కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 28

బిలాము గాడిద మాట్లాడుతుంది

బిలాము గాడిద మాట్లాడుతుంది

ఇశ్రాయేలీయులు దాదాపు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. వాళ్లు బలమైన పట్టణాలను ఎన్నో ఓడించారు. ఇప్పుడు వాళ్లు యొర్దాను నదికి తూర్పున ఉన్న మోయాబు మైదానంలో డేరాలు వేసుకుని ఉన్నారు. వాళ్లు వాగ్దాన దేశానికి వెళ్లే సమయం వచ్చింది. ఇశ్రాయేలీయులు తన రాజ్యం తీసేసుకుంటారేమో అని మోయాబు రాజైన బాలాకు భయపడ్డాడు. అందుకే అతను బిలాము అనే అతనిని మోయాబుకు పిలిపించి ఇశ్రాయేలీయులను శపించమని అడుగుతాడు.

కానీ యెహోవా బిలాముకు ఇలా చెప్పాడు: ‘నువ్వు ఇశ్రాయేలీయులను శపించకూడదు.’ కాబట్టి బిలాము అక్కడకు వెళ్లడానికి ఒప్పుకోలేడు. రాజైన బాలాకు రెండవసారి బిలామును పిలిపించి నువ్వు ఏది అడిగితే అది నీకు ఇస్తాను అని చెబుతాడు. అయినా, బిలాము ఒప్పుకోడు. అప్పుడు దేవుడు ఇలా చెబుతాడు: ‘నువ్వు వెళ్లొచ్చు, కానీ నేను నీకు ఏమి చెప్తానో దాన్నే నువ్వు చెప్పాలి.’

బిలాము తన గాడిదను తీసుకుని దక్షిణం వైపు మోయాబుకు బయల్దేరాడు. యెహోవా వద్దని చెప్పినా అతను ఇశ్రాయేలీయులను శపించాలని మనసులో అనుకున్నాడు. యెహోవా దూత దారిలో మూడుసార్లు కనిపిస్తాడు. బిలాము ఆ దూతను చూడలేకపోయాడు కానీ బిలాము గాడిద చూసింది. మొదటిసారి గాడిద రోడ్డు మీద నుండి పొలాల్లోకి వెళ్లిపోయింది. తర్వాత గాడిద పక్కకు జరిగి గోడకు నొక్కుకున్నప్పుడు బిలాము కాలు గోడకు కొట్టుకుంది. చివరికి గాడిద రోడ్డు మధ్యలో కూర్చుని ఉండిపోయింది. ప్రతీసారి, బిలాము గాడిదను కర్రతో కొట్టాడు.

అప్పుడు యెహోవా గాడిదను మాట్లాడేలా చేశాడు. గాడిద బిలామును ఇలా అడిగింది: ‘నన్ను ఎందుకు కొడుతూ ఉన్నావు?’ బిలాము ఇలా చెప్పాడు: ‘నువ్వు నన్ను పిచ్చివాడిని చేశావు. నా దగ్గర పెద్ద కత్తి ఉండి ఉంటే నిన్ను చంపేసేవాణ్ణి.’ అప్పుడు గాడిద ఇలా చెప్పింది: ‘నేను ఎన్నో సంవత్సరాలు నిన్ను ఎక్కించుకుని తీసుకెళ్లాను. ముందెప్పుడైనా నేను ఇలా చేశానా?’

ఆఖరికి బిలాము దేవదూతను చూడగలిగేలా యెహోవా చేస్తాడు. దేవదూత ఇలా అన్నాడు: ‘నువ్వు ఇశ్రాయేలీయులను శపించకూడదని యెహోవా నీకు ముందే చెప్పాడు.’ బిలాము ఇలా అంటాడు: ‘నేను తప్పు చేశాను. నేను ఇంటికి వెళ్లిపోతాను.’ కానీ దూత ఇలా చెప్తాడు: ‘నువ్వు మోయాబుకు వెళ్లవచ్చు, కానీ యెహోవా నీతో ఏమి చెప్తాడో నువ్వు అదే చెప్పాలి.’

మరి బిలాముకు బుద్ధి వచ్చిందా? లేదు. తర్వాత బిలాము మూడుసార్లు ఇశ్రాయేలును శపించాలని చూస్తాడు, కానీ యెహోవా ప్రతీసారి అతను వాళ్లను శపించే బదులు ఆశీర్వదించేలా చేస్తాడు. చివరికి ఇశ్రాయేలీయులు మోయాబు మీద దాడి చేసి బిలామును చంపేస్తారు. బిలాము యెహోవా చెప్పినట్లు ముందే వినుంటే బాగుండేదని మీకు అనిపిస్తుందా?

“ఏ రకమైన అత్యాశకూ చోటివ్వకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే, ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.” —లూకా 12:15