కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 8

అబ్రాహాము, శారా దేవుని మాట విన్నారు

అబ్రాహాము, శారా దేవుని మాట విన్నారు

బాబెలుకు కాస్త దూరంలో ఊరు అనే పట్టణం ఉంది. అక్కడి ప్రజలు యెహోవాను కాకుండా చాలామంది దేవుళ్లను ఆరాధించేవాళ్లు. కానీ ఆ పట్టణంలో ఒకతను యెహోవాను మాత్రమే ఆరాధించేవాడు. అతని పేరు అబ్రాహాము.

యెహోవా అబ్రాహాముతో ఇలా అన్నాడు: ‘నీ ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టి, నేను నీకు చూపించే దేశానికి వెళ్లు.’ అప్పుడు దేవుడు ఇలా ఆశీర్వదించాడు: ‘నిన్ను పెద్ద దేశంగా చేస్తాను. నీ ద్వారా భూమి మీదున్న మనుషులందరికీ మంచి చేస్తాను.’

యెహోవా ఎక్కడికి పంపిస్తున్నాడో అబ్రాహాముకు తెలియదు అయినా ఆయన యెహోవా మీద నమ్మకం ఉంచాడు. అప్పుడు అబ్రాహాము, అతని భార్య శారా, నాన్న తెరహు, అన్న కొడుకు లోతు వాళ్లవాళ్ల వస్తువుల్ని సర్దుకుని దేవుడు చెప్పినట్లు ఆ దూర ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

యెహోవా చూపించాలనుకున్న చోటుకు అబ్రాహాము అతని కుటుంబం చేరుకునే సరికి అబ్రాహాముకు 75 సంవత్సరాలు. ఆ ప్రాంతాన్ని కనాను దేశం అని పిలిచేవాళ్లు. అక్కడ దేవుడు అబ్రాహాముతో ఒక వాగ్దానం చేశాడు: ‘నీ ఎదురుగా ఉన్న ఈ దేశమంతటినీ నీ పిల్లలకు ఇస్తాను.’ కానీ అబ్రాహాము, శారా చాలా ముసలివాళ్లు. వాళ్లకు ఇంకా పిల్లలు లేరు. మరి యెహోవా ఈ వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తాడు?

“విశ్వాసం వల్ల అబ్రాహాము . . . తాను స్వాస్థ్యంగా పొందబోయే చోటికి బయల్దేరడం ద్వారా విధేయత చూపించాడు; ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియకపోయినా బయల్దేరాడు.”—హెబ్రీయులు 11:8