కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 48

ఒక విధవరాలి కొడుకు మళ్లీ బ్రతుకుతాడు

ఒక విధవరాలి కొడుకు మళ్లీ బ్రతుకుతాడు

కరువు సమయంలో, యెహోవా ఏలీయాతో ఇలా చెప్పాడు: ‘సారెపతుకు వెళ్లు. అక్కడ ఒక విధవరాలు నీకు ఆహారం పెడుతుంది.’ పట్టణ ద్వారాల దగ్గర, ఏలీయా ఒక బీద విధవరాలు కట్టెలు ఏరుకోవడం చూస్తాడు. ఆయన ఆమెను కొద్దిగా నీళ్లు ఇవ్వమని అడుగుతాడు. ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తుండగా ఏలీయా ఆమెతో, ‘దయచేసి, ఒక రొట్టె ముక్కను నాకు తీసుకుని రా’ అని చెప్తాడు. కానీ విధవరాలు ఇలా అంటోంది: ‘నీకు ఇవ్వడానికి నా దగ్గర రొట్టె లేదు. నేను, నా కొడుకు తినడానికి కొంచెం పిండి, నూనె మాత్రమే ఉన్నాయి.’ ఏలీయా ఆమెతో, ‘నా కోసం దానితో రొట్టె చేస్తే, కరువు ఆగిపోయే వరకు నీ పిండి, నీ నూనె అయిపోదని యెహోవా మాట ఇస్తున్నాడు’ అని అంటాడు.

అప్పుడు విధవరాలు ఇంటికి వెళ్లి యెహోవా ప్రవక్త కోసం రొట్టె చేస్తుంది. యెహోవా మాట ఇచ్చినట్లు కరువు ఆగిపోయేంత వరకు ఆ విధవరాలికి, ఆమె కొడుకుకు సరిపడా ఆహారం ఉంది. ఆమె దగ్గరున్న పిండి, నూనె అయిపోలేదు.

ఆ తర్వాత విషాదకరమైన ఒక సంఘటన జరిగింది. విధవరాలి కొడుకు జబ్బు చేసి చనిపోయాడు. అప్పుడు ఏలీయాను సహాయం చేయమని ఆమె అడిగింది. ఏలీయా ఆ బాబుని ఆమె చేతుల్లో నుండి తీసుకుని ఆమె ఇంట్లో మేడపైన గదికి తీసుకెళ్లాడు. మంచం మీద అతనిని పడుకోబెట్టి ఇలా ప్రార్థించాడు: ‘యెహోవా ప్లీజ్‌, ఈ చిన్న బాబును మళ్లీ బ్రతికించు.’ యెహోవా ఆ బాబును బ్రతికించడం చాలా గొప్ప విషయం. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే మనకు తెలిసిన దాన్నిబట్టి అప్పటివరకు చనిపోయిన వాళ్లు ఎవరూ మళ్లీ బ్రతకలేదు. పైగా ఆ విధవరాలు, ఆమె కొడుకు ఇశ్రాయేలీయులు కూడా కాదు.

బాబు మళ్లీ బ్రతికి, ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాడు! ఏలీయా ఆ విధవరాలితో ఇలా చెప్పాడు: ‘చూడు! నీ కొడుకు బ్రతికాడు.’ ఆమె ఎంతో ఆనందించి ఏలీయాతో ఇలా అంది: ‘నువ్వు నిజంగా దేవుని సేవకుడివి. ఎందుకంటే, యెహోవా చెప్పిందే నువ్వు చెప్తావు.’

“కాకుల్ని గమనించండి: అవి విత్తవు, కోయవు; వాటికి గోదాములు ఉండవు; అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కన్నా ఇంకెంతో విలువైనవాళ్లు కారా?”—లూకా 12:24