కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 42

ధైర్యం, నమ్మకం చూపించిన యోనాతాను

ధైర్యం, నమ్మకం చూపించిన యోనాతాను

రాజైన సౌలు పెద్ద కొడుకు యోనాతాను ధైర్యంగల సైనికుడు. యోనాతాను పక్షిరాజు లేదా గద్ద కంటే వేగంగా, సింహం కంటే బలంగా ఉంటాడని దావీదు చెప్పాడు. ఒకరోజు పర్వతం మీద 20 మంది ఫిలిష్తీయ సైనికుల్ని యోనాతాను చూశాడు. యోనాతాను తన యుద్ధ ఆయుధాలు మోసే అతనితో, ‘వాళ్ల మీద దాడిచేయమని యెహోవా మనకు ఏదైన గుర్తు ఇస్తే అప్పుడే వెళ్దాం. ఫిలిష్తీయులు మనలను కొండమీదకు రమ్మని చెప్తే, అప్పుడు మనం వాళ్ల మీద దాడి చేద్దాం’ అని అన్నాడు. ఫిలిష్తీయులు, ‘వచ్చి మాతో పోరాడండి!’ అని అరిచారు. అప్పుడు ఆ ఇద్దరు కొండ మీదకు వెళ్లి ఆ సైనికులను ఓడిస్తారు.

యోనాతాను సౌలు పెద్ద కొడుకు కాబట్టి సౌలు తర్వాత అతనే రాజు అవ్వాల్సి ఉంది. కానీ సౌలు తర్వాత రాజుగా యెహోవా దావీదును ఎన్నుకున్నాడని తెలిసినా యోనాతాను కుళ్లుకోలేదు. యోనాతాను దావీదు మంచి స్నేహితులు అయ్యారు. వాళ్లు ఒకరిని ఒకరు కాపాడుకుంటామని, సహాయం చేసుకుంటామని ఒట్టు పెట్టుకున్నారు. స్నేహానికి గుర్తుగా యోనాతాను దావీదుకు తన సొంత కోటును, కత్తిని, విల్లును, బెల్టును ఇచ్చాడు.

దావీదు సౌలు నుండి పారిపోతున్నప్పుడు, యోనాతాను అతని దగ్గరకు వెళ్ళి: ‘ధైర్యంగా ఉండు భయపడకు. యెహోవా నిన్ను రాజుగా ఎన్నుకున్నాడు. అది మా నాన్నకు కూడా తెలుసు’ అని చెప్పాడు. యోనాతాను లాంటి మంచి స్నేహితుడు మీకు కూడా కావాలా?

యోనాతాను తన స్నేహితునికి సహాయం చేయడానికి ఒకటికన్నా ఎక్కువసార్లు ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకున్నాడు. రాజైన సౌలు దావీదును చంపాలని అనుకుంటున్నాడని యోనాతానుకి తెలుసు, అందుకే వాళ్ల నాన్నతో, ‘దావీదును చంపితే నువ్వు పాపం చేసినవాడివి అవుతావు; అతను ఏ తప్పు చేయలేదు’ అని చెప్పాడు. సౌలుకు యోనాతాను మీద చాలా కోపం వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత సౌలు, యోనాతాను ఇద్దరూ ఒకే యుద్ధంలో చనిపోయారు.

యోనాతాను చనిపోయాక, అతని కొడుకైన మెఫీబోషెతు కోసం దావీదు వెదికాడు. దావీదు అతన్ని కలిసినప్పుడు, ఇలా చెప్పాడు: ‘మీ నాన్న నాకు మంచి స్నేహితుడు కాబట్టి నువ్వు బ్రతికినంతకాలం నిన్ను నేనే చూసుకుంటాను. నువ్వు నా రాజభవనంలో ఉంటావు, నా బల్ల మీద భోజనం చేస్తావు.’ దావీదు తన స్నేహితుడు యోనాతానును ఎప్పుడూ మర్చిపోలేదు.

“నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, . . . స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కన్నా గొప్ప ప్రేమ లేదు.”—యోహాను 15:12, 13