కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 23

యెహోవాకు ఇచ్చిన మాట

యెహోవాకు ఇచ్చిన మాట

ఐగుప్తునుండి బయల్దేరిన రెండు నెలలకు ఇశ్రాయేలీయులు సీనాయి కొండ దగ్గరకు వచ్చి అక్కడ డేరాలు వేసుకుని ఉన్నారు. యెహోవా పిలిచినప్పుడు మోషే కొండ మీదకు వెళ్లాడు. అక్కడ మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: ‘నేను ఇశ్రాయేలీయులను రక్షించాను. వాళ్లు నా మాట విని నేను ఇచ్చిన నియమాలు పాటిస్తే వాళ్లు నా ప్రత్యేక ప్రజలుగా ఉంటారు.’ మోషే కిందకు వచ్చి, యెహోవా అన్న మాటల్ని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. దానికి వాళ్లు ఏమన్నారు? ‘యెహోవా మాకు చెప్పినవన్నీ మేము చేస్తాం’ అని జవాబిచ్చారు.

మోషే మళ్లీ ఆ కొండ మీదకు వెళ్లాడు. అక్కడ యెహోవా ఇలా అన్నాడు: ‘మూడవ రోజున నేను మీతో మాట్లాడతాను. ప్రజలు ఎవ్వరు సీనాయి కొండ మీదకు ఎక్కకూడదని చెప్పు.’ మోషే కిందకు వెళ్లి, యెహోవా మాటలు వినడానికి రెడీగా ఉండమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు.

మూడవ రోజున ఇశ్రాయేలీయులు కొండ మీద మెరుపుల్ని, పెద్ద నల్ల మేఘాన్ని చూశారు. ఉరుముల్ని, ఒక బూర శబ్దాన్ని కూడా విన్నారు. తర్వాత యెహోవా కొండ మీదకు అగ్నిలో దిగి వచ్చాడు. ఇశ్రాయేలీయులు ఎంత భయపడిపోయారంటే వాళ్లు వణికిపోయారు. కొండ బాగా కంపించి, పొగతో నిండిపోయింది. బూర శబ్దం చాలా ఎక్కువౌతూ ఉంది. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: ‘నేను యెహోవాను. మీరు వేరే దేవుళ్లను ఆరాధించకూడదు.’

మోషే మళ్లీ కొండ పైకి ఎక్కి వెళ్లాడు. ప్రజలు పాటించడానికి నియమాలను యెహోవా అతనికి అక్కడ ఇచ్చాడు. వాళ్లు ఆయనను ఎలా ఆరాధించాలో, ఎలా ఉండాలో చెప్పాడు. మోషే ఆ నియమాలన్నీ రాసుకుని ఇశ్రాయేలీయులకు చదివి వినిపించాడు. వాళ్లు ‘యెహోవా మాకు చెప్పినవన్నీ మేము చేస్తాం’ అని మాటిచ్చారు. అవును, వాళ్లు దేవునికి మాటిచ్చారు. కానీ, వాళ్ల మాటను నిలబెట్టుకున్నారా?

“నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.”—మత్తయి 22:37