కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 22

ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం

ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం

ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వెళ్లిపోయారని వినగానే, ఫరో మనసు మారిపోయింది. ఆయన తన సైనికులకు ఇలా ఆజ్ఞాపిస్తాడు: ‘నా రథాలన్నిటిని సిద్ధం చేయండి, వాళ్లను వెంటాడి పట్టుకుందాం! మనం వాళ్లను వెళ్లనివ్వకుండా ఉండాల్సింది.’ ఫరో, అతని మనుషులు ఇశ్రాయేలీయుల వెంటపడ్డారు.

యెహోవా తన ప్రజలను రాత్రులు అగ్నితో, పగలు మేఘంతో నడిపించాడు. వాళ్లను ఎర్ర సముద్రం వరకు నడిపించి, అక్కడ ఆగి డేరాలు వేసుకోమని చెప్పాడు.

ఫరో, అతని సైనికులు వాళ్ల వెంట పడడం ఇశ్రాయేలీయులు చూశారు. వాళ్లు ఐగుప్తు సైనికులకు ఎర్రసముద్రానికి మధ్యలో చిక్కుకుపోయారు. వాళ్లు భయపడి మోషేతో ఇలా అన్నారు: ‘మేము చచ్చిపోతాం! నువ్వు మమ్మల్ని ఐగుప్తులోనే వదిలేయాల్సింది.’ కానీ మోషే ఇలా చెప్పాడు: ‘భయపడకండి. యెహోవా మనందర్నీ ఎలా రక్షిస్తాడో చూడండి.’ మోషే నిజంగా యెహోవాను నమ్మాడు కదా!

యెహోవా ఇశ్రాయేలీయులను అన్నీ సర్దుకొని బయల్దేరమని చెప్పాడు. ఆ రాత్రి యెహోవా ఐగుప్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్యలో మేఘం ఉండేలా చేశాడు. ఐగుప్తీయులకు చీకటిగా ఉంది. కానీ ఇశ్రాయేలీయులకు వెలుగు ఉంది.

సముద్రం మీద తన చేయి చాపమని యెహోవా మోషేతో చెప్పాడు. అప్పుడు యెహోవా రాత్రంతా బలమైన గాలి వీచేలా చేశాడు. సముద్రం రెండుగా చీలిపోయింది, మధ్యలో నడవడానికి ఒక దారి వచ్చింది. లక్షలమంది ఇశ్రాయేలీయులు పొడి నేల మీద, రెండు వైపుల గోడల్లా ఉన్న నీళ్ల మధ్యలో నడుచుకుంటూ సముద్రాన్ని దాటారు.

సముద్రంలో ఇశ్రాయేలీయులు నడిచి వెళ్లే దారిలోకి ఫరో సైన్యం కూడా వచ్చింది. అప్పుడు యెహోవా ఆ సైన్యాలను గందరగోళంలో పడేశాడు. రథాల చక్రాలు ఊడిపడిపోతున్నాయి. సైనికులు ఇలా అరిచారు: ‘ఇక్కడ నుండి పారిపోదాం! యెహోవా వాళ్లకోసం యుద్ధం చేస్తున్నాడు.’

యెహోవా మోషేతో ఇలా అన్నాడు: ‘సముద్రంపైన నీ చెయ్యి చాపు. వెంటనే గోడల్లా ఆగిపోయిన నీళ్లు ఐగుప్తు సైనికుల మీద పడిపోయాయి. ఫరో అతని మనుషులందరూ చచ్చిపోయారు. వాళ్లలో ఒక్కరు కూడా మిగలలేదు.’

సముద్రానికి అవతల వైపు గుంపులు గుంపులుగా ఉన్న ఆ ప్రజలందరూ కలిసి దేవున్ని ఒక పాటతో స్తుతించారు: “యెహోవాను గానముచేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.” ప్రజలు పాటలు పాడుతున్నప్పుడు ఆడవాళ్లు డాన్స్‌ చేస్తూ తంబురలు వాయించారు. ప్రతీ ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు నిజంగా స్వేచ్ఛ వచ్చింది.

“అందుకే మనం మంచి ధైర్యంతో ఇలా అనగలం: ‘నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?’”—హెబ్రీయులు 13:6