కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 59

యెహోవాకు లోబడిన నలుగురు అబ్బాయిలు

యెహోవాకు లోబడిన నలుగురు అబ్బాయిలు

నెబుకద్నెజరు యూదా రాజకుటుంబంలో, అధిపతుల కుటుంబంలో ఉన్న యువకులను బబులోనుకు తీసుకెళ్లినప్పుడు, వాళ్లపై అష్పెనజు అనే ఒక అధికారిని పెట్టాడు. వాళ్లలో ఆరోగ్యంగా, తెలివిగా ఉన్న అబ్బాయిలను వెదకమని నెబుకద్నెజరు అష్పెనజుతో చెప్తాడు. ఈ అబ్బాయిలకు మూడు సంవత్సరాలు శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ వల్ల వాళ్లు బబులోనులో పెద్ద అధికారులుగా అయ్యే అవకాశం ఉంది. ఆ అబ్బాయిలు బబులోను భాషయైన అక్కాడియాను రాయడం, చదవడం, మాట్లాడడం నేర్చుకోవాలి. అంతేకాదు వాళ్లు రాజు, అతని భవనంలో ఉండే వాళ్లంతా తినేలాంటి ఆహారాన్నే తినాలి. ఆ అబ్బాయిల్లో నలుగురి పేర్లు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా. అష్పెనజు వాళ్లకు బెల్తెషాజరు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే బబులోను పేర్లు పెడతాడు. ఈ విద్య వాళ్లు యెహోవాను ఆరాధించడం ఆపేలా చేస్తుందా?

ఆ నలుగురు అబ్బాయిలు యెహోవాకు లోబడాలని నిర్ణయించుకుంటారు. రాజు తినే ఆహారం వాళ్లు తినకూడదని వాళ్లకు తెలుసు. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రంలో అపవిత్రమని చెప్పినవి ఆ ఆహారంలో ఉన్నాయి. కాబట్టి వాళ్లు అష్పెనజు దగ్గరికి వెళ్లి, ‘ప్లీజ్‌, రాజు తినే ఆహారాన్ని మాకు పెట్టవద్దు’ అని చెప్పారు. అష్పెనజు వాళ్లతో, ‘మీరు తినకుండా, మీరు బలహీనంగా ఉన్నట్లు చూస్తే రాజు నన్ను చంపేస్తాడు’ అని అంటాడు.

అప్పుడు దానియేలుకు ఒక ఐడియా వచ్చింది. ఆయన వాళ్లను చూసుకునే అతని దగ్గరికి వెళ్లి, ‘ప్లీజ్‌ ఒక పది రోజులు మాకు కూరగాయలు, నీళ్లు ఇవ్వండి చాలు. తర్వాత మమ్మల్ని రాజు ఆహారం తిన్న అబ్బాయిలతో పోల్చి చూడండి’ అని అడుగుతాడు. దానికి అతను ఒప్పుకుంటాడు.

పది రోజుల పరీక్ష తర్వాత, దానియేలు అతని స్నేహితులు మిగతా అబ్బాయిలకన్నా ఆరోగ్యంగా కనబడతారు. వాళ్లు తనకు లోబడినందుకు యెహోవాకు సంతోషంగా ఉంది. యెహోవా దానియేలుకు దర్శనాలను కలలను అర్థం చేసుకునే తెలివిని కూడా ఇచ్చాడు.

శిక్షణ అయిపోయాక, అష్పెనజు ఆ అబ్బాయిలను నెబుకద్నెజరు దగ్గరకు తీసుకువస్తాడు. రాజు వాళ్లతో మాట్లాడతాడు. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా మిగతా అబ్బాయిలకన్నా చాలా తెలివిగా, చురుకుగా ఉన్నారని రాజు గమనించాడు. ఆ నలుగుర్ని రాజు దగ్గర అతని సభలో పని చేయడానికి పెట్టుకుంటాడు. రాజు, ముఖ్యమైన విషయాల్లో ఎక్కువగా వాళ్ల సలహాలను అడిగి తెలుసుకునేవాడు. రాజు దగ్గర ఉన్న మిగతా పండితులు, మంత్రగాళ్ల కంటే యెహోవా వాళ్లను తెలివైన వాళ్లుగా చేశాడు.

దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా పరాయి దేశంలో ఉన్నప్పటికీ వాళ్లు యెహోవా ప్రజలని మర్చిపోలేదు. మీరు కూడా ఎప్పుడూ యెహోవాను గుర్తుపెట్టుకుంటారా? మీ అమ్మానాన్న మీ దగ్గర లేనప్పుడు కూడా మీరు యెహోవాను గుర్తుపెట్టుకుంటారా?

“నీ యౌవనాన్ని బట్టి నిన్ను ఎవ్వరూ, ఎప్పుడూ చిన్నచూపు చూడకుండా జాగ్రత్తపడు. మాట్లాడే విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాసం విషయంలో, పవిత్రత విషయంలో నమ్మకస్థులకు ఆదర్శంగా ఉండు.”—1 తిమోతి 4:12