కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 29

యెహోవా యెహోషువను ఎన్నుకున్నాడు

యెహోవా యెహోషువను ఎన్నుకున్నాడు

ఇశ్రాయేలును చాలా సంవత్సరాలు నడిపించిన మోషే కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడు. యెహోవా ఆయనతో ఇలా అన్నాడు: ‘ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశానికి నువ్వు తీసుకెళ్లవు. కానీ నేను నిన్ను ఆ దేశాన్ని చూడనిస్తాను.’ ప్రజలను చూసుకోవడానికి కొత్త నాయకుడ్ని నియమించమని మోషే యెహోవాను అడిగాడు. యెహోవా మోషేతో ఇలా అన్నాడు: ‘యెహోషువ దగ్గరకు వెళ్లి, అతనే కొత్త నాయకుడు అని చెప్పు.’

తాను త్వరలో చనిపోతాడని, వాళ్లను వాగ్దాన దేశానికి నడిపించడానికి యెహోవా యెహోషువను పెట్టాడని మోషే ప్రజలతో చెప్పాడు. మోషే యెహోషువతో ఇలా అన్నాడు: ‘భయపడకు. యెహోవా నీకు సహాయం చేస్తాడు.’ ఆ తర్వాత మోషే నెబో పర్వతం పైకి వెళ్లాడు. అక్కడ యెహోవా అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇస్తానని మాటిచ్చిన దేశాన్ని మోషేకు చూపిస్తాడు. మోషే చనిపోయినప్పుడు ఆయనకు 120 సంవత్సరాలు.

యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: ‘యొర్దాను నది దాటి, కనాను దేశానికి వెళ్లు. మోషేకు నేను సహాయం చేసినట్లు నీకు కూడా సహాయం చేస్తాను. నువ్వు నా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా రోజు చదివేలా చూసుకో. భయపడకు. ధైర్యంగా ఉండు. వెళ్లి, నేను నీకు చెప్పినవన్నీ చెయ్యి.’

యెరికో పట్టణానికి యెహోషువ ఇద్దరు గూఢచారులను పంపించాడు. తర్వాత కథలో, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. వాళ్లు తిరిగి వచ్చి కనాను దేశానికి వెళ్లడానికి ఇది మంచి సమయం అని చెప్పారు. తర్వాత రోజు యెహోషువ ప్రజలందర్నీ అన్నీ సర్దుకుని రెడీగా ఉండమని చెప్పాడు. ఒప్పంద మందసాన్ని మోస్తున్న యాజకుల్ని యెహోషువ యొర్దాను నది దగ్గరకు ముందు పంపించాడు. నదిలో నీళ్లు వరదలా పొంగుతున్నాయి. కానీ యాజకుల కాళ్లు నీళ్లకు తగలగానే, నది ప్రవహించడం ఆగిపోయి నీళ్లు లేకుండాపోయాయి. యాజకులు ఆ నది మధ్యలోకి వెళ్లి నిలబడ్డారు. అప్పుడు ఇశ్రాయేలీయులు అంతా అవతల వైపుకు దాటి వెళ్లిపోయారు. ఈ అద్భుతం చూసి వాళ్లకు యెహోవా ఎర్ర సముద్రం దగ్గర చేసినది గుర్తుకు వచ్చి ఉంటుందా?

చివరికి ఇన్ని సంవత్సరాలకు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్లారు. వాళ్లు అక్కడ ఇళ్లు, పట్టణాలు కట్టుకోవచ్చు. పంటలు, ద్రాక్షతోటలు, పండ్ల చెట్లు నాటుకోవచ్చు. అది పంటలు బాగా పండే మంచి దేశం.

‘యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును.’ —యెషయా 58:11