె నాలాంటిదే!’

ఆదాము, హవ్వలతో పిల్లలను కని భూమిని నింపమని యెహోవా చెప్పాడు. వాళ్లిద్దరూ సంతోషంగా కలిసి పనిచేస్తూ, ఏదెను తోటలా భూమి అంతటిని పరదైసుగా లేదా అందమైన పార్కులా చేయాలని ఆయన కోరుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఎందుకు? ఆ విషయాల గురించి మనం తర్వాత అధ్యాయంలో చూస్తాం.

‘దేవుడు ఆరంభంలో పురుషుణ్ణి, స్త్రీని సృష్టించాడు.’—మత్తయి 19:4