కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 14

దేవునికి లోబడి ఉన్న పనివాడు

దేవునికి లోబడి ఉన్న పనివాడు

యాకోబు చిన్న కొడుకుల్లో యోసేపు ఒకడు. అతనంటే వాళ్ల నాన్నకు ఎక్కువ ఇష్టమని యోసేపు అన్నలు చూశారు. వాళ్లకు అది ఎలా అనిపించి ఉంటుందో ఆలోచించండి. వాళ్లు యోసేపుని చూసి కుళ్లుకున్నారు, అతనంటే వాళ్లకు అస్సలు ఇష్టం లేదు. యోసేపుకు కొన్ని విచిత్రమైన కలలు వచ్చినప్పుడు, వాటిని తన అన్నలకు చెప్పాడు. వాళ్లు ఏదో ఒక రోజు అతనికి వంగి నమస్కారం చేయడమే ఆ కలలకు అర్థం అనుకున్నారు. అప్పుడు వాళ్లకు అతని మీద ఇంకా కోపం వచ్చింది.

ఒకరోజు యోసేపు అన్నలు షెకెము పట్టణం దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్నారు. వాళ్లు ఎలా ఉన్నారో చూసి రమ్మని యాకోబు యోసేపును అక్కడకు పంపిస్తాడు. దూరం నుండి యోసేపు రావడం చూసి అతని అన్నలు ఇలా చెప్పుకున్నారు: ‘అదిగో కలలు కనేవాడు వస్తున్నాడు. వాడిని చంపేద్దాం!’ వాళ్లు అతన్ని లాక్కుని వెళ్లి పెద్ద గుంటలో పడేశారు. కానీ వాళ్లలో ఒకడైన యూదా ఇలా అన్నాడు: ‘వాడిని చంపొద్దు! పని చేసే బానిసగా అమ్మేద్దాం.’ వాళ్లు ఐగుప్తు వెళ్తున్న మిద్యాను దేశ వ్యాపారులకు 20 వెండి నాణేలకు యోసేపును అమ్మేశారు.

తర్వాత యోసేపు అన్నలు అతని బట్టలను మేక రక్తంలో ముంచి, వాళ్ల నాన్న దగ్గరకు పంపి: ‘ఇవి నీ కొడుకు బట్టలేనా?’ అని అడిగారు. ఒక అడవి జంతువు తన కొడుకుని చంపేసిందని యాకోబు అనుకున్నాడు. అతను గుండె పగిలేలా ఏడ్చాడు. ఎవ్వరు అతన్ని ఓదార్చలేకపోయారు.

యోసేపును ఐగుప్తులో ఒక పెద్ద అధికారి అయిన పోతీఫరుకు పనివాడిగా అమ్మేశారు. కానీ యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపు చక్కగా పని చేస్తున్నాడని, నమ్మకంగా ఉంటున్నాడని పోతీఫరు గమనించాడు. కొన్ని రోజుల్లోనే పోతీఫరు తనకున్న వాటన్నిటి మీద యోసేపును అధికారిగా పెట్టాడు.

యోసేపు బలంగా, చాలా బాగున్నాడని పోతీఫరు భార్య చూసింది. ఆమెతో సంబంధాలు పెట్టుకోమని రోజూ అడిగేది. మరి యోసేపు ఏమి చేశాడు? ఆయన ‘వద్దు, ఇది తప్పు. నా యజమానికి నా మీద చాలా నమ్మకం, మీరు అతని భార్య. నేను మీతో చెడ్డ సంబంధం పెట్టుకుంటే, దేవునికి ఇష్టం లేని పని చేసిన వాడిని అవుతాను’ అని చెప్పాడు.

ఒకరోజు పోతీఫరు భార్య తనతో పడుకోమని యోసేపును బాగా బలవంతం చేసింది. ఆమె అతని బట్టలు పట్టుకుని లాగింది, కానీ అతను అక్కడ నుండి పారిపోయాడు. పోతీఫరు ఇంటికి వచ్చాక, యోసేపు నన్ను బలవంతం చేయబోయాడని చెప్పింది. ఆమె చెప్పింది అబద్ధం. పోతీఫరుకు చాలా కోపం వచ్చి యోసేపును జైల్లో వేశాడు. కానీ యెహోవా యోసేపును మర్చిపోలేదు.

“కాబట్టి, దేవుడు మిమ్మల్ని తగిన సమయంలో గొప్ప చేసేలా ఆయన బలమైన చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి.”—1 పేతురు 5:6