కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 40

దావీదు, గొల్యాతు

దావీదు, గొల్యాతు

యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు: ‘యెష్షయి ఇంటికి వెళ్లు. అతని కొడుకుల్లో ఒకరు ఇశ్రాయేలు తర్వాతి రాజు అవుతాడు.’ అప్పుడు సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్లాడు. అతని పెద్ద కొడుకును చూసినప్పుడు, ‘ఖచ్చితంగా యెహోవా ఇతని గురించే చెప్పి ఉంటాడు’ అనుకున్నాడు. కానీ యెహోవా సమూయేలుకు ‘ఇతను కాదు’ అని చెప్పాడు. యెహోవా ఇలా అన్నాడు: ‘నేను పై రూపాన్నే కాదు, మనుషుల లోపల హృదయాన్ని కూడా చూస్తాను.’

యెష్షయి అతని మిగతా ఆరుగురు కొడుకులను సమూయేలు దగ్గరకు తీసుకొస్తాడు. కానీ సమూయేలు ఇలా అన్నాడు: ‘యెహోవా వీళ్లలో ఎవర్ని ఎన్నుకోలేదు. నీకు ఇంకా కొడుకులు ఉన్నారా?’ యెష్షయి ఇలా చెప్పాడు: ‘నాకు ఇంకో కొడుకు ఉన్నాడు, అతను అందరికన్నా చిన్నవాడైన దావీదు. నా గొర్రెలను మేపడానికి బయటకు వెళ్లాడు.’ దావీదు వచ్చినప్పుడు, యెహోవా సమూయేలుతో, ‘నేను ఎన్నుకున్నది ఇతడినే!’ అని చెప్పాడు. సమూయేలు దావీదు తల మీద నూనె పోసి, ఇశ్రాయేలుకు కాబోయే రాజుగా దావీదును అభిషేకించాడు.

కొన్ని రోజులు తర్వాత, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధంలో ఉన్నారు. ఫిలిష్తీయుల వైపు రాక్షసుడు లాంటి ఒక పెద్ద సైనికుడు ఉన్నాడు. అతని పేరు గొల్యాతు. రోజూ గొల్యాతు ఇశ్రాయేలీయులను బాగా వెక్కిరిస్తున్నాడు. అతను ఇలా అరిచాడు: ‘నాతో యుద్ధం చేసే మగాడిని పంపించండి. అతను గెలిస్తే మేము మీకు బానిసలం అవుతాం, కానీ మేము గెలిస్తే మీరు మాకు బానిసలు అవ్వాలి.’

సైనికులైన తన అన్నలకు ఆహారం తీసుకుని దావీదు యుద్ధం జరిగే చోటుకు వెళ్లాడు. గొల్యాతు చెప్పింది విని దావీదు ఇలా అన్నాడు: ‘నేను అతనితో యుద్ధం చేయడానికి వెళ్తాను!’ కానీ రాజైన సౌలు ‘నువ్వు చిన్న పిల్లవాడివి’ అని అంటాడు. అప్పుడు దావీదు ‘యెహోవా నాకు సహాయం చేస్తాడు’ అని చెప్పాడు.

సౌలు తన కవచాన్ని దావీదుకు వేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ దావీదు ఇలా చెప్పాడు: ‘ఈ కవచంతో నేను యుద్ధం చేయలేను.’ దావీదు తన వడిసెలను అంటే రాళ్లను విసరడానికి వాడే తాడులాంటిదాన్ని తీసుకుని వాగు దగ్గరకు వెళ్లాడు. ఐదు నున్నని రాళ్లను ఏరుకుని సంచిలో వేసుకున్నాడు. తర్వాత దావీదు గొల్యాతు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఆ ఫిలిష్తీయుడు ఇలా అరిచాడు: ‘రా, పిల్లవాడా. నిన్ను ఆకాశ పక్షులకు, క్రూర జంతువులకు ఆహారంగా వేస్తాను.’ దావీదు భయపడలేదు. దావీదు కూడా గట్టిగా ఇలా అన్నాడు: ‘నువ్వు కత్తితో, ఈటెతో వస్తున్నావు, కానీ నేను యెహోవా పేరుతో వస్తున్నాను. నువ్వు మాతో యుద్ధం చేయట్లేదు, దేవునితో యుద్ధం చేస్తున్నావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కత్తి కన్నా, ఈటె కన్నా యెహోవా ఎంతో బలవంతుడు అని తెలుసుకుంటారు. ఆయన మీ అందర్నీ మాకు అప్పగిస్తాడు.’

దావీదు వడిసెలలో రాయిని పెట్టి తన శక్తినంతా ఉపయోగించి దానిని విసిరాడు. యెహోవా సహాయంతో, ఆ రాయి వెళ్లి గొల్యాతు నుదురు మీద తగిలింది. అంత పెద్ద రాక్షసుడి లాంటి వాడు కిందపడి చచ్చిపోయాడు. అప్పుడు ఫిలిష్తీయులు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు. దావీదులానే మీరు కూడా యెహోవా మీద నమ్మకం ఉంచుతారా?

“మనుషులకు ఇది అసాధ్యమే, కానీ దేవునికి అన్నీ సాధ్యం.”—మార్కు 10:27