కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 55

యెహోవా దేవదూత హిజ్కియాను కాపాడాడు

యెహోవా దేవదూత హిజ్కియాను కాపాడాడు

ఇశ్రాయేలు పది గోత్రాల రాజ్యాన్ని అష్షూరు రాజ్యం ఆక్రమించేసుకుంది. ఇప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు రెండు గోత్రాల యూదా రాజ్యాన్ని కూడా తీసేసుకోవాలని అనుకుంటున్నాడు. అతను యూదాలో ఉన్న పట్టణాల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆక్రమించుకుంటూ వస్తున్నాడు. అతనికి ముఖ్యంగా యెరూషలేము కావాలి. అయితే సన్హెరీబుకు తెలియని విషయం ఏంటంటే యెహోవా యెరూషలేమును కాపాడుతున్నాడు.

సన్హెరీబు యెరూషలేము వైపు రాకుండా యూదా రాజైన హిజ్కియా అతనికి చాలా డబ్బు ఇచ్చాడు. సన్హెరీబు డబ్బు తీసుకున్నాడు. అయినా తన పెద్ద సైన్యాన్ని యెరూషలేము మీద దాడి చేయడానికి పంపించాడు. అష్షూరీయులు దగ్గరికి వచ్చే కొద్ది పట్టణంలో ఉన్న ప్రజలు భయపడ్డారు. అప్పుడు హిజ్కియా వాళ్లతో ఇలా అన్నాడు: ‘భయపడకండి. అష్షూరీయులు బలవంతులే కాని వాళ్లకన్నా ఎక్కువ బలాన్ని యెహోవా మనకు ఇస్తాడు.’

ప్రజల్ని వెక్కిరించడానికి సన్హెరీబు రబ్షాకే అనే తన సందేశకున్ని యెరూషలేముకు పంపించాడు. రబ్షాకే పట్టణం బయట నిలబడి ఇలా అరిచాడు: ‘యెహోవా మీకు సహాయం చేయలేడు. హిజ్కియా చేతిలో మోసపోకండి. మా నుండి మిమ్మల్ని కాపాడే దేవుడు ఎవ్వరూ లేరు.’

హిజ్కియా ఏం చేయాలో యెహోవాను అడిగాడు. యెహోవా ఇలా జవాబిచ్చాడు: ‘రబ్షాకే చెప్పినదాన్నిబట్టి భయపడవద్దు. సన్హెరీబు యెరూషలేమును ఓడించడు.’ తర్వాత సన్హెరీబు హిజ్కియాకు కొన్ని ఉత్తరాలు పంపించాడు. ఆ ఉత్తరాల్లో ఇలా ఉంది: ‘లోంగిపోండి. యెహోవా మిమ్మల్ని కాపాడలేడు.’ హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: ‘ప్లీజ్‌ యెహోవా, మమ్మల్ని కాపాడు. అప్పుడు నువ్వు మాత్రమే నిజమైన దేవుడవని అందరూ తెలుసుకుంటారు.’ యెహోవా ఆయనతో ఇలా అన్నాడు: ‘అష్షూరు రాజు యెరూషలేములోకి రాడు. నా పట్టణాన్ని నేను కాపాడతాను.’

యెరూషలేమును ఖచ్చితంగా ఓడిస్తాడని సన్హెరీబు అనుకున్నాడు. కానీ ఒకరోజు రాత్రి, పట్టణం బయట ఉంటున్న సైనికుల దగ్గరకు యెహోవా ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత 1,85,000 సైనికుల్ని చంపేశాడు. సన్హెరీబు రాజు తన బలవంతులైన సైనికులను కోల్పోయాడు. తలదించుకుని ఇంటికి వెళ్లిపోవడం తప్ప అతనికి వేరే దారి లేదు. హిజ్కియాను, యెరూషలేమును యెహోవా మాటిచ్చినట్లే కాపాడాడు. మీరు యెరూషలేములో ఉండి ఉంటే యెహోవాను నమ్మి ఉండేవాళ్లా?

“యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును.”—కీర్తన 34:7