కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 33

రూతు, నయోమి

రూతు, నయోమి

ఇశ్రాయేలులో కరువు వచ్చినప్పుడు నయోమి, ఆమె భర్త, ఇద్దరు కొడుకులు మోయాబు దేశానికి వెళ్లిపోతారు. తర్వాత నయోమి భర్త చనిపోయాడు. ఆమె కొడుకులు రూతు, ఓర్పా అనే మోయాబు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. కానీ పాపం కొన్ని రోజులకు నయోమి కొడుకులు కూడా చనిపోయారు.

ఇశ్రాయేలులో కరువు తగ్గిపోయిందని నయోమి వినగానే తిరిగి తన సొంత ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. రూతు, ఓర్పా ఆమెతో బయల్దేరతారు, కానీ దారిలో వెళ్తున్నప్పుడు నయోమి వాళ్లతో, ‘మీరు నా కొడుకులకు మంచి భార్యలుగా ఉన్నారు, నాకు మంచి కోడళ్లుగా ఉన్నారు. కానీ మీ ఇద్దరు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు మోయాబుకు మీ ఇంటికి వెళ్లిపోండి’ అని అన్నది. అప్పుడు వాళ్లిద్దరు ఇలా అన్నారు, ‘మాకు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను వదిలి పెట్టి వెళ్లాలని లేదు.’ కానీ నయోమి వాళ్లను వెళ్లమని చెప్తూనే ఉంది. చివరికి ఓర్పా వెళ్లిపోయింది కానీ రూతు వెళ్లలేదు. ఆమెతో నయోమి, ‘ఓర్పా తన ప్రజల దగ్గరికి, తన దేవుళ్ల దగ్గరికి తిరిగెళ్లిపోయింది. నువ్వు కూడా ఆమెతోపాటు వెళ్లు. నీ ఇంటికి తిరిగి వెళ్లు’ అని అంటుంది. అప్పుడు రూతు ఆమెతో ఇలా అంటుంది, ‘నేను నిన్ను వదిలి వెళ్లను. మీ వాళ్లే నా వాళ్లు, మీ దేవుడే నా దేవుడు.’ రూతు అలా అన్నప్పుడు నయోమికి ఎలా అనిపించి ఉంటుంది?

రూతు, నయోమి బార్లీ పంట కోత మొదలయ్యే సమయానికి ఇశ్రాయేలు చేరుకుంటారు. ఒక రోజు రూతు పొలాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని ఏరుకోవడానికి బోయజు అనే అతని పొలానికి వెళ్తుంది. అతను రాహాబు కొడుకు. రూతు నమ్మకంగా నయోమితో ఉండిపోయిన మోయాబీయురాలు అని అతను విన్నాడు. రూతు కాస్త ఎక్కువ ఏరుకోవడానికి వీలుగా ధాన్యాన్ని వదిలేయమని అతను పనివాళ్లతో చెప్పాడు.

ఆ సాయంత్రం నయోమి రూతుతో, ‘ఈ రోజు నువ్వు ఎవరి పొలంలో పని చేశావు?’ అని అడిగింది. అందుకు రూతు ‘బోయజు అనే అతని పొలంలో’ అని జవాబిచ్చింది. నయోమి ఆమెతో ‘బోయజు నా భర్త చుట్టాల్లో ఒకడు. అతని పొలంలో పని చేసే అమ్మాయిలతో కలిసి పని చేస్తూ ఉండు. నువ్వు అక్కడ క్షేమంగా ఉండవచ్చు.’

రూతు కోత అయిపోయే వరకు బోయజు పొలంలోనే పని చేస్తూ ఉంది. రూతు చాలా కష్టపడి పని చేస్తుందని, చాలా మంచి స్త్రీ అని బోయజు గమనించాడు. ఆ రోజుల్లో కొడుకులు పుట్టకుండా ఒకతను చనిపోతే, అతని చుట్టాలు ఎవరైనా అతని భార్యను పెళ్లి చేసుకునేవాళ్లు. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఓబేదు అనే కొడుకు పుట్టాడు. తర్వాత అతను రాజైన దావీదుకు తాత అయ్యాడు. నయోమి స్నేహితులు ఆమెను చూసి చాలా సంతోషించారు. వాళ్లు ‘ముందు దేవుడు నీకు రూతును ఇచ్చాడు. ఆమె నిన్ను చాలా బాగా చూసుకుంది, ఇప్పుడు నీకు మనవడు పుట్టాడు. యెహోవాకు స్తుతి కలగాలి’ అన్నారు.

“సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు.”—సామెతలు 18:24