కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 51

ఒక సైన్యాధికారి, ఒక చిన్న పాప

ఒక సైన్యాధికారి, ఒక చిన్న పాప

ఇశ్రాయేలీయురాలైన ఒక చిన్న పాప, ఇంటికి చాలా దూరంలో సిరియా దేశంలో ఉంది. సిరియా సైన్యం ఆమె కుటుంబం దగ్గరనుండి ఆ పాపను తీసుకెళ్లి పోయింది. ఇప్పుడు ఆమె సైనిక అధికారియైన నయమాను భార్యకు పనిమనిషిగా ఉంది. ఆమె చుట్టూ ఉన్నవాళ్లు యెహోవాను ఆరాధించకపోయినా ఆ పాప యెహోవాకే ఆరాధన చేసేది.

నయమానుకు ఒక భయంకరమైన చర్మవ్యాధి ఉంది. ఆయన ఎప్పుడూ నొప్పితో బాధపడేవాడు. ఆయనకు సహాయం చేయాలని ఆ చిన్న పాపకు బాగా అనిపించింది. ఆ పాప నయమాను భార్యతో ఇలా అంది: ‘మీ భర్తను బాగు చేయగలిగే ఒకరి గురించి నాకు తెలుసు. ఇశ్రాయేలులో ఎలీషా అనే ఒకతను ఉన్నాడు. ఆయన యెహోవా ప్రవక్త. ఆయన మీ భర్తను బాగు చేయగలడు.’

నయమాను భార్య ఆ చిన్న పాప చెప్పిన దాన్ని నయమానుకు చెప్పింది. జబ్బు తగ్గడానికి ఆయన ఏదైనా చేయాలని అనుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలులో ఎలీషా ఇంటికి వెళ్లాడు. ఎలీషా అతన్ని ఒక ముఖ్యమైన వ్యక్తిగా చూస్తాడని అనుకున్నాడు. కానీ అతనితో నేరుగా మాట్లాడకుండా నయమానును పలకరించడానికి ఎలీషా తన సేవకున్ని పంపించి ఈ సందేశాన్ని ఇచ్చాడు: ‘వెళ్లి, యొర్దాను నదిలో ఏడుసార్లు స్నానం చేయి. అప్పుడు నువ్వు బాగవుతావు.’

నయమాను చాలా నిరాశపడిపోయాడు. ఆయన ఇలా అన్నాడు: ‘ఈ ప్రవక్త తన దేవున్ని పిలుస్తూ నా పై చేతులు ఊపుతూ నన్ను బాగు చేస్తాడు అనుకున్నాను. కానీ, ఆయన ఇశ్రాయేలులో ఉన్న ఈ నదికి వెళ్లమంటున్నాడు. సిరియాలో ఎన్నో మంచి నదులు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్లలేనా?’ నయమానుకు కోపం వచ్చి ఎలీషా ఇంటి నుండి వెళ్లిపోయాడు.

నయమాను సరిగ్గా ఆలోచించడానికి అతని సేవకులు సహాయం చేశారు. వాళ్లు ఆయనతో ఇలా అన్నారు: ‘బాగవ్వడానికి మీరు ఏదైనా చేస్తారు కదా? ఈ ప్రవక్త చెప్పినది చాలా చిన్న పనే కదా? ఒకసారి చేసి చూడండి.’ నయమాను వాళ్ల మాట విన్నాడు. ఆయన యొర్దాను నదికి వెళ్లి ఏడుసార్లు నీళ్లలో మునిగాడు. ఏడవసారి నయమాను నీళ్లలో నుండి బయటికి వచ్చినప్పుడు పూర్తిగా నయమైపోయాడు. ఎంతో కృతజ్ఞతతో నిండిపోయి ఆయన ఎలీషాకు థ్యాంక్స్‌ చెప్పడానికి తిరిగి అతని దగ్గరికి వెళ్లాడు. నయమాను ఇలా అన్నాడు: ‘యెహోవాయే నిజమైన దేవుడని నాకు ఇప్పుడు తెలుసు.’ నయమాను బాగైపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ చిన్న ఇశ్రాయేలు పాపకు ఎలా అనిపించి ఉంటుందో ఆలోచించండి.

“పిల్లలు, చంటిబిడ్డలు నిన్ను స్తుతించేలా చేశావు.”—మత్తయి 21:16