కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 10

లోతు భార్యను గుర్తుపెట్టుకోండి

లోతు భార్యను గుర్తుపెట్టుకోండి

లోతు తన బాబాయి అబ్రాహాముతో కలిసి కనాను దేశంలో నివసిస్తున్నాడు. కొంతకాలానికి అబ్రాహాముకు, లోతుకు జంతువులు బాగా పెరిగిపోయాయి కాబట్టి వాళ్లందరికీ సరిపడే చోటు అక్కడ లేదు. అబ్రాహాము లోతుతో ప్రేమగా ఇలా చెప్పాడు: ‘మనిద్దరం ఒకే చోట కలిసి ఉండలేము. నువ్వు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటావో ఒక చోటు చూసుకో, నేను వేరే వైపు వెళ్తాను.’ అబ్రాహాము ఎంత స్వార్థం లేకుండా ఉన్నాడో కదా?

లోతు సొదొమ అనే పట్టణం దగ్గర ఒక అందమైన చోటును చూసుకున్నాడు. అక్కడ చాలా నీళ్లు, పచ్చని గడ్డి ఉన్నాయి. కాబట్టి ఆయన అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకుని అతని కుటుంబంతో అక్కడికి వెళ్లిపోతాడు.

సొదొమలో ఉండేవాళ్లు, దానికి దగ్గర్లో ఉన్న గొమొర్రా పట్టణంలో ఉండేవాళ్లు చాలా చెడ్డ వాళ్లు. ఎంత చెడ్డవాళ్లంటే యెహోవా ఆ పట్టణాలను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ లోతును అతని కుటుంబాన్ని కాపాడాలని అనుకున్నాడు. అందుకే ఇద్దరు దేవదూతల్ని పంపించాడు. వాళ్లు లోతుతో ‘త్వరగా లే, ఈ పట్టణం నుండి బయటకు వెళ్లిపో! యెహోవా దీనిని నాశనం చేస్తున్నాడు’ అని చెప్పారు.

లోతు వెంటనే బయలుదేరలేదు. అతను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దూతలు లోతుని, అతని భార్యని, ఇద్దరు కూతుర్లని చేయి పట్టుకుని పట్టణంలో నుండి బయటకు తెచ్చేసి ఇలా చెప్పారు: ‘పరిగెత్తండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, వెనక్కి తిరిగి చూడకండి. వెనక్కి తిరిగి చూస్తే చచ్చిపోతారు!’

వాళ్లు సోయరు పట్టణం దగ్గరికి రాగానే యెహోవా సొదొమ, గొమొర్రా మీద అగ్నిగంధకాలను కురిపించాడు. ఆ రెండు పట్టణాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. కానీ లోతు భార్య దేవుని మాట వినలేదు. ఆమె వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ లోతు అతని కూతుర్లు యెహోవా మాట విన్నందుకు బ్రతికారు. లోతు భార్య దేవుని మాట వినకుండా ఉన్నందుకు వాళ్లు చాలా బాధపడి ఉంటారు. కాబట్టి యెహోవా చెప్పినట్లు చేయడం ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవచ్చు.

“లోతు భార్యను గుర్తుచేసుకోండి.” —లూకా 17:32