కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 54

యెహోవా యోనాతో ఓపికగా ఉన్నాడు

యెహోవా యోనాతో ఓపికగా ఉన్నాడు

అష్షూరు నగరమైన నీనెవెలో ప్రజలు చాలా చెడ్డవాళ్లు. యెహోవా తన ప్రవక్త యోనాను నీనెవెకు వెళ్లి వాళ్ల పనులు మార్చుకోవాలని హెచ్చరించమంటాడు. కానీ యోనా వేరే దారిలో పారిపోతాడు. ఆయన తర్షీషుకు వెళ్లే ఓడ ఎక్కి వెళ్లిపోతాడు.

ఓడ సముద్రంలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. ఓడ నడిపే నావికులు చాలా భయపడిపోయారు. వాళ్లు వాళ్ల దేవుళ్లకు ప్రార్థన చేసి ఇలా అడిగారు: ‘ఇలా ఎందుకు జరుగుతుంది?’ చివరికి, యోనా వాళ్లతో ‘దీనికి కారణం నేనే. నేను యెహోవా చెప్పింది చేయకుండా పారిపోతున్నాను. నన్ను సముద్రంలో పడేయండి అప్పుడు తుఫాను ఆగిపోతుంది’ అన్నాడు. నావికులకు యోనాను పడేయడం ఇష్టంలేదు కానీ ఆయన వాళ్లను బలవంతపెట్టాడు. దాంతో వాళ్లు ఆయనను సముద్రంలో పడేయగానే తుఫాను ఆగిపోయింది.

యోనా చనిపోతాడని అనుకున్నాడు. సముద్రంలో బాగా లోతులోకి వెళ్లిపోతున్నప్పుడు యెహోవాకు ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఒక పెద్ద చేపను పంపించాడు. అది యోనాను మింగేసింది. కానీ దానివల్ల ఆయన చనిపోలేదు. చేప లోపల నుండి యోనా ఇలా ప్రార్థన చేశాడు: ‘నేను ఎప్పుడూ నీ మాట వింటాను.’ యెహోవా యోనాను చేప లోపల మూడు రోజులు సురక్షితంగా ఉంచాడు, తర్వాత యోనాను చేప పొడినేలపై కక్కేలా చేశాడు.

యెహోవా యోనాను కాపాడాడు కాబట్టి ఆయన నీనెవెకు వెళ్లాల్సిన అవసరం లేదా? కాదు. యెహోవా మళ్లీ యోనాకు అక్కడికి వెళ్లమని చెప్పాడు. ఈసారి యోనా మాట విన్నాడు. ఆయన అక్కడికి వెళ్లి, ఆ చెడ్డ ప్రజలతో ఇలా అన్నాడు: ‘40 రోజుల్లో నీనెవె నాశనం అవుతుంది.’ అప్పుడు ఊహించని ఒక విషయం జరిగింది. నీనెవెవాళ్లు విని వాళ్ల పనులు మార్చుకున్నారు. నీనెవె రాజు తన ప్రజలతో ఇలా అన్నాడు: ‘దేవునికి ప్రార్థించండి, పశ్చాత్తాపపడండి. ఆయన మనల్ని నాశనం చేయడేమో.’ ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని లేదా తప్పుల విషయంలో బాధపడుతున్నారని యెహోవా చూసినప్పుడు నీనెవెను నాశనం చేయలేదు.

ఆ పట్టణం నాశనం కాలేదని యోనాకు చాలా కోపం వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి: యోనాతో యెహోవా చాలా ఓపికగా ఉన్నాడు, కనికరం చూపించాడు కానీ యోనా మాత్రం నీనెవె ప్రజల విషయంలో కనికరంతో లేడు. ఆయన అలిగి పట్టణం బయట సొర చెట్టు నీడలో కూర్చున్నాడు. తర్వాత ఆ చెట్టు చచ్చిపోయింది, అప్పుడు యోనాకు చాలా కోపం వచ్చింది. యెహోవా ఆయనతో ఇలా అన్నాడు: ‘నీనెవె వాళ్లకన్నా నువ్వు ఈ చెట్టు గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నేను వాళ్లకు కనికరం చూపించాను, వాళ్లు బ్రతికారు.’ ఆ మాటల అర్థం ఏంటి? ఏ చెట్టు కన్నా నీనెవె ప్రజలే ఎక్కువ ముఖ్యం.

“యెహోవా . . . మీ విషయంలో ఆయన ఓర్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నాశనం కావడం ఆయనకు ఇష్టంలేదు, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని ఆయన కోరుకుంటున్నాడు.”—2 పేతురు 3:9