కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 63

గోడ మీద రాసిన మాటలు

గోడ మీద రాసిన మాటలు

కొంతకాలానికి బెల్షస్సరు బబులోనుకు రాజు అవుతాడు. ఆయన దేశంలో వెయ్యిమంది ముఖ్యమైన వాళ్లను ఒక రోజు రాత్రి విందుకు పిలుస్తాడు. నెబుకద్నెజరు యెహోవా ఆలయం నుండి తెచ్చిన బంగారు గిన్నెల్ని బెల్షస్సరు తన సేవకులతో తెప్పిస్తాడు. బెల్షస్సరు అతని అతిథులు ఆ గిన్నెల్లో తాగి వాళ్ల దేవుళ్లను పొగుడుతారు. వెంటనే ఒక మనిషి చేయి కనపడి భోజనం చేసే గది గోడ మీద ఏవో విచిత్రమైన మాటలు రాస్తుంది.

బెల్షస్సరుకి చాలా భయం వేస్తుంది. ఆయన తన దగ్గరున్న మంత్రగాళ్లను పిలిచి వాళ్లకు ఇలా మాట ఇస్తాడు: ‘ఈ మాటల్ని ఎవరైనా వివరిస్తే, వాళ్లకు నేను బబులోనులో మూడవ స్థానం ఇస్తాను.’ వాళ్లు ప్రయత్నించారు కానీ ఒక్కరు కూడా ఆ మాటలకు అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు రాణి వచ్చి ఇలా చెప్తుంది: ‘దానియేలు అనే ఒకతను రాజైన నెబుకద్నెజరుకు అన్నీ చెప్తుండేవాడు. ఆయన ఈ మాటల అర్థాన్ని నీకు చెప్పగలడు.’

దానియేలు రాజు దగ్గరకు వస్తాడు. బెల్షస్సరు అతనితో ‘నువ్వు ఈ మాటల్ని చదివి వివరించగలిగితే నేను నీకు బంగారు దండని ఇచ్చి బబులోనులో అధికారం ఉన్నవాళ్లలో నిన్ను మూడవ వాడిని చేస్తాను’ అన్నాడు. అప్పుడు దానియేలు ఇలా చెప్పాడు: ‘నాకు నీ బహుమానాలు వద్దు. కానీ నేను ఈ మాటలు ఏంటో చెప్తాను. మీ నాన్న నెబుకద్నెజరు చాలా గర్వంగా ఉండేవాడు కానీ యెహోవా ఆయనను తగ్గించాడు. ఆయనకు జరిగిందంతా నీకు తెలుసు, అయినా నువ్వు యెహోవా ఆలయంలో నుండి తెచ్చిన గిన్నెల్లో తాగి యెహోవాకు గౌరవం చూపించలేదు. కాబట్టి దేవుడు ఈ మాటలు రాశాడు: మెనే మెనే టెకేల్‌ ఉఫార్సీన్‌. వాటికి అర్థం మాదీయులు, పారసీకులు బబులోనును ఓడిస్తారు. నువ్వు ఇంక రాజుగా ఉండవు.’

బబులోనును ఎవరూ ఓడించలేరు అని అనిపించేది. ఆ పట్టణం చుట్టూ పెద్దపెద్ద గోడలు, లోతైన నది ఉన్నాయి. కానీ ఆ రాత్రే మాదీయులు, పారసీకులు వచ్చి దాడి చేశారు. పర్షియా రాజైన కోరెషు నదిని దారి మళ్లించి సైనికులు నదిలో నడుచుకుంటూ పట్టణ గేట్ల వరకు వెళ్లిపోయేలా చేశాడు. వాళ్లు అక్కడికి వెళ్లే సరికి పట్టణ గేట్లు తెరిచి ఉన్నాయి. వెంటనే సైన్యం లోపలికి వెళ్లిపోయి పట్టణాన్ని ఓడించి రాజుని చంపేశారు. తర్వాత కోరెషు బబులోనుకు రాజు అవుతాడు.

ఒక సంవత్సరం లోపే కోరెషు ఇలా ప్రకటిస్తాడు: ‘యెహోవా నాకు యెరూషలేములో ఆయన ఆలయాన్ని కట్టమని చెప్పాడు. అందుకు సహాయం చేయాలనుకున్న ఆయన ప్రజలు ఎవరైనా వెళ్లవచ్చు.’ కాబట్టి యెహోవా మాట ఇచ్చినట్లే, చాలామంది యూదులు యెరూషలేము నాశనమైన 70 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. ఆలయం నుండి నెబుకద్నెజరు తెచ్చిన బంగారు, వెండి గిన్నెల్ని, సామానుల్ని కోరెషు తిరిగి పంపించేస్తాడు. యెహోవా ఆయన ప్రజలకు సహాయం చేయడానికి కోరెషుని ఎలా ఉపయోగించుకున్నాడో చూశారా?

“ఆమె కూలిపోయింది! మహాబబులోను కూలిపోయింది. చెడ్డదూతలకు . . . ఆమె నివాస స్థలంగా మారింది!”—ప్రకటన 18:2