కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 12

స్వాస్థ్యం యాకోబుకు వచ్చింది

స్వాస్థ్యం యాకోబుకు వచ్చింది

ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు 40 సంవత్సరాలు. అతను ఆమెను చాలా ప్రేమించాడు. కొంతకాలానికి వాళ్లకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్లు కవలలు.

పెద్ద కొడుకు ఏశావు, చిన్న కొడుకు యాకోబు. ఏశావుకు బయట ఉండడం ఇష్టం, జంతువులను వేటాడడం బాగా వచ్చు. కానీ యాకోబుకు ఇంటి దగ్గర ఉండడం ఇష్టం.

ఆ రోజుల్లో తండ్రి చనిపోయాక పెద్ద కొడుకుకు ఎక్కువ స్థలాన్ని డబ్బుల్ని ఇచ్చేవాళ్లు. దానిని స్వాస్థ్యం అని పిలిచేవాళ్లు. ఇస్సాకు కుటుంబంలో ఉన్న స్వాస్థ్యానికి అబ్రాహాముకు యెహోవా చేసిన వాగ్దానాలు కూడా కలుస్తాయి. ఆ వాగ్దానాల గురించి ఏశావు పెద్దగా పట్టించుకోలేదు, కానీ యాకోబుకు మాత్రం అవి చాలా విలువైనవని తెలుసు.

ఒకరోజు ఏశావు రోజంతా వేటాడి బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే యాకోబు చేస్తున్న వంట మంచి వాసన వస్తుంది. అప్పుడు ఏశావు యాకోబుతో ‘నాకు చాలా ఆకలిగా ఉంది. నీ దగ్గరున్న ఆ ఎర్రని కూరలో కొంచెం నాకు పెట్టు!’ అని అడిగాడు. దానికి యాకోబు ‘పెడతాను, కానీ ముందు నీకు వచ్చే స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చేస్తానని మాట ఇవ్వు’ అన్నాడు. ఏశావు ‘నాకు నా స్వాస్థ్యం పెద్ద ముఖ్యం కాదు! నువ్వే తీసుకో. నాకు ఇప్పుడు తినడానికి కావాలి’ అన్నాడు. ఏశావు అలా చేయడం తెలివైన పనే అంటారా? మీకు ఏమనిపిస్తుంది? అది తెలివైన పని కాదు. ఏశావు చాలా విలువైన దాన్ని ఒక గిన్నె కూర కోసం ఇచ్చేశాడు.

ఇస్సాకు బాగా ముసలివాడు అయ్యాక, పెద్ద కొడుకుకు ఒక ఆశీర్వాదం ఇచ్చే సమయం వచ్చింది. కానీ రిబ్కా చిన్న కొడుకైన యాకోబుకు సహాయం చేసి ఆ ఆశీర్వాదం యాకోబుకు వచ్చేలా చేసింది. ఏశావుకు దాని గురించి తెలిసినప్పుడు చాలా కోపం వచ్చి, తనతో పుట్టిన కవల తమ్ముడిని చంపేయాలనుకున్నాడు. యాకోబును ఇస్సాకు, రిబ్కా కాపాడాలనుకున్నారు, అందుకే అతనితో ‘ఏశావు కోపం తగ్గే వరకు నువ్వు వెళ్లి మీ అమ్మ తమ్ముడు లాబాను దగ్గర ఉండు’ అని చెప్పారు. యాకోబు అమ్మానాన్న చెప్పిన మాట విని ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయాడు.

“ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే, అతనికి ఏమి లాభం? ఒక వ్యక్తి తన ప్రాణం కోసం ఏమి ఇవ్వగలడు?”—మార్కు 8:36, 37