కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 56

యోషీయా దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు

యోషీయా దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు

యోషీయాకు ఎనిమిది సంవత్సరాలప్పుడు యూదాకు రాజు అయ్యాడు. అప్పుడు ప్రజలు ఇంద్రజాలం లేదా మ్యాజిక్‌ చేసేవాళ్లు, విగ్రహాల్ని ఆరాధించేవాళ్లు. యోషీయాకు 16 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన యెహోవాను సరైన విధంగా ఎలా ఆరాధించాలో నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. 20 సంవత్సరాలు వచ్చినప్పుడు దేశంలో ఉన్న విగ్రహాల్ని, బలిపీఠాల్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు. 26 సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా ఆలయాన్ని బాగు చేయించడానికి ఏర్పాట్లు చేశాడు.

ఆలయంలో ప్రధాన యాజకుడైన హిల్కీయాకు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథపు చుట్ట దొరికింది. ఈ గ్రంథపు చుట్ట మోషే రాసిందే అయ్యుండవచ్చు. రాజు కార్యదర్శి అయిన షాఫాను యోషీయా దగ్గరకు ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి ధర్మశాస్త్రాన్ని గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. యోషీయా దాన్ని వింటున్నప్పుడు ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి యెహోవా మాట వినడం మానేశారని అర్థం చేసుకున్నాడు. యోషీయా రాజు హిల్కీయాతో ఇలా అన్నాడు: ‘యెహోవాకు మనపై చాలా కోపం ఉంది. వెళ్లి ఆయనతో మాట్లాడండి. అప్పుడు మనం ఏం చేయాలో యెహోవా మనకు చెప్తాడు.’ హుల్దా ప్రవక్త్రిని ద్వారా యెహోవా వాళ్లకు జవాబిచ్చాడు: ‘యూదా ప్రజలు నన్ను విడిచిపెట్టారు. వాళ్లకు శిక్ష పడుతుంది కానీ యోషీయా రాజుగా ఉన్నప్పుడు కాదు ఎందుకంటే ఆయన తనను తాను తగ్గించుకున్నాడు.’

యోషీయా రాజు ఈ జవాబు విన్నప్పుడు, ఆలయానికి వెళ్లి యూదా ప్రజలందరినీ పిలిచాడు. దేశ ప్రజల అందరి ముందు యెహోవా ధర్మశాస్త్రాన్ని చదివాడు. యోషీయాతో కలిసి ప్రజలందరూ నిండు హృదయాలతో యెహోవాకు లోబడతారని మాటిచ్చారు.

చాలా సంవత్సరాలుగా యూదా దేశం పస్కా పండుగ చేసుకోలేదు. అయితే ప్రతీ సంవత్సరం పస్కా ఆచరించాలని ధర్మశాస్త్రంలో చదివినప్పుడు, యోషీయా ప్రజలందరితో ఇలా అన్నాడు: ‘మనం యెహోవాకు పస్కా ఏర్పాటు చేద్దాం.’ యోషీయా చాలా బలుల్ని, ఆలయంలో పాడడానికి గాయకుల గుంపుని ఏర్పాటు చేశాడు. అప్పుడు దేశమంతా పస్కా పండుగను, ఆ తర్వాత ఏడు రోజులు పులియని రొట్టెల పండుగను చేసుకున్నారు. సమూయేలు కాలం తర్వాత పస్కాను ఇంత గొప్పగా ఎప్పుడూ చేయలేదు. యోషీయాకు దేవుని ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం. మీకూ యెహోవా గురించి నేర్చుకోవడం ఇష్టమేనా?

“నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.”—కీర్తన 119:105