కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 44

యెహోవాకు ఒక ఆలయం

యెహోవాకు ఒక ఆలయం

సొలొమోను ఇశ్రాయేలుకు రాజు అయిన తర్వాత యెహోవా అతన్ని, ‘నీకు ఏం కావాలి?’ అని అడుగుతాడు. సొలొమోను, ‘నేను చిన్నవాడిని, నేను ఏమి చేయాలో నాకు తెలీదు. నీ ప్రజలను చూసుకోవడానికి కావాల్సిన తెలివిని ఇవ్వు’ అని అడుగుతాడు. యెహోవా ఇలా అంటాడు: ‘తెలివిని ఇవ్వమని నువ్వు అడిగావు కాబట్టి అందరికన్నా నిన్ను తెలివైన వాడిని చేస్తాను. నీకు చాలా ధనాన్ని కూడా ఇస్తాను. నువ్వు నా మాట వింటే ఎక్కువ కాలం బ్రతుకుతావు.’

సొలొమోను ఆలయాన్ని కట్టడం మొదలుపెడతాడు. మంచి బంగారం, వెండి, చెక్క, రాళ్లు ఉపయోగిస్తాడు. పని బాగా తెలిసిన వేలమంది పురుషులు, స్త్రీలు ఆలయాన్ని కడతారు. ఏడు సంవత్సరాల తర్వాత ఆలయం యెహోవాకు సమర్పించబడుతుంది. దానిలో ఒక బలిపీఠం ఉంది, అక్కడ బలులు అర్పించబడేవి. బలిపీఠం ముందు సొలొమోను మోకరించి ఇలా ప్రార్థిస్తాడు: ‘యెహోవా, ఈ ఆలయం నీకు సరిపోయేంత పెద్దది కాదు, అందమైనది కాదు, కానీ దయచేసి మా ఆరాధనను అంగీకరించి, మా ప్రార్థనలు విను.’ ఆలయాన్ని, సొలొమోను చేసిన ప్రార్థనను యెహోవా ఎలా చూశాడు? సొలొమోను తన ప్రార్థనను పూర్తిచేసిన వెంటనే, ఆకాశం నుండి మంట వచ్చి అక్కడ అర్పించిన బలులను కాల్చేస్తుంది. యెహోవా ఆ ఆలయాన్ని అంగీకరించాడు. ఇశ్రాయేలీయులు దాన్ని చూసి సంతోషిస్తారు.

రాజైన సొలొమోనుకు ఎంతో జ్ఞానం ఉందని ఇశ్రాయేలీయులకు, దూర దేశాల వాళ్లకు కూడా తెలుస్తుంది. సమస్యలను తీర్చమని ప్రజలు సొలొమోను దగ్గరకు వచ్చేవాళ్లు. చివరికి షేబదేశపు రాణి కూడా సొలొమోనును పరీక్షించడానికి వచ్చి కష్టమైన ప్రశ్నలు అడుగుతుంది. అతను ఇచ్చిన జవాబులు విని, ‘ప్రజలు నీ గురించి చెప్తే నేను నమ్మలేకపోయాను, ఇప్పుడు స్వయంగా వచ్చి చూశాక వాళ్లు చెప్పిన దానికన్నా నువ్వు చాలా తెలివైన వాడివని నేను తెలుసుకున్నాను. నీ దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించాడు’ అని చెప్పింది. ఇశ్రాయేలీయుల జీవితం హాయిగా గడుస్తుంది, అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు.

“ఇదిగో! సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.”—మత్తయి 12:42