కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 18

మండుతున్న పొద

మండుతున్న పొద

మోషే మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆయనకు పెళ్లై, పిల్లలు పుట్టారు. ఒకరోజు ఆయన సీనాయి కొండమీద గొర్రెలను కాస్తున్నప్పుడు, అద్భుతమైనది ఒకటి చూశాడు. ఒక ముళ్ల చెట్టు నుండి మంటలు వస్తున్నాయి కానీ అది కాలిపోవడం లేదు. అది ఏమిటో చూద్దామని మోషే దగ్గరకు వెళ్లినప్పుడు అందులో నుండి ఈ మాటలు వచ్చాయి, ‘మోషే! దగ్గరకు రావద్దు. నీ చెప్పులు తీసేయి, ఎందుకంటే నువ్వు పవిత్ర స్థలంలో నిలుచుని ఉన్నావు.’ అక్కడ దూత ద్వారా యెహోవా మాట్లాడుతున్నాడు.

మోషేకు భయం వేసి ముఖాన్ని కప్పుకున్నాడు. ఆ స్వరం ఇలా చెప్పింది: ‘నేను ఇశ్రాయేలీయులు పడుతున్న కష్టాలను చూశాను. నేను వాళ్లను ఐగుప్తు నుండి విడిపించి, మంచి దేశానికి తీసుకెళ్తాను. నువ్వే వెళ్లి నా ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకురావాలి.’ మోషేకు ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది కదా!

మోషే ఇలా అడిగాడు: ‘నిన్ను ఎవరు పంపించారని ప్రజలు అడిగితే నేను ఏమి చెప్పాలి?’ అందుకు దేవుడు, ‘అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నన్ను పంపించాడని చెప్పు’ అని అంటాడు. అప్పుడు మోషే ఇలా అన్నాడు: ‘ప్రజలు నా మాట వినకపోతే ఏమి చేయాలి?’ మోషేకు సహాయం చేస్తాను అనడానికి యెహోవా ఒక గుర్తును చూపిస్తాడు. యెహోవా మోషేతో ‘నీ కర్రను కింద పడేయి’ అని చెప్పాడు. అప్పుడు ఆ కర్ర పాము అవుతుంది! మోషే ఆ పాము తోక పట్టుకున్నప్పుడు అది మళ్లీ కర్ర అయిపోతుంది. యెహోవా ఇలా చెప్పాడు: ‘నువ్వు ఈ అద్భుతం చేసినప్పుడు, నేను నిన్ను పంపించానని అందరికీ తెలుస్తుంది.’

తర్వాత మోషే ఇలా అన్నాడు: ‘నేను సరిగ్గా మాట్లాడలేను.’ అప్పుడు యెహోవా ఇలా మాటిచ్చాడు: ‘ఏమి మాట్లాడాలో నేను నీకు చెప్తాను, నీకు సహాయం చేయడానికి నీ అన్న అహరోనును పంపిస్తాను.’ యెహోవా అతనికి తోడుగా ఉన్నాడని తెలుసుకుని, మోషే అతని భార్యని, పిల్లల్ని తీసుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్లాడు.

“అయితే వాళ్లు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలా మాట్లాడాలా, ఏమి మాట్లాడాలా అని ఆందోళన పడకండి; మీరు ఏమి మాట్లాడాలో ఆ సమయంలోనే మీకు తెలుస్తుంది.”—మత్తయి 10:19