కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 31

యెహోషువ, గిబియోనీయులు

యెహోషువ, గిబియోనీయులు

యెరికోకు జరిగిన దాని గురించి కనానులో ఉన్న వేరే దేశాలవాళ్లకు కూడా తెలిసింది. వాళ్ల రాజులందరూ కలిసి ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయాలని అనుకుంటారు. కానీ గిబియోనీయులకు వేరే ఆలోచన వచ్చింది. వాళ్లు చిరిగిపోయిన పాత బట్టలు వేసుకుని యెహోషువ దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు: ‘మేము చాలా దూరం నుండి వస్తున్నాం. యెహోవా గురించి, ఐగుప్తులో, మోయాబులో ఆయన మీకోసం చేసినవాటన్నిటి గురించి మేము విన్నాం. మామీద యుద్ధం చేయరని మాటివ్వండి. మేము మీకు సేవకులం అవుతాం.’

యెహోషువ వాళ్లను నమ్మి వాళ్లపై యుద్ధం చేయనని ఒప్పుకున్నాడు. కానీ మూడు రోజుల తర్వాత వాళ్లు దూరం నుండి రాలేదని తెలుసుకున్నాడు. వాళ్లు కనాను దేశం నుండే వచ్చారు. యెహోషువ వాళ్లను ‘మీరు మాకు అబద్ధం ఎందుకు చెప్పారు?’ అని అడిగాడు. అప్పుడు వాళ్లు ‘మేము భయపడిపోయాం! మీ దేవుడైన యెహోవా మీకోసం పోరాడుతున్నాడని మాకు తెలుసు. దయచేసి మమ్మల్ని చంపకండి’ అని అన్నారు. యెహోషువ వాళ్లకు ఇచ్చిన మాట మీద నిలబడి వాళ్లను బ్రతకనిచ్చాడు.

కొంతకాలానికి ఐదుగురు కనాను రాజులు, వాళ్ల సైన్యాలు గిబియోనీయుల్ని బెదిరించారు. వాళ్లను కాపాడడానికి యెహోషువ ఆయన సైన్యం రాత్రంతా నడుచుకుంటూ వెళ్లారు. తర్వాతి రోజు పొద్దున్నే యుద్ధం మొదలైంది. కనానీయులు అన్నీ వైపుల్లో పారిపోవడం మొదలుపెట్టారు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా యెహోవా వాళ్లపై పెద్దపెద్ద వడగండ్లు కురిపించాడు. తర్వాత యెహోషువ సూర్యుడ్ని కదలకుండా అలానే ఉండమని యెహోవాను అడిగాడు. సూర్యుడు ఎప్పుడూ కదలకుండా ఉండలేదు, మరి యెహోషువ ఎందుకు యెహోవాను అలా చేయమని అడిగాడు? ఎందుకంటే యెహోషువ యెహోవాను నమ్మాడు. కనాను రాజుల్ని, వాళ్ల సైన్యాల్ని ఇశ్రాయేలీయులు ఓడించే వరకు ఆ రోజంతా సూర్యుడు కదలకుండా ఉన్నాడు, అస్తమించలేదు.

“మీ మాట ‘అవును’ అంటే అవును, ‘కాదు’ అంటే కాదు అన్నట్టే ఉండాలి. ఇవి కాకుండా మరేదైనా దుష్టుని నుండి వచ్చేదే.”—మత్తయి 5:37