కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 57

యెహోవా యిర్మీయాను ప్రకటించడానికి పంపిస్తాడు

యెహోవా యిర్మీయాను ప్రకటించడానికి పంపిస్తాడు

యెహోవా యిర్మీయాను యూదా ప్రజలకు ప్రవక్తగా నియమిస్తాడు. ప్రజలకు ప్రకటించమని, చెడుపనులు ఆపేయాలని హెచ్చరించమని యెహోవా యిర్మీయాతో చెప్తాడు. యిర్మీయా ఇలా అన్నాడు: ‘కానీ యెహోవా నేను ఇంకా చిన్నవాడినే. నాకు ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలియదు.’ యెహోవా అతనితో, ‘భయపడకు. నువ్వు ఏమి మాట్లాడాలో నేను నీకు చెప్తాను. నీకు సహాయం చేస్తాను’ అన్నాడు.

ప్రజల పెద్దలందరినీ ఒక చోట చేర్చి, వాళ్ల ముందు ఒక మట్టి కుండను పగులగొట్టమని యెహోవా యిర్మీయాతో చెప్పాడు. తర్వాత యెహోవా ఇలా చెప్పమన్నాడు: ‘యెరూషలేము కూడా ఇలానే ముక్కలు అవుతుంది.’ యిర్మీయా యెహోవా చెప్పింది చేసినప్పుడు పెద్దలకి చాలా కోపం వచ్చింది. పషూరు అనే యాజకుడు యిర్మీయాను కొట్టి చెక్క బొండలో పెడతాడు. రాత్రంతా యిర్మీయా కదలలేకపోతాడు. తర్వాత రోజు పొద్దున పషూరు యిర్మీయాను వదిలేస్తాడు. యిర్మీయా అప్పుడు, ‘ఇంక నావల్ల కాదు. నేను ఇంక ప్రకటించడం ఆపేస్తాను’ అని అంటాడు. కానీ నిజంగానే ఆపేస్తాడా? లేదు. యిర్మీయా దాని గురించి ఇంకొంచెం ఆలోచించాక ఇలా అన్నాడు: ‘యెహోవా సందేశం నా లోపల అగ్నిలా మండుతుంది. నేను ప్రకటించడం ఆపలేను.’ యిర్మీయా ప్రజలకు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు.

సంవత్సరాలు గడిచాయి, యూదాకు కొత్త రాజు వచ్చాడు. యాజకులకు, దొంగ ప్రవక్తలకు యిర్మీయా చెప్పే విషయాలు అస్సలు నచ్చలేదు. వాళ్లు అధిపతులతో, ‘ఇతన్ని చంపేయాలి’ అని చెప్పారు. యిర్మీయా ఇలా చెప్పాడు: ‘మీరు నన్ను చంపేస్తే ఒక అమాయకున్ని చంపినట్టు అవుతుంది. నేను యెహోవా మాటల్ని చెప్తాను నా సొంత మాటల్ని కాదు.’ అది విని అధిపతులు ఇలా అన్నారు: ‘ఇతన్ని చంపడానికి ఏ కారణం లేదు.’

యిర్మీయా ప్రకటిస్తూనే ఉన్నాడు కాబట్టి అధిపతులకు చాలా కోపం వచ్చింది. వాళ్లు యిర్మీయాను చంపేయమని రాజుని అడిగారు. యిర్మీయాను వాళ్లకు ఇష్టమొచ్చినట్లు చేసుకోమని ఆ రాజు చెప్పాడు. వాళ్లు యిర్మీయాను తీసుకెళ్లి బాగా లోతుగా ఉన్న ఒక బురద గుంట లేదా బావిలో పడేశారు. ఆయన అందులో చనిపోతాడని వాళ్లు అనుకున్నారు. యిర్మీయా బురదలో కూరుకుపోతూ ఉన్నాడు.

అప్పుడు రాజు దగ్గర పనిచేసే ఎబెద్మెలెకు అనే అధికారి రాజుతో ఇలా చెప్పాడు: ‘అధిపతులు యిర్మీయాను బావిలో పడేశారు. అతన్ని అలాగే వదిలేస్తే అక్కడే చచ్చిపోతాడు.’ అప్పుడు 30 మందిని తీసుకుని వెళ్లి యిర్మీయాను ఆ బావిలో నుండి బయటకు లాగమని ఎబెద్మెలెకుకు రాజు ఆజ్ఞ ఇస్తాడు. మనం కూడా యిర్మీయాలా ఏది వచ్చినా ప్రీచింగ్‌ ఆపకుండా ఉండాలి కదా?

“మీరు నా శిష్యులుగా ఉన్నందువల్ల ప్రజలందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు, కానీ అంతం వరకు సహించిన వాళ్లే రక్షించబడతారు.”—మత్తయి 10:22