కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 62

పెద్ద చెట్టు లాంటి రాజ్యం

పెద్ద చెట్టు లాంటి రాజ్యం

ఒక రాత్రి నెబుకద్నెజరుకు భయంకరమైన కల వచ్చింది. ఆయన తన దగ్గరున్న తెలివైన వాళ్లను పిలిచి దాని అర్థం చెప్పమని అడుగుతాడు. కానీ వాళ్లలో ఒక్కరు కూడా ఆ కలను చెప్పలేకపోయారు. చివరికి రాజు దానియేలుతో మాట్లాడతాడు.

నెబుకద్నెజరు దానియేలుతో ఇలా చెప్పాడు: ‘నా కలలో నేను ఒక చెట్టుని చూశాను. అది చాలా పెద్దది అయ్యి ఆకాశం అంత ఎత్తు అయింది. అది ఎక్కడ నుండి చూసినా కనపడుతుంది. దాని ఆకులు అందంగా ఉన్నాయి, దానికి చాలా కాయలు ఉన్నాయి. జంతువులు దాని నీడలో ఉండేవి. పక్షులు దాని కొమ్మల మీద గూళ్లు కట్టుకునేవి. అప్పుడు ఒక దేవదూత పరలోకం నుండి వచ్చి ఇలా అరిచాడు: “చెట్టుని నరికేయండి. దాని కొమ్మల్ని నరికేయండి. కానీ దాని మొద్దును, వేర్లను వదిలేయండి. దాని చుట్టూ ఇనుము, రాగితో చేసిన కట్టు వేయండి. ఆ చెట్టుకున్న మనిషి గుండె, జంతువు గుండెలా మారిపోతుంది. ఏడు కాలాలు అయ్యే వరకు అది అలానే ఉంటుంది. ప్రజలందరూ దేవుడే పరిపాలకుడు అని, ఆయన ఎవరికి కావాలంటే వాళ్లకు రాజ్యాన్ని ఇస్తాడు అని తెలుసుకుంటారు.”’

యెహోవా దానియేలుకు ఆ కల అర్థం చెప్పాడు. దానియేలుకు కల అర్థం తెలియగానే భయపడ్డాడు. ఆయన ‘రాజా, ఆ కల మీ శత్రువులు గురించి అయ్యి ఉంటే బాగుండు కానీ అది మీ గురించే. నరికేసిన ఆ పెద్ద చెట్టు మీరే. మీరు మీ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. పొలంలో పశువులా గడ్డి తింటారు. అయితే దేవదూత చెట్టు మొద్దును వేర్లను వదిలేయమన్నాడు కాబట్టి మీరు మళ్లీ రాజు అవుతారు’ అని చెప్తాడు.

ఒక సంవత్సరం తర్వాత నెబుకద్నెజరు తన భవనంలో మేడ మీద నడుస్తూ, బబులోను గొప్పతనాన్ని చూసుకుంటూ ఉన్నాడు. ఆయన, ‘నేను ఎంత అద్భుతమైన పట్టణాన్ని కట్టుకున్నాను. నేను ఎంత గొప్పవాడిని’ అన్నాడు. ఆయన అలా అంటుండగానే పరలోకం నుండి ఒక స్వరం వచ్చి ఇలా చెప్పింది: ‘నెబుకద్నెజరు, ఇప్పుడు నీ రాజ్యం పోయింది.’

ఆ క్షణంలోనే నెబుకద్నెజరుకు పిచ్చి పట్టి జంతువులా అయిపోయాడు. ఆయన రాజ భవనాన్ని వదిలేసి పొలంలో పశువులతో పాటు ఉండాల్సి వచ్చింది. నెబుకద్నెజరు జుట్టు గద్ద ఈకల్లా పొడవుగా, గోర్లు పక్షి గోరుల్లా అయిపోయాయి.

ఏడు సంవత్సరాలు గడిచాక, నెబుకద్నెజరు మళ్లీ మామూలుగా అయిపోగానే యెహోవా తిరిగి అతనిని బబులోనుకు రాజుగా చేశాడు. అప్పుడు నెబుకద్నెజరు ‘నేను పరలోకానికి రాజైన యెహోవాను స్తుతిస్తాను. యెహోవాయే పరిపాలకుడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఆయన గర్విష్ఠులను తగ్గిస్తాడు, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకు రాజ్యాన్ని ఇవ్వగలడు’ అని అంటాడు.

“నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.”—సామెతలు 16:18