కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 61

వాళ్లు సాగిలపడలేదు

వాళ్లు సాగిలపడలేదు

రాజైన నెబుకద్నెజరుకు విగ్రహం కల వచ్చిన కొంత కాలానికి ఆయన బంగారంతో పెద్ద బొమ్మను చేయిస్తాడు. ఆయన దానిని దూరా అనే మైదానంలో పెట్టించి దేశంలో ఉన్న ముఖ్యమైన వాళ్లందరినీ ఆ బొమ్మ దగ్గరకు పిలిపిస్తాడు. వాళ్లలో షద్రకు, మేషాకు, అబేద్నెగో కూడా ఉన్నారు. రాజు ‘మీరు బూరలు, హార్ప్‌లు, బ్యాగ్‌పైప్‌ల (సంగీత వాయిద్యాలు) శబ్దం వినగానే ఈ బొమ్మ ముందు సాగిలపడండి. దానికి సాగిలపడని వాళ్లను మండుతున్న అగ్ని గుండంలో పడేస్తాను’ అని ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ ముగ్గురు హెబ్రీయులు బొమ్మ ముందు సాగిలపడతారా లేదా యెహోవాను మాత్రమే ఆరాధిస్తారా?

రాజు సంగీతాన్ని వాయించమని ఆజ్ఞాపిస్తాడు. అందరూ కింద పడి ఆ విగ్రహాన్ని ఆరాధిస్తారు కాని షద్రకు, మేషాకు, అబేద్నెగో మాత్రం ఆరాధించరు. కొంతమంది అది చూసి రాజుకు ఇలా చెప్తారు: ‘ఆ ముగ్గురు హెబ్రీయులు మీ విగ్రహాన్ని ఆరాధించడానికి ఒప్పుకోలేదు.’ నెబుకద్నెజరు వాళ్లను పిలిపించి వాళ్లతో ఇలా చెప్తాడు: ‘నేను ఆ విగ్రహాన్ని ఆరాధించడానికి మీకు ఇంకో అవకాశాన్ని ఇస్తాను. మీరు ఆరాధించకపోతే అగ్నిగుండంలో పడేస్తాను. మిమ్మల్ని నా నుండి కాపాడగలిగే దేవుడే లేడు.’ అందుకు వాళ్లు ‘మాకు ఇంకో అవకాశం అవసరం లేదు. మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు. ఆయన కాపాడకపోయినా, ఓ రాజా, మేము ఈ విగ్రహాన్ని ఆరాధించము’ అని చెప్తారు.

నెబుకద్నెజరుకు చాలా కోపం వచ్చింది. ఆయన సేవకులతో ‘అగ్నిగుండాన్ని మామూలుకన్నా ఏడుసార్లు ఎక్కువ వేడిగా చేయండి’ అని చెప్తాడు. తర్వాత ఆయన సైనికులతో ‘వాళ్లను కట్టేసి అందులో పడేయండి’ అని చెప్తాడు. అగ్నిగుండం ఎంత వేడిగా ఉందంటే దాని దగ్గరకు వెళ్లగానే సైనికులు అక్కడికక్కడే చనిపోయారు. ముగ్గురు హెబ్రీయులు మంటలో పడిపోయారు. కానీ నెబుకద్నెజరు లోపలికి చూసినప్పుడు, అతనికి ముగ్గురికి బదులు నలుగురు మనుషులు ఆ అగ్నిగుండంలో తిరుగుతూ కనపడ్డారు. ఆయనకు భయం వేసి అధికారుల్ని ఇలా అడుగుతాడు: ‘మనం మంటల్లో ముగ్గుర్ని పడేశాం కదా? మరి నాకు నలుగురు కనిపిస్తున్నారు, వాళ్లలో ఒకరు దేవదూతలా ఉన్నారు.’

నెబుకద్నెజరు అగ్నిగుండం దగ్గరకు వెళ్లి ఇలా పిలిచాడు: ‘మహోన్నతుడైన దేవుని సేవకుల్లారా బయటకు రండి.’ షద్రకు, మేషాకు, అబేద్నెగో ఏమీ కాకుండా మంటలో నుండి బయటకు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ల చర్మం, జుట్టు, బట్టలు కూడా కాలలేదు. వాళ్ల దగ్గర కనీసం కాలిన వాసన కూడా రాలేదు.

నెబుకద్నెజరు ఇలా చెప్పాడు: ‘షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడు చాలా గొప్పవాడు. ఆయన తన దూతను పంపి వాళ్లను కాపాడాడు. వాళ్ల దేవుడు లాంటి దేవుడు లేడు.’

ఆ ముగ్గురు హెబ్రీయుల్లా మీరు కూడా ఏమి జరిగినా యెహోవాకు నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నారా?

“నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆరాధించాలి, ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి.”—మత్తయి 4:10