కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 9

చివరికి ఒక కొడుకు పుట్టాడు!

చివరికి ఒక కొడుకు పుట్టాడు!

అబ్రాహాము, శారాకు పెళ్లై చాలా సంవత్సరాలు అయ్యింది. ఊరు పట్టణంలో వాళ్లకున్న పెద్ద ఇంటిని వదిలేసి ఇప్పుడు డేరాల్లో ఉంటున్నారు. కానీ శారా ఇబ్బంది పడినట్లు ఎప్పుడూ చెప్పలేదు, ఎందుకంటే ఆమె యెహోవాను నమ్మింది.

శారా పిల్లలు కావాలని చాలా కోరుకుంది, అందుకే అబ్రాహాముతో ఇలా అంది: ‘నాకు దాసిగా పని చేస్తున్న హాగరుకు పిల్లలు పుడితే నా పిల్లల్లా పెంచుకోవచ్చు.’ కొంతకాలానికి హాగరుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఇష్మాయేలు.

చాలా సంవత్సరాలు గడిచాయి. అబ్రాహాముకు 99 సంవత్సరాలు, శారాకు 89 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు వాళ్ల దగ్గరకు ఓ ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు ఎవరో మీకు తెలుసా? వాళ్లు దేవదూతలు! అబ్రాహాము వాళ్లను చెట్టు కింద కూర్చోపెట్టి భోజనం చేయమని అడిగాడు. వాళ్లు అబ్రాహాముతో, ‘వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు నీ భార్యకు ఒక కొడుకు పుడతాడు’ అని చెప్పారు. శారా డేరా లోపల ఉండి వింటూ, ‘నేను ఇంత ముసలిదానిని, నాకు నిజంగా పిల్లలు పుడతారా?’ అని నవ్వుకుంది.

ఆ తర్వాత సంవత్సరం యెహోవా దూత చెప్పినట్లే శారాకు ఒక కొడుకు పుట్టాడు. అబ్రాహాము అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. అంటే “నవ్వడం” అని అర్థం.

ఇస్సాకుకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇష్మాయేలు అతన్ని ఏడ్పించడం శారా చూసింది. ఆమె తన కొడుకును కాపాడాలని అనుకుంది. అందుకే అబ్రాహాము దగ్గరకు వెళ్లి హాగరును ఆమె కొడుకును పంపించేయమని అడిగింది. ముందు అబ్రాహాముకు పంపించాలని అనిపించలేదు. అప్పుడు యెహోవా అబ్రాహాముతో ‘శారా చెప్పిన మాట విను. ఇష్మాయేలును నేను చూసుకుంటాను. అయితే ఇస్సాకు ద్వారానే నేను నీకు ఇచ్చిన మాటలన్నీ నిజం అవుతాయి’ అని అన్నాడు.

“విశ్వాసం వల్ల శారా, . . . గర్భవతి అవ్వడానికి కావాల్సిన శక్తి పొందింది. ఎందుకంటే వాగ్దానం చేసిన వ్యక్తి నమ్మదగినవాడని ఆమె విశ్వసించింది.”—హెబ్రీయులు 11:11