కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 32

ఒక కొత్త నాయకుడు, ఇద్దరు ధైర్యవంతురాళ్లైన స్త్రీలు

ఒక కొత్త నాయకుడు, ఇద్దరు ధైర్యవంతురాళ్లైన స్త్రీలు

యెహోవా ప్రజలను చాలా సంవత్సరాలు నడిపించి, యెహోషువ 110 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆయన బ్రతికున్నంత కాలం ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించారు. కానీ యెహోషువ చనిపోయాక, కనానీయుల్లా విగ్రహాల్ని, బొమ్మల్ని ఆరాధించడం మొదలు పెట్టారు. ఇశ్రాయేలీయులు యెహోవా మాట వినడం మానేశారు కాబట్టి యాబీను అనే కనాను రాజు వచ్చి ఇశ్రాయేలీయుల్ని కష్టపెడుతూ ఉన్నాడు. కానీ యెహోవా అతన్ని ఆపలేదు. అప్పుడు సహాయం కోసం ప్రజలు యెహోవాను వేడుకున్నారు. అది చూసి యెహోవా వాళ్లకు బారాకు అనే కొత్త నాయకుడిని ఇచ్చాడు. ఆయన యెహోవా దగ్గరికి తిరిగి రావడానికి ప్రజలకు సహాయం చేశాడు.

దెబోరా అనే ప్రవక్త్రిని బారాకును పిలిపిస్తుంది. యెహోవా నుండి అతనికి వచ్చిన సందేశాన్ని ఆమె ఇలా చెప్తుంది: ‘నువ్వు 10,000 పురుషుల్ని తీసుకుని, కీషోను వాగు దగ్గర యాబీను సైన్యం మీదకు వెళ్లు. అక్కడ నువ్వు యాబీను సైన్యాధికారి అయిన సీసెరాను ఓడిస్తావు.’ బారాకు దెబోరాతో ‘నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను’ అని అన్నాడు. అప్పుడు ఆమె ‘నేను నీతో వస్తాను కానీ సీసెరాను చంపేది నువ్వు కాదు. ఒక స్త్రీ అతనిని చంపుతుందని యెహోవా చెప్పాడు’ అని అంది.

దెబోరాతో బారాకు, అతని సైన్యం యుద్ధానికి సిద్ధమవ్వడానికి తాబోరు కొండకు వెళ్తారు. సీసెరా అది విన్న వెంటనే రథాలను సైన్యాలను తీసుకుని కొండ కింద ఉన్న లోయకు వెళ్తాడు. దెబోరా బారాకుతో ‘ఈ రోజు యెహోవా నీకు విజయాన్ని ఇస్తాడు’ అని చెప్పింది. బారాకు తనతో ఉన్న 10,000 మందిని తీసుకుని కొండ కింద ఉన్న సీసెరా బలమైన సైన్యం మీదకు వెళ్తాడు.

అప్పుడు యెహోవా కీషోను వాగు పొంగేలా చేస్తాడు. సీసెరా యుద్ధ రథాలు బురదలో చిక్కుకుపోతాయి. సీసెరా రథాన్ని వదిలేసి పరిగెత్తడం మొదలు పెడతాడు. బారాకు అతని సైనికులు సీసెరా సైన్యాన్ని ఓడిస్తారు కానీ సీసెరా తప్పించుకుంటాడు. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్లి యాయేలు అనే ఆమె ఇంట్లో దాక్కుంటాడు. ఆమె అతనికి తాగడానికి పాలు ఇచ్చింది. అతను పడుకున్నప్పుడు అతని మీద దుప్పటి కప్పింది. ఆ యోధుడు అలసిపోయి నిద్ర పోయాడు. ఆ తర్వాత యాయేలు మెల్లగా వచ్చి, డేరా మేకును అతని తలలోకి కొట్టి దించింది. అతను చనిపోయాడు.

బారాకు సీసెరాను వెతుక్కుంటూ వచ్చాడు. యాయేలు డేరాలోనుండి బయటకు వచ్చి బారాకుతో ‘లోపలికి రండి. మీరు వెదుకుతున్న అతన్ని నేను చూపిస్తాను’ అని అంది. బారాకు లోపలకు వెళ్లి సీసెరా చచ్చిపోయి ఉండడం చూశాడు. ఇశ్రాయేలీయులకు శత్రువుల మీద గెలుపును ఇచ్చినందుకు బారాకు, దెబోరా యెహోవాను స్తుతిస్తూ పాట పాడారు. తర్వాత 40 సంవత్సరాల వరకు ఇశ్రాయేలు దేశం ప్రశాంతంగా ఉంది.

మంచివార్తను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. —కీర్తన 68:11