కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 46

కర్మెలు పర్వతం మీద పరీక్ష

కర్మెలు పర్వతం మీద పరీక్ష

ఇశ్రాయేలు పది గోత్రాల రాజ్యాన్ని చాలామంది చెడ్డ రాజులు పరిపాలించారు, వాళ్లలో ఆహాబు బాగా చెడ్డవాడు. ఆయన బయలును ఆరాధించే దుష్ట స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు యెజెబెలు. ఆహాబు, యెజెబెలు బయలు ఆరాధనతో దేశాన్ని నింపేసి యెహోవా ప్రవక్తలను చంపేశారు. యెహోవా ఏమి చేశాడు? ఆయన ప్రవక్త అయిన ఏలీయాతో ఆహాబుకు ఒక సందేశాన్ని పంపించాడు.

నీ చెడుతనం వల్ల ఇశ్రాయేలులో వర్షాలు ఉండవని ఏలీయా రాజైన ఆహాబుతో చెప్పాడు. మూడు సంవత్సరాలు పంటలు పండక ప్రజలు ఆకలితో బాధపడ్డారు. తర్వాత యెహోవా ఏలీయాను మళ్లీ ఆహాబు దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు రాజు, ‘నువ్వు ఎప్పుడూ సమస్యలు తీసుకొస్తావు! ఇదంతా నీ తప్పే’ అని అంటాడు. ఏలీయా ‘వర్షం రాకపోవడానికి కారణం నేను కాదు. నువ్వు బయలు ఆరాధన చేయడం వల్లే ఇలా జరిగింది. ఒక పని చేద్దాం. నువ్వు ప్రజలను, బయలు ప్రవక్తలను కర్మెలు కొండ పైకి తీసుకురా’ అని చెబుతాడు.

ప్రజలు కొండ పైకి వచ్చారు. ఏలీయా ఇలా చెప్పాడు: ‘ఈరోజు మీరు ఒక నిర్ణయానికి రండి. యెహోవా నిజమైన దేవుడైతే ఆయనను ఆరాధించండి. బయలు అయితే బయలును ఆరాధించండి. నేను మీ ముందు ఈ సవాలు చేస్తున్నాను. 450 బయలు ప్రవక్తలు అర్పణను సిద్ధం చేసి వాళ్ల దేవుడిని పిలవాలి, నేను నా అర్పణను సిద్ధం చేసి యెహోవాను పిలుస్తాను. అగ్ని ద్వారా ఏ దేవుడు సమాధానం ఇస్తాడో అతనే నిజమైన దేవుడు.’ ప్రజలు దానికి ఒప్పుకున్నారు.

బయలు ప్రవక్తలు అర్పణను సిద్ధం చేశారు. రోజంతా వాళ్ల దేవుడిని ఇలా పిలిచారు: ‘ఓ బయలా! సమాధానం ఇవ్వు!’ బయలు వాళ్లకు సమాధానం ఇవ్వనప్పుడు, ఏలీయా బయలును ఎగతాళి చేస్తాడు. ఆయన ఇలా అంటాడు: ‘మీరు పిలవగలిగినంత గట్టిగా పిలవండి. ఆయన నిద్రపోతున్నాడేమో, ఎవరైన ఆయనిని నిద్ర లేపాలేమో.’ సాయంత్రం అయిపోయింది, బయలు ప్రవక్తలు ఇంకా పిలుస్తూ ఉన్నారు. కానీ వాళ్లకు ఏ సమాధానం రాలేదు.

ఏలీయా తన అర్పణను బలిపీఠం మీద పెట్టి, దానిమీదంతా నీళ్లు పోశాడు. తర్వాత ఇలా ప్రార్థన చేశాడు: ‘ఓ యెహోవా, ఈ ప్రజలు నువ్వే నిజమైన దేవుడని తెలుసుకునేలా చెయ్యి.’ వెంటనే, యెహోవా ఆకాశం నుండి అగ్నిని పంపించి ఆ అర్పణను కాల్చేస్తాడు. ప్రజలు ఇలా అరుస్తారు: ‘యెహోవాయే నిజమైన దేవుడు!’ ఏలీయా ఇలా చెప్తాడు: ‘బయలు ప్రవక్తల్లో ఒక్కర్ని కూడా తప్పించుకోనివ్వకండి!’ ఆ రోజు 450 బయలు ప్రవక్తలను చంపేశారు.

ఒక చిన్న మేఘం సముద్రం మీద కనిపించినప్పుడు ఏలీయా ఆహాబుతో ఇలా చెప్పాడు: ‘గాలివాన రాబోతుంది. నీ రథాన్ని సిద్ధం చేసుకుని ఇంటికి వెళ్లు.’ ఆకాశం మేఘాల వల్ల నల్లగా మారింది, గాలి వీస్తుంది, పెద్ద వర్షం కురవడం మొదలైంది. చివరికి, కరువు ఆగిపోయింది. ఆహాబు చాలా వేగంగా రథాన్ని నడిపాడు. కానీ యెహోవా సహాయంతో ఏలీయా రథం కన్నా ముందు పరిగెత్తాడు! అయితే ఏలీయా సమస్యలన్నీ అక్కడితో ఆగిపోయాయా? చూద్దాం.

“యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.”—కీర్తన 83:18