కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 45

రాజ్యం విడిపోయింది

రాజ్యం విడిపోయింది

సొలొమోను యెహోవాను ఆరాధించినంతకాలం ఇశ్రాయేలు దేశం ప్రశాంతంగా ఉంది. కానీ సొలొమోను చాలామంది వేరే దేశాల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లు విగ్రహాలను ఆరాధించేవాళ్లు. మెల్లమెల్లగా సొలొమోను మారిపోయి విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టాడు. యెహోవాకు కోపం వచ్చింది. అతను సొలొమోనుతో, ‘ఇశ్రాయేలు నీ కుటుంబం నుండి తీసివేయబడి రెండు భాగాలుగా విడిపోతుంది. అందులో పెద్ద భాగాన్ని నీ సేవకుల్లో ఒకరికి ఇస్తాను, నీ కుటుంబం కొంత భాగాన్ని మాత్రమే పరిపాలిస్తుంది’ అని చెప్పాడు.

యెహోవా తన నిర్ణయాన్ని మరోలా కూడా స్పష్టం చేశాడు. సొలొమోను సేవకుల్లో ఒకరైన యరొబాము ప్రయాణిస్తున్నప్పుడు దారిలో అహీయా ప్రవక్త ఆయనను కలుస్తాడు. అహీయా తన అంగీని 12 ముక్కలు చేసి యరొబాముతో ఇలా చెప్తాడు: ‘యెహోవా ఇశ్రాయేలు దేశాన్ని సొలొమోను కుటుంబం నుండి తీసేసి రెండు భాగాలు చేస్తాడు. ఈ అంగీలో 10 ముక్కలు నువ్వు తీసుకో ఎందుకంటే 10 గోత్రాలకు నువ్వే రాజు అవుతావు.’ రాజైన సొలొమోనుకు ఈ విషయం తెలిసినప్పుడు యరొబామును చంపాలని చూస్తాడు. అందుకే యరొబాము ఐగుప్తుకు పారిపోతాడు. ఈలోగా సొలొమోను చనిపోతాడు, అతని కొడుకు రెహబాము రాజు అవుతాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకు తిరిగి వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని యరొబాము అనుకుంటాడు.

ఇశ్రాయేలు పెద్దలు రెహబాముతో, ‘నువ్వు ప్రజలను బాగా చూసుకుంటే వాళ్లు నీకు నమ్మకంగా ఉంటారు’ అని చెప్పారు. కానీ చిన్నవాళ్లు అయిన రెహబాము తోటి స్నేహితులు, ‘నువ్వు ప్రజలతో కఠినంగా ఉండు! వాళ్లకు ఇంకా కష్టమైన పనులు ఇవ్వు!’ అని చెప్తారు. రెహబాము తన స్నేహితుల మాట వింటాడు. అతను ప్రజలతో కఠినంగా ఉంటాడు. అప్పుడు పది గోత్రాలవాళ్లు ఆయనకు ఎదురు తిరిగి యరొబామును రాజును చేస్తారు. దాన్ని వాళ్లు ఇశ్రాయేలు రాజ్యం అని పిలుస్తారు. మిగతా రెండు గోత్రాలను యూదా రాజ్యం అని పిలుస్తారు, ఆ రెండు గోత్రాలవాళ్లు రెహబాముకు నమ్మకంగా ఉన్నారు. ఇలా ఇశ్రాయేలు 12 గోత్రాలు విడిపోయాయి.

తన ప్రజలు రెహబాము రాజ్యంలో ఉన్న యెరూషలేముకు వెళ్లి ఆరాధించడం యరొబాముకు ఇష్టం లేదు. ఎందుకో మీకు తెలుసా? ప్రజలు యరొబాముకు ఎదురు తిరిగి రెహబాము వైపు వెళ్లిపోతారని అతను భయపడ్డాడు. కాబట్టి ఆయన రెండు బంగారు దూడలు చేసి ప్రజలతో ఇలా చెప్పాడు: ‘యెరూషలేము చాలా దూరంలో ఉంది కాబట్టి మీరు ఇక్కడే ఆరాధించండి.’ ప్రజలు బంగారు దూడలను ఆరాధించడం మొదలుపెట్టి మళ్లీ యెహోవాను మర్చిపోయారు.

“అవిశ్వాసులతో జతకట్టకండి. నీతికి, అవినీతికి ఏమైనా పొత్తు ఉంటుందా? . . . విశ్వాసికి, అవిశ్వాసికి ఏమైనా పోలిక ఉంటుందా?”—2 కొరింథీయులు 6:14, 15