కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 16

యోబు ఎవరు?

యోబు ఎవరు?

ఊజు ప్రాంతంలో యెహోవాను ఆరాధించే ఒకతను ఉన్నాడు. అతని పేరు యోబు. ఆయనకు చాలా ఆస్తి ఉంది. చాలా పెద్ద కుటుంబం ఉంది. ఆయన చాలా జాలి గలవాడు. పేదవాళ్లకు, భర్త చనిపోయిన వాళ్లకు, అమ్మానాన్న లేని పిల్లలకు సహాయం చేసేవాడు. ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు అసలు కష్టాలే రావా?

అపవాదియైన సాతాను తనను గమనిస్తున్నాడని యోబుకు తెలియదు. యెహోవా సాతానుతో: ‘నా సేవకుడైన యోబును చూశావా? భూమి మీద అతనిలా ఎవ్వరూ లేరు. అతను నా మాట వింటాడు ఎప్పుడూ సరైనదే చేస్తాడు’ అని అన్నాడు. దానికి సాతాను ఇలా చెప్పాడు: ‘అవును వింటాడు, నువ్వు అతన్ని కాపాడుతూ, దీవిస్తూ ఉన్నావుగా, అతనికి జంతువులను స్థలాలను ఇచ్చావు. వాటన్నిటిని తీసేయి ఇంక అతను నిన్ను ఆరాధించడు.’ అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు: ‘నువ్వు యోబుని పరీక్షించవచ్చు, కానీ అతనిని చంపకూడదు.’ సాతాను యోబును పరీక్షించడానికి యెహోవా ఎందుకు ఒప్పుకున్నాడు? యోబు ఓడిపోడని యెహోవాకు పూర్తి నమ్మకం ఉంది.

సాతాను యోబుకు చాలా కష్టాలు తెచ్చి పరీక్షించడం మొదలు పెట్టాడు. మొదట, యోబు పశువులను, గాడిదలను దొంగతనం చేసేలా సాతాను సెబాయీయులను పంపిస్తాడు. యోబు గొర్రెలన్నీ అగ్నిలో కాలిపోతాయి. కల్దీయులు అనే వాళ్లు వచ్చి అతని ఒంటెలన్నిటిని దొంగతనం చేస్తారు. జంతువుల్ని చూసుకునే సేవకులు చచ్చిపోతారు. తర్వాత యోబుకు ఇంకా పెద్ద కష్టం వచ్చింది. యోబు పిల్లలు కలిసి ఒక ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఆ ఇల్లు పడిపోయి వాళ్లందరూ చనిపోతారు. అది విన్న యోబు గుండె బద్దలై పోతుంది, కానీ యెహోవాను ఆరాధించడం మాత్రం ఆపలేదు.

యోబును ఇంకా బాధపెట్టాలని సాతాను అనుకున్నాడు. అతని ఒళ్లంతా పుండ్లు వచ్చేలా చేస్తాడు. యోబు చాలా బాధలో ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో యోబుకు తెలియదు. అయినా యెహోవాను ఆరాధిస్తూనే ఉన్నాడు. అది చూసి యెహోవాకు యోబు మీద ఇంకా ఇష్టం పెరిగింది.

సాతాను యోబును పరీక్షించడానికి ముగ్గురు మనుషుల్ని పంపిస్తాడు. వాళ్లు యోబుతో: ‘నువ్వు ఏదో తప్పు చేసి దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించావు. అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు’ అని అంటారు. యోబు: ‘నేను ఏ తప్పూ చేయలేదు’ అని అంటాడు కానీ, యెహోవాయే తన కష్టాలకు కారణం అని అనుకోవడం మొదలు పెడతాడు. దేవుడు తనకు అన్యాయం చేశాడని కూడా అంటాడు.

యవనుడైన ఎలీహు వాళ్ల మాటలన్నీ వింటూ ఉంటాడు. తర్వాత ఇలా అంటాడు: ‘మీరు చెప్పింది అంతా తప్పు. మనం అనుకున్న దానికన్నా యెహోవా ఎంతో గొప్పవాడు. ఆయన ఎప్పుడూ చెడు చేయడు. ఆయన అన్నీ చూస్తాడు. ప్రజల కష్టాల్లో వాళ్లకు సహాయం చేస్తాడు.’

తర్వాత, యెహోవా యోబుతో మాట్లాడాడు. ఆయన, ‘నేను భూమిని ఆకాశాన్ని చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను న్యాయం చేయనని నువ్వు ఎందుకు అంటున్నావు? నువ్వు ఇలా అంటున్నావ్‌ కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నీకు తెలీదు’ అని అన్నాడు. యోబు తన తప్పును ఒప్పుకుని ఇలా అంటాడు: ‘నేను తప్పు చేశాను. నేను నీ గురించి విన్నాను కానీ ఇప్పుడు నిజంగా నిన్ను తెలుసుకున్నాను. నువ్వు చేయలేనిది అంటూ ఏదీ లేదు. నేను అన్న మాటలకు నన్ను క్షమించు.’

యోబుకు వచ్చిన పరీక్ష పూర్తయ్యాక, యెహోవా యోబుకు మళ్లీ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అంతకుముందు ఆయనకున్న వాటికన్నా యెహోవా చాలా ఎక్కువ ఇచ్చాడు. యోబు చాలా కాలం సంతోషంగా జీవించాడు. కష్టంగా ఉన్నప్పుడు కూడా యోబు తన మాట విన్నందుకు యెహోవా ఆయనను దీవించాడు. మీరు కూడా యోబులాగే ఏది ఏమైనా యెహోవాను ఆరాధిస్తూ ఉంటారా?

“యోబు సహనం గురించి మీరు విన్నారు, యెహోవా అతన్ని ఎలా దీవించాడో మీకు తెలుసు.” —యాకోబు 5:11