కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 58

యెరూషలేము నాశనం అవుతుంది

యెరూషలేము నాశనం అవుతుంది

యూదా ప్రజలు మళ్లీమళ్లీ యెహోవాను వదిలేసి అబద్ధ దేవుళ్లను ఆరాధించారు. చాలా సంవత్సరాలు యెహోవా వాళ్లను మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వాళ్లను హెచ్చరించడానికి చాలామంది ప్రవక్తలను పంపిస్తూనే ఉన్నాడు. కానీ వాళ్లు వినలేదు. పైగా వాళ్లు ఆ ప్రవక్తలను ఎగతాళి చేశారు. యెహోవా ఈ విగ్రహారాధనని ఎలా ఆపేశాడు?

బబులోను రాజైన నెబుకద్నెజరు దేశం తర్వాత దేశాన్ని ఓడిస్తూ ఉన్నాడు. ఆయన మొదటిసారి యెరూషలేమును ఓడించినప్పుడు రాజైన యెహోయాకీనును బంధించి, అధిపతులను, సైనికులను, చేతి పనులు చేసుకునేవాళ్లను అందరినీ కలిపి బబులోనుకు తీసుకెళ్లాడు. యెహోవా ఆలయంలో ఉన్న ధనమంతా తీసుకెళ్లిపోయాడు. నెబుకద్నెజరు సిద్కియాను యూదాకు రాజుగా చేశాడు.

ముందు సిద్కియా నెబుకద్నెజరుకు నమ్మకంగా ఉన్నాడు. కానీ చుట్టూ ఉన్న దేశాలు, దొంగ ప్రవక్తలు బబులోనుకు ఎదురు తిరగమని సిద్కియాకు సలహా ఇచ్చారు. యిర్మీయా అతన్ని ఇలా హెచ్చరించాడు: ‘నువ్వు ఎదురుతిరిగితే యూదాలో ప్రజలు చచ్చిపోతారు, కరువులు, జబ్బులు కూడా వస్తాయి.’

ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాక సిద్కియా బబులోనుకు ఎదురుతిరగాలని నిర్ణయించుకుంటాడు. ఆయన ఐగుప్తు సైన్యాన్ని సహాయం చేయమని అడుగుతాడు. అప్పుడు నెబుకద్నెజరు తన సైన్యాన్ని యెరూషలేము మీదికి పంపిస్తాడు. వాళ్లు పట్టణం చుట్టూ ముట్టడిస్తారు. యిర్మీయా సిద్కియాతో, ‘యెహోవా చెప్తున్నాడు, నువ్వు బబులోనుకు లొంగిపోతే, నీకూ పట్టణానికి ఏమి కాదు. కానీ నువ్వు లొంగిపోకపోతే, బబులోనీయులు యెరూషలేమును కాల్చేసి నిన్ను బందీగా తీసుకెళ్తారు’ అని చెప్పాడు. కానీ సిద్కియా, ‘నేను లొంగిపోను’ అని అన్నాడు.

ఒకటిన్నర సంవత్సరం తర్వాత బబులోను సైన్యం యెరూషలేము గోడల్ని పగులగొట్టి, పట్టణాన్ని కాల్చేస్తుంది. ఆలయాన్ని కాల్చేసి, చాలామందిని చంపేస్తారు, వేలమందిని బందీలుగా తీసుకెళ్లిపోతారు.

సిద్కియా యెరూషలేము నుండి పారిపోతాడు కానీ బబులోనీయులు అతన్ని వెంటాడతారు. వాళ్లు యెరికో దగ్గర అతన్ని పట్టుకుని నెబుకద్నెజరు దగ్గరకు తీసుకెళ్తారు. సిద్కియా చూస్తుండగా బబులోను రాజు అతని కొడుకులను చంపేస్తాడు. తర్వాత నెబుకద్నెజరు సిద్కియాను గుడ్డివాడిని చేసి జైల్లో పడేస్తాడు. అతను అక్కడే చనిపోతాడు. కానీ యెహోవా యూదా ప్రజలకు మాట ఇస్తాడు: ‘70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని తిరిగి మీ సొంత ఊరు యెరూషలేముకు తీసుకువస్తాను.’

బబులోనుకు బందీలుగా తీసుకెళ్లిన యువకులకు ఏమి జరుగుతుంది? వాళ్లు యెహోవాకు నమ్మకంగా ఉంటారా?

“యెహోవా దేవా, సర్వశక్తిమంతుడా, నీ తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.”—ప్రకటన 16:7